అయితే ఎందుకు వేలాడుతున్నావ్?
సీఎంపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే భూమన ధ్వజం
సాక్షి, హైదరాబాద్: ‘సీఎంగా ఉండటం దురదృష్టకరమని దొంగ ఏడుపులు ఏడుస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి.. ఇంకా ఆ పదవిని పట్టుకుని ఎందుకు వేలాడుతున్నాడని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. సమైక్యాంధ్ర పట్ల కిరణ్‌కు చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఆయన ఏనాడో పదవికి రాజీనామా చేసేవారని, కానీ ఢిల్లీ పెద్దల స్క్రిప్టులో భాగంగా మభ్యపెట్టేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడంకోసం తాము సూచించినట్లుగా అందరూ ఆనాడే రాజీనామా చేసి రాజ్యాంగ సంక్షోభం సృష్టించి ఉంటే రాష్ట్రానికి విభజన బిల్లు వచ్చేదా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. సహచర ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, టి.బాలరాజు, కె.శ్రీనివాసులు, కాటసాని రామిరెడ్డి, బి.గుర్నాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డిలతో కలిసి ఆయన బుధవారం అసెంబ్లీ వద్ద మాట్లాడారు.
పైలీన్ తుపాన్‌ను ఆపలేకపోయాను కానీ, విభజన బిల్లును ఆపుతాన ని చెప్పిన సీఎం.. ఇప్పుడు అసెంబ్లీలో కుట్రపూరితంగా వ్యవహరిస్తూ విభజనకు సహకరిస్తున్నారని భూమన ఆరోపించారు. పైగా సీఎంగా ఉండటం దురదృష్టకరమంటూ దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా మాట్లాడుతున్నారన్నారు. హైకమాండ్ నిర్ణయాలకు గంగిరెద్దులా తలూపి వచ్చి.. సభలో సమైక్యవాదినంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. సమైక్యతీర్మానం చేసి పంపాలని డిమాండ్ చేస్తే.. బిల్లు సభకు వస్తుందని, అప్పుడు తీర్మానం చేద్దామని, బిల్లును సభలో ఓడిస్తామని ప్రగల్భాలు పలికారని సీఎంపై విరుచుకుపడ్డారు. సోనియా ఆదే శాల మేరకు కిరణ్... టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బిల్లును రాష్ట్రపతికి పంపించేయాలనే ఉద్దేశంతో ఓటింగ్ కూడా జరపకుండా చేసేందుకు కుట్ర జరుగుతోందన్నారు. అందుకే మంత్రి జానారెడ్డితో ఓటింగ్ ఉండదంటూ మాట్లాడించారన్నారు.