=పీవీఘాట్ నిర్మాణం కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి
=ప్రముఖ పాత్రికేయుడు కె.రామచంద్రమూర్తి
=కేయూలో పీవీ స్మారకోపన్యాసం
కేయూక్యాంపస్, న్యూస్‌లైన్ : తెలుగువాడిగా అసమాన ప్రతిభతో అనేక పదవులు చేపట్టిన దివంగత ప్రధానమంత్రి పీవీ నర్సింహరావు భారతరత్నకు అర్హుడని ప్రముఖ పాత్రికేయుడు కె.రామచంద్రమూర్తి అన్నారు. కేయూ పరిపాలనా భవనంలో మంగళవారం పీవీ మూడో స్మారకోపన్యాస కార్యక్రమం నిర్వహించారు. ముందుగా పీవీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ‘న ర్సింహరావూస్ పాత్ బ్రేకింగ్ ఇనిషియేటివ్స్’ అంశంపై రామచంద్రమూర్తి ప్రసంగించారు.
1991లో పీవీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మన్మోహన్‌సింగ్‌ను ఆర్థికశాఖ మంత్రిగా నియమించుకుని ఐసీయూలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారని గుర్తుచేశారు. ఓ సంజీవనిగా భారత ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించారని చెప్పారు. మొదటిసారిగా రాష్ట్రస్థాయిలో రెసిడెన్షియల్ స్కూళ్లను కూడా ప్రవేశపెట్టారని వివరించారు. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని జూనియర్, డిగ్రీ కళాశాలలో అప్పట్లో చదివిన విద్యార్థులు ఎంతోమంది ఉన్నతస్థానాలను అధిరోహించారని పేర్కొన్నారు.
అప్పట్లో పీవీ మూడు ప్రాంతాల్లో మూడు రెసిడెన్షియల్ స్కూళ్లు, జాతీయ స్థాయిలో జవహర్ నవోదయ విద్యాలయాలను కూడా ఏర్పాటు చేసి విద్యారంగాన్ని అభివృద్ధి చేశారని తెలిపారు. ప్రధానిగా పీవీ నర్సింహారావు మలేషియా, సింగపూర్, థాయ్‌లాండ్, భూటాన్, చైనా, శ్రీలంకతో సత్సంబంధాలు నెలకొల్పారన్నారు. ఇరుగుపొరుగు దేశాలతో ప్రస్తుతం 50 మిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతోందన్నారు. పంజాబ్ లాంటి అనేక సమస్యలను కూడా ఆయన పరిష్కరించారన్నారు.
బాబ్రీ మసీదు విషయంలో లిబరహాన్ కమిషన్ ఆయనను నిర్దోషిగా పేర్కొందని గుర్తుచేశారు. నిజాంను సైతం ఎదిరించిన దృఢచిత్తం, ధీరత్వం పీవీ సొంతమని రామచంద్రమూర్తి వివరించారు. పీవీకి న్యూఢిల్లీలో తగిన గుర్తింపు లేకపోవడం విచారకరమని ఆయన పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఇతర ప్రధానమంత్రులకు సమానంగా పీవీఘాట్‌ను కూడా నిర్మించాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం రాబోయే తెలంగాణ రాష్ట్రంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. 8 సంవత్సరాలుగా ఢిల్లీలో పీవీ సంస్మరణ సభలను నిర్వహించకపోవడం శోచనీయమన్నారు.
మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య మాట్లాడుతూ కుగ్రా మం నుంచి సామాన్యుడు ప్రధానమంత్రి స్థాయికి ఎదగగలరని పీవీ నిరూపించారని వివరించారు. కేయూ వీసీ వెంకటరత్నం మాట్లాడుతూ పీవీ ప్రధానిగా దేశానికి అందించిన సేవలు గొప్పవన్నారు. రిజిస్ట్రార్ సాయిలు మాట్లాడుతూ పీవీ బహుభాషా కోవిధుడు, రాజనీతిజ్ఞుడు, సాహితీవేత్త అని కొనియాడారు. స్మారకోపన్యాసం కార్యక్రమ నిర్వాహకురాలు పీవీ కూతురు, సురభి ఎడ్యుకేషనల్ సొసైటీ బాధ్యురాలు వాణి మాట్లాడుతూ మహిళలు కూడా చదువుకోవాలని తన తండ్రి ప్రోత్సహించారని వివరించారు.
తాను మూడు కళాశాలలను ఏర్పాటు చేసి, ఆయన పేరుమీద 14 బంగారు పతకాలను ప్రతిభగల విద్యార్థులకు అందజేస్తున్నానని పేర్కొన్నారు. కేయూ సోషల్ సైన్స్ డీన్ సీతారామారావు, పరీక్షల నియంత్రణాధికారి ఎంవీ. రంగారావు, ప్రిన్సిపాల్ ఎన్.రామస్వామి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్ర హీత అంపశయ్య నవీన్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు, కె.దామోదరావు, టీచింగ్, నాన్‌టీచింగ్, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్యను సన్మానించారు.
భారతరత్నకు పీవీ అర్హుడు
Published Wed, Dec 18 2013 2:40 AM | Last Updated on Wed, Aug 15 2018 8:02 PM
Advertisement
Advertisement