నెల్లిమర్ల: నెల్లిమర్లకు చెందిన ఓ నిరుద్యోగ అభ్యర్థి ఇటీవల రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) నిర్వహించిన టెస్ట్‌లో అర్హత సాధించాడు. శారీరక సామర్థ్య పరీక్షలో కూడా పాసయ్యాడు. అదే అభ్యర్థి గతంలోనూ పలుమార్లు టెస్ట్, శారీరకసామర్థ్య పరీక్షల్లో పాసైనా ఉద్యోగం రాలేదు. దీంతో ఈ సారి కూడా ఉద్యోగం వస్తుందో..రాదోననే మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ విషయం ఓ దళారి(బ్రోకర్)కి తెలిసింది. ఇంకేం ఆ అభ్యర్థి తల్లిదండ్రులను కలిశాడు.
తనకు రైల్వే మంత్రి తెలుసునని..రూ 3 లక్షలు ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మ బలికాడు. దీంతో సందిగ్ధంలో ఉన్న సదరు అభ్యర్థి తల్లిదండ్రులు రూ. 2 లక్షలకు ఆ దళారితో ఒప్పందం కుదుర్చుకున్నారు. అనుకున్న మొత్తాన్ని సదరు బ్రోకరుకు ఇచ్చేశారు. తాజాగా ప్రకటించిన ఫలితాల్లో మెరిట్‌పై ఆ అభ్యర్థికి ఉద్యోగం వచ్చింది. అయితే తానే ఉద్యోగం వేయించానని రూ. 2లక్షలు చల్లగా జేబులో వేసుకున్నాడు సదరు బ్రోకర్. ప్రస్తుతం నెల్లిమర్ల మండలంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఇదే తంతు జరుగుతోంది.
ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలనే నిరుద్యోగుల బలహీనతను బ్రోకర్లు క్యాష్ చేసుకుంటున్నారు. బాగా ప్రయత్నించి..ఒకట్రెండుసార్లు త్రుటిలో ఉద్యోగాలు తప్పిపోయిన అభ్యర్థులనే ఎంచుకుంటారు. తమకు సాక్షాత్తూ మంత్రులు, పెద్దస్థాయి అధికారులు తెలుసునని నమ్మబలుకుతారు. తమ ఫోన్లలో తమకు కావాల్సిన వారి నంబర్లనే మంత్రులు గాను, పెద్దస్థాయి అధికారులగాను నోట్ చేసుకుంటారు. అభ్యర్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచే ఆ నంబరుకు డయల్ చేసి లౌడ్‌స్పీకర్లో మాట్లాడి అందరినీ నమ్మిస్తారు. ఉద్యోగాలు వేయిస్తామని నమ్మబలికి బేరం కుదర్చుకుంటారు. అభ్యర్థి తన సామర్థ్యం మీద ఉద్యోగం సంపాదిస్తే తానేచెబుతూ మొత్తం సొమ్ము కాజేస్తాడు. ఒకవేళ ఉద్యోగం రాకపోతే సంవత్సరాల తరబడి తిప్పి కొంత సొమ్ము ఖర్చు చెప్పి అతి కొద్ది మొత్తం తిరిగిస్తారు. దీన్నిబట్టి అభ్యర్థికి ఉద్యోగం వచ్చినా, రాకపోరుునా బ్రోకర్ల పంట పండుతుంది.
ఎక్కువగా బ్యాంకు, రైల్వే పరీక్షలకు సిద్ధపడుతున్న అభ్యర్థుల నుంచి ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు సమాచారం. అలాగే మున్సిపాలిటీల్లోనూ ఉద్యోగాలు వేయిస్తామని ఇటీవల చాలా మంది నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఒక్క నెల్లిమర్ల మండల పరిసర ప్రాంతాల నుంచే సుమారు కోటి రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బ్రోకర్ల నుంచి అభ్యర్థులను కాపాడాలని పలువురు కోరుతున్నారు.
దళారులనునమ్మి మోసపోవద్దు
పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న అభ్యర్థులెవ్వరూ దళారులను నమ్మవద్దు. ప్రస్తుతం కేవలం సామర్థ్యం మీదే ఉద్యోగాలు వస్తున్నాయి. దళారుల విషయం మా దృష్టికి వచ్చింది. ఈ విషయంలో నిఘా సారిస్తున్నాం. ఎవరికి ఉద్యోగాలు వచ్చినా పోలీస్ విచారణ ఉంటుంది కాబట్టి బ్రోకర్ల విషయం బయటపడుతుంది. అభ్యర్థులు దళారులకు దూరంగా ఉండాలి. ఎవరైనా ఉద్యోగాలిస్తాం అని వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి.
-రవికుమార్, విజయనగరం రూరల్ సీఐ
నిరుద్యోగులూ.. తస్మాత్ జాగ్రత్త
Published Fri, Dec 25 2015 12:05 AM | Last Updated on Sun, Sep 3 2017 2:31 PM
Advertisement
Advertisement