ఎన్నెన్నో.. అందాలు | Best Tourism Spots In West Godavari | Sakshi
Sakshi News home page

జిల్లాలో అడుగుడుగునా పర్యాటకమే..

Published Fri, Sep 27 2019 8:50 AM | Last Updated on Thu, Oct 3 2019 11:55 AM

Best Tourism Spots In West Godavari - Sakshi

• నేడు వరల్డ్‌ టూరిజం డే

గలగల పారే గోదావరి.. కిలకిలరావాల కొల్లేరు.. పాపికొండల సోయగం.. ఏజెన్సీలోని కొండకోనల్లో సవ్వడి చేసే సెలయేళ్లు.. ఆహ్లాదపరిచే అడవులు.. మరో పక్క ఆధ్యాత్మిక సాగరంలో ఓలలాడించే ఆలయాలు.. ఇలా ఆనందంలో ముంచెత్తే ప్రకృతి అందాలకు.. ఆధ్యాత్మిక  దేవాలయాలకు జిల్లాలో కొదవ లేదు.. పర్యాటకులను సేదతీర్చే టూరిజం స్పాట్లకు కొరత లేదు.. నేడు వరల్డ్‌ టూరిజం డే సందర్భంగా అలాఅలా.. ఆ వివరాలు ఇలాఇలా..

సాక్షి, బుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీ ప్రాంతం ఆహ్లాదానికి నెలవు. ఇక్కడ చెట్టు, చేమ, నీరు, రాయి, కొండ ప్రతీది ఆకర్షణీయమే.. ప్రత్యేకమైనవే.. ఈ ప్రాంతంలోని జలపాతాలు.. కొలువైన వన దేవతలు.. ప్రసిద్ధ పర్యాట ప్రాంతాలుగా విరాజిల్లుతున్నాయి. గోదావరిలో కొనసాగే పాపికొండల యాత్ర అత్యంత మధురమైన అనుభూతిని ఇస్తుంది. పోలవరం మండలం సింగన్నపల్లి నుంచి పాపికొండల యాత్ర మొదలవుతుంది. ప్రకృతి ఒడిలో ప్రయాణించేందుకు దేశం నలుమూలల నుంచి పర్యాటకులు ఇక్కడకు తరలివస్తుంటారు. గతంలో పట్టిసీమ, పోలవరం, రాజమండ్రి నుంచి బోట్లలో ప్రయాణం సాగించేవారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల సింగన్నపల్లి నుంచి బోటు ప్రయాణం ఏర్పాట్లు ఉన్నాయి.

అయితే ఈ ఏడాది గోదావరి విహార యాత్రలో విషాదం చోటు చేసుకుంది. ప్రయాణ సమయంలో కచ్చితమైన జాగ్రత్తలు తీసుకుంటే పాపికొండల విహారయాత్రలో అనుభూతి మరువలేనిదని పర్యాటకులు అంటున్నారు. పాపికొండల యాత్రలో పట్టిసీమ, వీరభద్రస్వామి, మహానందీశ్వరస్వామి ఆలయాలు, తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని గండిపోచమ్మ గుడి, బ్రిటీష్‌ కాలం నాటి పోలీస్‌స్టేషన్, 11వ దశాబ్దం నాటి ఉమా చోడేశ్వరస్వామి ఆలయం, కొరుటూరు రిసార్ట్స్‌ను సందర్శించవచ్చు. గోదావరి వెంబడి గట్లపై గిరిజన గ్రామాల్లోని ఇళ్లు పర్యాటకులకు ఆనందాన్ని, అనుభూతిని కలిగిస్తాయి. పేరంటపల్లి శివుని గుడి ఆధ్యాత్మిక విశ్రాంతినిస్తుంది.

కొండల్లో కొలువైన గుబ్బల మంగమ్మ
దట్టమైన అటవీప్రాంతం ఎత్తైన కొండలు మధ్య గుహలో కొలువైన తల్లి గుబ్బల మంగమ్మ. గిరిజన ఆరా«ధ్య దేవతగా పూజలందుకుంటున్న ఈమెకు వరాలిచ్చే దేవతగా పేరు. ప్రతి ఆది, మంగళవారం అమ్మ దర్శనానికి భక్తులు వేల సంఖ్యలో తరలివస్తుంటారు. బుట్టాయగూడెం మండలం కామవరం దాటిన తరవాత దట్టమైన అడవిలో కొంత దూరం వెళ్లిన తరవాత అమ్మ గుడి వస్తుంది. బుట్టాయగూడెం మండలంలోని మారుమూల కొండరెడ్డి గ్రామమైన ముంజులూరు సమీపంలో ఏనుగుల తోగు జలపాతం చూపరులను ఆకర్షిస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌ జీవనాడిగా మారనున్న పోలవరం ప్రాజెక్టు పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటుంది. ప్రాజెక్టు పూర్తి అయ్యి టూరిస్ట్‌ హబ్‌గా అభివృద్ధి పరిస్తే ప్రపంచ స్థాయి పర్యాటకుల్ని ఆకర్షిస్తాయని ప్రకృతి ప్రేమికులు పేర్కొంటున్నారు.

కనువిందు చేసే కొల్లేరు అందాలు


ఆకివీడు: పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల సరిహద్దులో సహజ సిద్ధంగా ఏర్పడిన కొల్లేరు సరస్సు 340 చ.మైళ్ల విస్తీర్ణంలో ఉంది. సరస్సు పరీవాహక ప్రాంతంలో సుమారు 280 రకాల పక్షులు సంచరిస్తున్నాయి. కొల్లేరు ప్రాంతంలో పడవలు, దోనెలు, లాంచీలలో ప్రయాణం పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతుంది. కొల్లేరులో పక్షి ఆవాస కేంద్రాలు ఆటపాక, గుడివానిలంక ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ ప్రాంతాలకు విదేశీ పక్షులు ఏటా సెప్టెంబర్‌ నుంచి డిసెంబర్‌ నెలవరకూ వలస వచ్చి విడిది చేస్తుంటాయి. మరికొన్ని విదేశీ పక్షులు ఈ ప్రాంతాల్లోనే జీవిస్తున్నాయి. కొల్లేటి అందాల్ని మరింతగా తిలకించేందుకు కొల్లేరు నడిబొడ్డున ఉన్న పెద్దింటి అమ్మవారి ఆలయంకు చేరుకుంటే ఆ ప్రాంతం నుంచి కూడా కొల్లేరు అందాలు తిలకించవచ్చు.

చారిత్రక ప్రసిద్ధి గుంటుపల్లి బౌద్దాలయాలు
కామవరపుకోట: జిల్లాలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన గుంటుపల్లి బౌద్దాలయాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంటాయి. ఇవి క్రీ.పూ.3వ శతాబ్దానికి చెందినవిగా చరిత్రకారులు చెబుతున్నారు. క్రీ.పూ 10వ శతాబ్దం వరకు ప్రముఖ బౌద్దారామాలుగా విరాజిల్లాయి. ఈ గుహలను క్రీ,శ 4వ శతాబ్దంలో చైనా నుంచి షాహియాన్, 7వ శతాబ్దంలో హుయాన్‌సాంగ్‌ సందర్శించారు.  నేటికి ఈ గుహలను సందర్శించటానికి విదేశాల నుంచి సయితం ప్రతీ ఏడాది విదేశాల నుంచి పర్యాటకులు రావడం విశేషం. ఈ గుహలలో వర్తులాకారములో ఉన్న స్థూపంను «ప్రస్తుతం దర్మలింగేశ్వరస్వామిగా స్థానికులు కొలుస్తున్నారు. ఇసుక రాతి కొండ అంచున వేరు వేరు పరిణామాలలో తొలిచిన గదులు కూడా ఇచట కలవు. ఉప్పలపాడు నుంచి జీలకర్రగూడెం వరకు పది కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ కొండలు సర్పం ఆకారంలో మెలికలు తిరిగి ఉండటంతో మహానాగపర్వతముగా వర్ణిస్తుంటారు. అనేక ప్రత్యేకతలతో ఈ ప్రాంతం పర్యాటకులను ఆకర్షిస్తోంది.

ప్రకృతి నడుమ మద్ది, పారిజాతగిరి


జంగారెడ్డిగూడెం రూరల్‌: జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెంలో మద్ది ఆంజనేయస్వామి ఆలయం, జంగారెడ్డిగూడెంలో పచ్చని కొండల నడుమ కొలువై ఉన్న శ్రీ గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాలు అటు పర్యాటకులను, ఇటు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ప్రకృతి అందాల నడుమ ఈక్షేత్రాలు కొలువై ఉన్నాయి. నిత్యం అనేక మంది ఈ క్షేత్రాలను దర్శించుకుంటారు. ఎర్రకాలువ ఒడ్డున మద్ది క్షేత్రం ఉండగా, ఏడు కొండల నడుమ పారిజాతగిరి వెంకన్న క్షేత్రాలు ఉన్నాయి. పారిజాతగిరి కొండ పై నుంచి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న కొండల సముహాలు చూపే పర్యాటకులకు, భక్తులు ఎంతో కనువిందు చేస్తుంటాయి.

పర్యాటక కేంద్రంగా పెనుగొండ దివ్యక్షేత్రం
పెనుగొండ : వాసవీ కన్యకాపరమేశ్వరి పుట్టినిల్‌లైన పెనుగొండ దివ్యక్షేత్రం పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. ప్రపంచంలోనే అతి పెద్దదైన 90 అడుగుల వాసవీ మాత పంచలోహ విగ్రహ ప్రతిష్ఠాపన అనంతరం రికార్డు స్థాయిలో పెనుగొండను రెండు లక్షలకు పైగా పర్యాటకులు అమ్మవారిని సందర్శించారని అంచనా. దేశంలోనే నలుమూలల నుంచి నిత్యం భక్తులు వచ్చి వాసవీ శాంతి థాంలోని వాసవీ మాతను, మూలవిరాట్‌ నగరేశ్వర మహిషాసురమర్దనీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఏపీ టూరిజం సైతం పెనుగొండను పర్యాటక రంగంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో వాసవీ శాంతి థాం, మూలవిరాట్‌ ఆలయాలకు విస్త్రత ప్రచారం కల్పిస్తోంది.

విశ్రాంతినిచ్చే  దొంగరావిపాలెం రిసార్ట్స్‌
పెనుగొండ: ఏపీ టూరిజం ఆధ్వర్యంలో దొంగరావిపాలెంలో వశిష్టా గోదావరి తీరంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో రిసార్ట్స్‌ ఏర్పాటు చేయడంతో దొంగరావిపాలెంకు 
ప్రత్యేక స్థానం ఏర్పడింది. తణుకు రాజమండ్రి జాతీయ రహదారిలో వశిష్టాగోదావరి బ్రిడ్జికు ముందుగా ఎడమవైపు నుంచి కిలోమీటరు దూరంలో గోదావరి గండి ప్రాంతంలో రిసార్ట్స్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. దీంతో శని, ఆదివారంలు రిసార్ట్స్‌ సందర్శకుల తాకిడితో కళకళలాడుతుంది.

భక్తుల కొంగుబంగారం.. చినవెంకన్న


ద్వారకాతిరుమల: పవిత్ర గౌతమి– కృష్ణవేణి పుణ్యనదుల నడుమ శేషాకార రమణీయ సుందరగిరిపై కొలువైన పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల. ఇక్కడ స్వయం వ్యక్తునిగా కొలువు తీరిన చినవెంకన్న పుట్టలో వెలిశారు. స్వామివారి పాదుకలు పుట్టలో ఉండటంతో శ్రీవారికి పాదపూజ లేదు. దీంతో పెద్ద తిరుపతి నుంచి పాదపూజ కోసం సర్వాంగ సంపూర్ణమైన శ్రీనివాసుని తీసుకొచ్చి శ్రీవైఖానస ఆగమ శాస్త్రోక్తంగా స్వయం వ్యక్తుని వెనుక ప్రతిష్ఠించారు. దీంతో ఒకే అంతరాలయంలో స్వామి వారు ద్విమూర్తులుగా కొలువై ఉండటం ఇక్కడ విశేషం. ఇద్దరు మూర్తులు ఉండటం వల్ల ఏటా ఈ క్షేత్రంలో రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. చినవెంకన్నకు వైశాఖ మాసంలోను, పెద్ద వెంకన్నకు ఆశ్వయుజ మాసంలోను తిరుకల్యాణ మహోత్సవాలు నిర్వహిస్తారు. స్వామివారి సన్నిధికి కుడివైపు అలివేలు మంగమ్మ, ఆండాళ్‌ అమ్మవార్ల ఆలయాలు ఉన్నాయి. స్వామివారి వార్షిక ఆదాయం రూ.100 కోట్ల పైమాటే. ఈ క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతోంది.

ఆచంటేశ్వరుడ్ని దర్శించుకుందామా?
ఆచంట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగానూ, పర్యాటక కేంద్రంగానూ ఆచంటలోని శ్రీఉమా రామేశ్వరస్వామి ఆలయం విరాజిల్లుతోంది. ఈ స్వామి స్త్రీ స్తనాగ్రభాగాన ప్రత్యక్షం కావడంతో ఆచంటీశ్వరుడు... ఆచంటేశ్వరునిగానూ భక్తులచే కొలువబడుతున్నట్లు స్థల పురాణం. మహాశివరాత్రి పర్వదినాన స్వామివారికి లింగోద్భవకాలమందు ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే సకల పాపాలు హరిస్తాయని భక్తుల నమ్మకం. కార్తీకమాసంలో కార్తీక పౌర్ణమి పర్వదినాన శ్రీస్వామి వారి ఆలయంలో కర్పూరజ్యోతి ప్రజ్వలన కార్యక్రమం వేడుకగా సాగుతుంది. ఉత్తర భారతదేశంలోని కాశీవిశ్వేరుని ఆలయం తర్వాత ఆచంటేశ్వరాలయంలో మాత్రమే కర్పూరజ్యోతిని వెలిగించడం ఇక్కడ విశేషం.

అరుదైన జైనదేవాలయం 
ఆచంట: ఆచంటలోని జైన దేవాలయం జైనుల పుణ్యక్షేత్రంగానూ, పర్యాటక కేంద్రగా భాసిల్లుతోంది. 2007 జూలై 22న స్థానిక రామగుండం చెరువులో జైనతీర్థంకరున విగ్రహం బయల్పడింది. జైనతీర్థంకరుల్లో 6వ వారైన శ్రీ పద్మప్రభువారిగా జైన సాధువులు గుర్తించారు. ఇది రాష్ట్రంలోని అతి పెద్ద జైనతీర్థంకరుని విగ్రహంగా నిర్ధారించారు. రూ.3 కోట్లు వెచ్చించి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించారు. గర్భగుడిని పూర్తిగా పాలరాతితో నిర్మించారు. ఆలయం పర్యాటకులను ఆకర్షిస్తోంది.  

వనభోజనాలు కేరాఫ్‌ బైరాగిమఠం
పెంటపాడు: మండలంలోని కె.పెంటపాడు గ్రామంలోని బైరాగిమఠంగా పిలిచే వేణుగోపాలస్వామి ఆలయం ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. ఇటీవల కురిసిన వర్షాల వల్ల ఆలయం పచ్చదనం సంతరించుకొంది. కార్తీకమాసంలో ఇక్కడ వనభోజనాలు ఆరగిస్తే ఎంతో పుణ్యఫలం దక్కుతుందని నమ్ముతారు. ఇక్కడ సుమారు 70కి పైగా గోవులను దేవాదాయశాఖ ఆధ్వర్యంలో పోషిస్తున్నారు. ఈ ఆలయ ప్రాంతంలో పలు ఉపాలయాలు, దేవుళ్ల విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement