గ్యాస్‌గోడౌన్ పక్కనే పైప్ బాంబు
గుర్తించి నిర్వీర్యం చేసిన బాంబు స్క్వాడ్
జగ్గయ్యపేటలో తప్పిన పెను ప్రమాదం
జగ్గయ్యపేట, న్యూస్‌లైన్: కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో గ్యాస్ గోడౌన్ పక్కనే హైఎక్స్‌ప్లోజివ్ పైప్‌బాంబు లభించడం సంచలనం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం.. జగ్గయ్యపేటలోని జైసంతోషి గ్యాస్ గోడౌన్ లో బాంబు ఉందంటూ ఈనెల 7న గోడౌన్ యజమాని మూర్తికి ఫోన్‌కాల్ వచ్చింది. ఆయన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. గోడౌన్‌ను, కార్యాలయాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేసినా బాంబు ఆచూకీ తెలియలేదు. అయితే గోడౌన్‌లో బాంబు ఉందంటూ ఎస్‌ఐ శ్రీనుకు గురువారం, శుక్రవారం కూడా ఫోన్‌కాల్స్ వచ్చాయి. దీంతో ఎస్‌ఐ మరోసారి ఉదయం నుంచి తన సిబ్బందితో గోడౌన్ చుట్టుపక్కల ప్రాంతాలను తనిఖీలు చేశారు.
బాంబు స్క్వాడ్ సుమారు గంటపాటు తనిఖీ చేసిన అనంతరం గోడౌన్ పక్కన కారు పార్కింగ్ సమీపంలో ఉన్న పొదల్లో బాంబును గుర్తించారు. మూడు గంటలపాటు శ్రమించి దాన్ని నిర్వీర్యం చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అరకిలో అమోనియో నైట్రేట్, 250 గ్రాముల జిలిటెన్ స్టిక్స్ పేలుడు పదార్థాలను 12అంగుళాల పైపులో ఉంచి దానికి సేప్టీ ఫీజును ఏర్పాటుచేసి ఈ బాంబును తయారుచేశారు. ఇది పూర్తిగా నాన్ ఎలక్ట్రికల్ డిటోనేటర్ కావడంతో నిర్వీర్యం చేయడానికి స్క్వాడ్ అధికారులు తీవ్రంగా శ్రమించారు. ఈ బాంబు పేలితే పక్కనే ఉన్న గ్యాస్ గోడౌన్‌కూడా పేలి పెను ప్రమా దం సంభవించేదని, వేలాదిమంది మృతి చెందేవారని ఆందోళన వ్యక్తంచేశారు.