భగ్గుమన్న భోగాపురం
సాక్షి, విజయనగరం: విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో నిర్మించతలపెట్టిన గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌కు తమ భూములిచ్చేది లేదని రైతులు తెగేసి చెప్పారు. బలవంతంగా భూసేకరణ చేస్తే ప్రాణాలర్పించేందుకైనా సిద్ధమని ప్రకటించారు. ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి భూములు సేకరించడాన్ని వ్యతిరేకిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో వేలాదిమంది రైతులు శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు.
భూసేకరణకోసం గ్రామాల్లోకి వచ్చే అధికారులను అడ్డుకుంటామన్నారు. తమను సంప్రదించకుండా, ఒక్క సమావేశమైనా ఏర్పాటు చేయకుండా భూసేకరణ ఎలా చేస్తారని ప్రశ్నించారు. సామాన్యులకు ఉపయోగపడని ఎయిర్‌పోర్ట్ తమకెందుకని, దాని కోసం విలువైన మా భూములెందుకివ్వాలని ప్రశ్నించారు.ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఎయిర్‌పోర్ట్ కోసం 15,200 ఎకరాలు సేకరించడమేంటని, తమ భూములతో ప్రభుత్వం వ్యాపారం చేయాలని చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు మహా ధర్నా అనంతరం భోగాపురం తహశీల్దార్ లక్ష్మారెడ్డికి వినతి పత్రం అందజేశారు.
జాతీయ రహదారిపై రాస్తారోకో చేయడంతో వాహనాలు నిలిచిపోయాయి. నిరసన ప్రదర్శనలో వైఎస్సార్‌సీపీ కార్య నిర్వాహక మండలి సభ్యుడు కాకర్లపూడి శ్రీనివాసరాజు, టీడీపీకి చెందిన ఎంపీపీ కర్రోతు బంగార్రాజు, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ దంతులూరి సూర్యనారాయణరాజుతో పాటు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.