Referenda
-
‘మిర్యాల’లో ఆన్లైన్ ప్రజాభిప్రాయ సేకరణ
మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ నియోజకవర్గాన్ని నల్లగొండ జిల్లాలోనే కొనసాగించాలని కోరుతూ శుక్రవారం బీసీ యువ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద ‘ఆన్లైన్’ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా బీసీ యువ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుమలగిరి అంజి మాట్లాడుతూ మిర్యాలగూడను నల్లగొండ జిల్లాలో కానీ సూర్యాపేట జిల్లాలో కానీ కలపాలంటే ముందుగా ప్రజల అభిప్రాయం మేరకే చేయాలన్నారు. అన్నీ సౌకర్యాలు కలిగి ఉన్న మిర్యాలగూడను జిల్లా చేయకుండా ఏ అర్హతలేని సూర్యాపేటను జిల్లా చేయడంలో అంతర్యమేమిటన్నారు. కొంతమంది నాయకులు నల్లగొండ జిల్లాలో కాకుండా సూర్యాపేట జిల్లాలో మిర్యాలగూడ నియోజకవర్గాన్ని కలపాలని కోరడం సరైంది కాదన్నారు. నల్లగొండ జిల్లాలోనే మిర్యాలగూడను కొనసాగించకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలు, వివిధ సంఘాల నాయకులు టి.కోటేశ్వర్రావు, శ్రీను, ఇండ్ల గణేష్, కుర్ర విష్ణు, వేణు, హుస్సేన్, షోయబ్, శివకుమార్, శంకు, వినయ్, శ్రవణ్, కిరణ్, బచ్చలకూరి శ్రీనివాస్ తదితరులున్నారు. -
ప్రజాభిప్రాయ సేకరణ నిలిపివేయాలి
నల్లగొండ టూటౌన్ : రామన్నపేట మండలంలోని కక్కిరేణి గ్రామంలో ప్రమాదకర వ్యర్థాల నిర్వహణ, నిల్వ చేసే తెలంగాణ వ్యర్థ నిర్వహణ ప్రాజెక్టు పేరుతో జరిపే ప్రజాభిప్రాయ సేకరణ నిలిపివేయాలని కోరుతూ అఖిల పక్ష పార్టీల నేతలు మంగళవారం కలెక్టర్ పి. సత్యనారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. గ్రామ సమీపంలో వివిధ సర్వే నంబర్లలో 74 ఎకరాల స్థలంలో కంపెనీ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు. ఇటువంటి కంపెనీ వల్ల నీరు, గాలి కలుషితం కానుందని, ఇప్పటికే మూసీ నీరు కలుషితమైందని, చౌటుప్పల్ ప్రాంతంలో 60 కెమికల్ కంపెనీల వల్ల తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని వివరించారు. వినతిపత్రం అందజేసిన వారిలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర కన్వీనర్ చెరుకు సుధాకర్, టీడీపీ నల్లగొండ నియోజకవర్గ ఇన్చార్జి కంచర్ల భూపాల్‌రెడ్డి, నార్కట్‌పల్లి జెడ్పీటీసీ దూదిమెట్ల సత్తయ్య, సీపీఐ నాయకుడు శ్రవణ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
మల్లన్నసాగర్‌పై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలి
ఆలేరు : మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు రాచకొండ జనార్దన్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో గురువారం జరిగిన ఆ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్నారు. రైతులు, ప్రజల మనోభావాలను పట్టించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బి.కుమార్, వెంకటేశ్, రాజయ్య, భాస్కర్, కుమార్, నర్సింహారెడ్డి, ఉప్పలయ్య, శ్రీను పాల్గొన్నారు. -
బెజవాడ స్వచ్ఛ ర్యాంకెంతో?
జనవరి 2 నుంచి స్వచ్ఛభారత్ మిషన్ సర్వే ఫోన్ల ద్వారా అభిప్రాయాల సేకరణ ర్యాంకింగ్‌ను బట్టి ప్రోత్సాహకాలు విజయవాడ సెంట్రల్ : స్వచ్ఛభారత్ మిషన్ సిటీ ర్యాంకింగ్ సర్వేకు రంగం సిద్ధం చేసింది. దేశంలో మొత్తం 75 నగరాలను ఎంపిక చేయగా రాష్ర్టంలో విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు కార్పొరేషన్లను ఎంపిక చేశారు. ది క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సర్వే ఏజెన్సీ జనవరి రెండో తేదీ నుంచి క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించనుంది. ఈక్రమంలో నగరపాలక సంస్థ అధికారులు మూడు సర్కిళ్ల పరిధిలో 18 ప్రాంతాలను ఎంపిక చేశారు. మురికివాడలు, కొండప్రాంతాలు, అభివృద్ధి చెందిన ప్రాంతాలకు అందులో చోటు కల్పించారు. సర్వే ఏజెన్సీ నిర్వాహకులు ఫోన్ ద్వారా కూడా అభిప్రాయసేకరణ చేయనున్న నేపథ్యంలో నగరంలో పదివేల ఫోన్ నంబర్లను ప్రజారోగ్యశాఖ అధికారులు సర్వే ఏజెన్సీకి అందించారు. సర్వే ఇలా బహిరంగ మల, మూత్ర విసర్జన, వ్యక్తిగత మరుగుదొడ్లు, కమ్యూనిటీ టాయ్‌లెట్స్, బస్టాండ్, రైల్వే స్టేషన్, వాణిజ్య కేంద్రాల్లో టాయ్‌లెట్స్ నిర్మాణం, ఇంటింటి చెత్త సేకరణ, రోడ్లు పరిశుభ్రం చేయడం, శాస్త్రీయ పద్ధతిలో చెత్త తరలింపు, బిహేవియర్ బేస్డ్ కమ్యూనికేషన్, పబ్లిక్ టాయ్‌లెట్స్ పరిశుభ్రత, మురికివాడల అభివృద్ధి, రవాణా అంశాలపై ప్రధానంగా సర్వే చేయనున్నారు. 18002672777 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి అభిప్రాయాలను తెలియజేయవచ్చు. వచ్చిన ర్యాంకింగ్ ఆధారంగా సుమారు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు నగదు ప్రోత్సాహకాలను అందించనున్నారు. అధ్వానం.. నగరంలో పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా మారింది. ఇంటింటి చెత్త సేకరణ 40 శాతానికి మించడం లేదు. 6,500 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణం చేయాలని గతంలో అధికారులు నిర్ణయించగా స్థలాభావం కారణంగా 1,150 మాత్రమే నిర్మాణం చేశారు. కమ్యూనిటీ టాయ్‌లెట్స్ నిర్వహణ గాలికి వదిలేశారు. చెన్నై తరహాలో రాఘవయ్య పార్క్‌లో నిర్మాణం చేసిన నమ్మా టాయ్‌లెట్స్ ప్రజలకు అందుబాటులోకి తేవడంలో అధికారులు విఫలమయ్యారు. ఏలూరు, బందరు రోడ్లను చెత్త రహిత రోడ్లగా తీర్చిదిద్దాలన్న ఆదేశాలు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. శివారు ప్రాంతాల్లో పారిశుధ్య పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. మురికివాడలు కనీస వసతులకు ఆమడదూరంలో ఉన్నాయి. ఈక్రమంలో నగరం ర్యాంకింగ్‌లో వెనుక బడుతోందనే భయం అధికారుల్ని వెంటాడుతోంది.