
కనీసం చిత్తూరు నాయుడిగానైనా ఉండండి: అంబటి
చంద్రబాబు నాయుడు సింగపూర్ నాయుడిగా కాక.. ఏపీ నాయుడిగా వ్యవహరించాలని, కనీసం చిత్తూరు నాయుడిగానైనా ఉండాలని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. రాజధాని భూముల విషయంలో నమ్మశక్యం కాని వాస్తవాలు బయటపడుతున్నాయని ఆయన అన్నారు. రైతులు తీవ్ర నిస్పృహలో కాలం గడుపుతున్నారని, రైతు పరిస్థితి పిల్లికి చెలగాటం.. ఎలకకు ప్రాణసంకటం అన్నట్లుందని చెప్పారు.
భూములిచ్చి తాము ఏమైపోవాలన్న దిగులుతో రైతులు కుంగిపోతున్నారని అంబటి రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు డ్రామాలు ఆపి, రైతులను అర్థం చేసుకోవాలన్నారు. ఆయనను రైతుద్రోహిగా ప్రజలు భావిస్తున్నారని విమర్శించారు. ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా వైఎస్ఆర్సీపీ చూస్తూ ఊరుకోదని, ప్రజా ఉద్యమం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.