షాడో ఎమ్మెల్యే దందా | TDP MLA hulchul in jaggayyapet | Sakshi
Sakshi News home page

షాడో ఎమ్మెల్యే దందా

Published Thu, Oct 15 2015 9:48 AM | Last Updated on Sun, Sep 3 2017 11:01 AM

షాడో ఎమ్మెల్యే దందా

షాడో ఎమ్మెల్యే దందా

విజయవాడ : వచ్చేది మన కంపెనీ. మన కంపెనీ అంటే అందరిది. గ్రామస్తులు ఎదురు తిరగకుండా, వ్యతిరేకత రాకుండా మీరే చూసుకోవాలి. ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా ‘బాస్’ నుంచి ఫోన్ వస్తే అంతే సంగతులు. కాబట్టి ఎవరెవరికి ఏం కావాలో అడిగి తీసుకెళ్లండి. ఒట్టిచేతులతో వెళితే మాత్రం కుదరదు. ఇదీ జగ్గయ్యపేట పరిధిలోని స్థానిక ప్రజాప్రతినిధులకు షాడో ఎమ్మెల్యే ఇచ్చిన వార్నింగ్.
 
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీప బంధువు కేఎస్‌ఎన్ మూర్తి జగ్గయ్యపేటలోని జయంతిపురంలో వీబీసీ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ పేరుతో భారీ కర్మాగారాన్ని నిర్మించనున్నారు. రూ.10వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే పరిశ్రమకు ఎక్కడా చిన్నపాటి ఆటంకం లేకుండా సజావుగా సాగించటానికి స్థానికంగా ఉన్న అధికార పార్టీ నేతలు రంగంలోకి దిగారు.
 
తీవ్ర విష వాయువులు వెలువరించే ఈ పరిశ్రమతో 7 గ్రామాలకు సమీపంలోని జగ్గయ్యపేటకు తీవ్ర ముంపు ఉంటుంది. ముఖ్యంగా పరిశ్రమలోని అమ్మోనియన్ నైట్రిక్, యాసిడ్, అమ్మోనియా ప్లాంట్ల నుంచి వెలువడే వ్యర్థాలు పొగ తీవ్ర ప్రాణహాని కలిగించే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో ప్రజాభిప్రాయ సేకరణలో పరిశ్రమ ఏర్పాటుపై ప్రజలందరూ వ్యతిరేకించటానికి ఇటీవల సన్నద్ధమయ్యారు.
 
నయానా.. భయానా..
గురువారం జరిగే ప్రజాభిప్రాయ సేకరణలో అవాంతరాలు ఎదురుకాకుండా వీబీసీ ప్రతినిధులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ బాధ్యతలను నియోజకవర్గ ప్రజాప్రతినిధి భుజానికి ఎత్తుకొని ఈ బాధ్యతలు తన సోదరుడికి అప్పగించారు. దీంతో గత 5 రోజులుగా జయంతిపురం, రావిరాల, వేదాద్రి, చిల్లకల్లు, ముక్త్యాల, కేఅగ్రహారం, ధర్మవరప్పాడు తండా, బూదవాడ గ్రామాల్లో ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ స్థానిక నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. ఈ క్రమంలో తొలుత ముఖ్యులందరికీ నేరుగా కంపెనీ ప్రతినిధులతో భారీ ప్యాకేజీలు ఇప్పించి గ్రామాల్లో ప్రజలందరినీ పూర్తిస్థాయిలో ఒప్పించే బాధ్యత వారిపై పెట్టారు.
 
పరిశ్రమ మరో మూడేళ్లలో వస్తుందని, పరిశ్రమ మొదలయ్యాక నియోజకవర్గంలో నైపుణ్యత ఉన్న వెయ్యి మందికి వెంటనే ఉద్యోగాలు ఇస్తారని, తరువాత ఏడాదికి 50 నుంచి 100 మంది చొప్పున తీసుకుంటారని, గ్రామంలో నిరుద్యోగం అనేదే ఉండదని విస్తృత ప్రచారం చేయాల్సిందిగా సదరు షాడో ఎమ్మెల్యే సూచించారు. దీంతో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి అందరికి పరిస్థితి వివరించి కొందరికి డబ్బు ఆశ, మరికొందరికి ఉద్యోగాల ఆశ చూపి దారిలోకి తెచ్చారు.
 
దీంతో కొన్ని గ్రామాల్లో పదుల సంఖ్యలో డబ్బు పంపిణీ పూర్తి చేశారు. మరో వైపు కంపెనీ ప్రతినిధి రామారావు గత 5 రోజులుగా జగ్గయ్యపేటలోనే ఉండి అన్ని గ్రామాల్లో తిరుగుతూ పరిస్థితిని చక్కబెడుతున్నారు. మరోవైపు వ్యతిరేకించిన వారిపై తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరికలు కూడా గ్రామాల్లోకి పంపటం, అవసరమైతే బైండోవర్ కేసులు పెట్టించటానికి వెనుకాడేది లేదని పరోక్షంగా చెప్పటంతో గ్రామస్తుల వెన్నులో వణుకు మొదలైంది. ఇప్పటికే తీవ్ర కాలుష్య కోరల్లో ఉన్న జగ్గయ్యపేట సమీపంలో ఈ పరిశ్రమ వస్తే తీవ్రత మరింత పెరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement