జూన్ 1 నుంచే
తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ విధులు
ఆస్తులు, అప్పులు, ఉద్యోగులు, పెట్టుబడి వాటాల విభజన, బదిలీ
రెండు రాష్ట్రాల్లో వేర్వేరు రంగుల లేబుల్స్
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయవనరుగా ఉన్న ఎక్సైజ్ శాఖ, బేవరేజెస్ కార్పొరేషన్లు రెండుగా విడిపోయాయి. రెండు ప్రాంతాలకు ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల విభజన ఇప్పటికే పూర్తిచేసిన ఎక్సైజ్ శాఖ అధికారికంగా జూన్ ఒకటి నుంచి విధులు నిర్వర్తించబోతుంది. రెండు రాష్ట్రాలకు సంబంధించిన లేబుల్స్(ఈఏఎల్స్) రంగులను కూడా మార్చారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్.పి.సింగ్ రెండు వేర్వేరు జీవోలు(నంబర్ 239, 240) జారీ చేశారు. ఈ మేరకు జూన్ 1 నుంచే విభజన అమలులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఏపీ పునర్‌నిర్మాణ చట్టం ప్రకారం ప్రస్తుతం ఉన్న ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ సీమాంధ్రకు, తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ కొత్త తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతాయి.
{పస్తుతం మద్యం బాటిళ్లపై ప్రింట్ చేస్తున్న ‘గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్’ స్థానంలో తెలంగాణ రాష్ట్రంలో సరఫరా చేసే బాటిళ్లపై ‘గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్’ అని ప్రింట్ చేస్తారు. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో తయారయ్యే మద్యంతో పాటు ఎగుమతి, దిగుమతి, సీఎస్‌డీ మద్యానికి ఇస్తున్న లేబుల్స్ రంగులను తెలంగాణకు మార్చినట్లు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
{పస్తుతం మద్యం లేబుళ్లను యథాతథంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించారు. ఏపీ రాష్ట్రంలో తయారయ్యే మద్యానికి లేత ఆకుపచ్చ, ఎగుమతి, దిగుమతి మద్యానికి లేత పసుపు, సీఎస్‌డీ లేబుళ్లకు లేత గోధుమ రంగు కొనసాగుతుంది.తెలంగాణ రాష్ట్రంలో తయారయ్యే మద్యంకు లేత గులాబీ, ఎగుమతి మద్యానికి లేత నారింజ, దిగుమతి లేబుళ్లకు లేత ఎరుపు, సీఎస్‌డీ లేబుల్స్‌కు లేత నలుపు రంగులను కేటాయించారు. తెలంగాణలో స్థానిక వినియోగానికి వినియోగించే మద్యం బాటిళ్లకు లేత ఆకుపచ్చ, గులాబీ రంగు లేబుళ్లను వినియోగిస్తారు. తెలంగాణ ప్రభుత్వ లోగో వచ్చిన తరువాత ప్రస్తుతం ఉన్న లోగో స్థానంలోకి మార్పు చేస్తారు.