ప్రజల్ని వంచించి.. ఇప్పుడు డ్రామాలా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు అన్ని రకాలుగా కేంద్రానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలుగు ప్రజలను నయ వంచనకు గురిచేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి దుయ్యబట్టారు. రాష్ట్ర విభజన ప్రకటన చేసే ముందు కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన కోర్‌కమిటీలు, సీడబ్ల్యూసీ సమావేశాలన్నింటిలో భాగస్వామిగా ఉన్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నింటికీ గంగిరెద్దులా తలూపి తెలుగు ప్రజలను నట్టేట ముంచారని ధ్వజమెత్తారు.
విభజనకు తలుపులు బార్లా తెరిచిన వ్యక్తే.. ప్రజాగ్రహానికి జడిసి సీడబ్ల్యూసీ నిర్ణయం తర్వాత పది రోజులకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి విభజిస్తే ఇరు ప్రాంతాలు నష్టపోతాయంటూ డ్రామాలాడారని మండిపడ్డారు. తాను గొప్ప సమైక్యవాదినంటూ కిరణ్ తన అనుకూల పత్రికల్లో రాయించుకుంటున్నారని విమర్శించారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విభజన ప్రకటన వెలువడిన తర్వాత ప్రజల్లో ఎగసిపడిన ఆగ్రహజ్వాలలను చల్లార్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ డెరైక్షన్‌లో కిరణ్ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
సీఎం కిరణ్ నిజంగా సమైక్యవాది అయితే విభజన ప్రకటన వచ్చిన జూలై 30న తన పదవికి ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. ఆ రోజే కనుక సీఎం పదవికి రాజీనామా చేసుంటే రాష్ట్రంలో ఏర్పడే రాజకీయ సంక్షోభంతో విభజన ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయేది కదా? అని అడిగారు. కాంగ్రెస్ అధిష్టానం ఆడిస్తున్న ఆటలో భాగంగానే కిరణ్ ఆడుతున్నారని ధ్వజమెత్తారు. సోనియా డెరైక్షన్ మేరకే.. సమైక్య ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగులు, విద్యార్థులు, కార్మిక, క ర్షకులకు సీఎం కిరణ్ తప్పుడు భరోసా కలిగించి ఒక్కొక్కరిని వైదొలగేలా చేసి ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.
అనుకూల పత్రికల్లో పొగిడించుకుంటున్న కిరణ్..
శాసనసభ స్పీకర్‌తో తనకు తగాదాలున్నట్లు, సమైక్యం కోసం పోరాడుతున్నట్లు కిరణ్ తన అనుకూల పత్రికల్లో రాయించుకుంటున్నారని భూమన వ్యాఖ్యానించారు. అసెంబ్లీని ప్రొరోగ్ చేస్తే అధికారాలు పూర్తిగా తన చేతుల్లోకి వస్తాయని, దాంతో విభజనను అడ్డుకుంటానంటూ మాయ మాటలు చెబుతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి విభజనకు వ్యతిరేకంగా ‘సమైక్య తీర్మానం’ చేసి కేంద్రానికి పంపితే యావత్ దేశం దృష్టికి తీసుకెళ్లవచ్చని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మూడు నెలలుగా ఎంతగా చెప్పినా, కిరణ్ ఉలుకుపలుకు లేకుండా వ్యవహరించారని దుయ్యబట్టారు.
మూడున్నరేళ్లుగా రాష్ట్రంలో ఏ ఒక్క చిన్న సమస్యను పరిష్కరించకుండా, అసమర్థునిగా మిగిలిన కిరణ్ ఆఖరికి ప్రభుత్వ కార్యక్రమమైన రచ్చబండలో కూడా ప్రజాసమస్యలు చర్చకు రాకుండా, సమైక్య విధానమంటూ పక్కదారి పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. పెరిగిన నిత్యావసర ధరలు, రేషన్‌కార్డులు, పెన్షన్లపై ప్రజలు ఎక్కడ నిలదీస్తారోననే భయంతో ముందుగానే ‘సమైక్య నినాదాన్ని’ టానిక్‌లా వాడుకుంటున్నారని విమర్శించారు. ఇప్పటికైనా కిరణ్ తన మోసపూరిత నటనను కట్టిపెట్టాలని భూమన హితవు పలికారు.