ఏమిటీ డ్రామా.. ఎందుకీ వంచన?: భూమన
విభజనకు కిరణ్, చంద్రబాబుల కుట్ర
43 రోజుల తర్వాత సీఎంకు జ్ఞానోదయం
దానికి చంద్రబాబు సన్నాయి నొక్కులు
బిల్లును తిప్పిపంపాలని సభా నిబంధన 77 కింద నెలన్నర కిందటే
స్పీకర్‌కు వైఎస్సార్ సీపీ లేఖ ఇచ్చింది
ఇప్పుడు అదే నిబంధన కింద సీఎం కిరణ్ నోటీసు ఇస్తారు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇద్దరూ కుమ్మక్కై రాష్ట్ర విభజన సజావుగా సాగేందుకు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి దుయ్యబట్టారు. ‘‘విభజన బిల్లుపై చర్చ ప్రారంభమైన 43 రోజుల తర్వాత సీఎం కిరణ్‌కు జ్ఞానోదయం అయ్యిందట! బిల్లుపై మూడు రోజుల పాటు సీరియల్ మాదిరిగా మాట్లాడిన కిరణ్.. బిల్లు అసమగ్రంగా ఉందంటారు. దానికి ప్రతిపక్ష నేత చంద్రబాబు సన్నాయి నొక్కులు నొక్కుతూ బిల్లును తిప్పి పంపే అధికారం సీఎంగా మీకుందని చెబుతారు. బిల్లును తిప్పిపంపాలని కోరుతూ వైఎస్సార్ సీపీ నెలన్నర కిందటే ఇచ్చిన సభా నిబంధన 77నే కిరణ్ పేర్కొంటూ స్పీకర్‌కు లేఖ అందజేస్తారు.
మళ్లీ అదే చంద్రబాబు తెలంగాణకు చెందిన టీడీపీ నేతలను పోడియంలోకి పంపించి సీఎం ఇచ్చిన లేఖను ఉపసంహరించుకోవాలంటూ గొడవ చేయిస్తారు. ఏమిటీ డ్రామా? ఎందుకీ వంచన?’’ అని ఆయన ప్రశ్నించారు. ‘‘రాష్ట్ర విభజన బిల్లుపై సభలో తాను మాట్లాడకుండా ఉండేందుకే కిరణ్ చేత చంద్రబాబు ఈ డ్రామా ఆడించారా? లేక గత ఏడాది అవిశ్వాసం నుంచి కిరణ్ ప్రభుత్వాన్ని కాపాడటం, పార్లమెంటులో ఎఫ్‌డీఐ బిల్లు సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదుకున్నందుకు ప్రతిఫలంగా సభలో బాబును రక్షించటం కోసం కాంగ్రెస్ హైకమాండ్ చేసిన గేమ్‌ప్లానా?’’ అని భూమన ప్రశ్నించారు. ఆయన సోమవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ హైకమాండ్ డెరైక్షన్‌లో కిరణ్, బాబులు పనిచేస్తున్నారని మండిపడ్డారు.
- సభలో సమైక్య తీర్మానం చేయాలని కోరుతూ సీఎం కిరణ్‌ను, స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను, గవర్నర్ నర్సింహన్‌లను డిమాండ్ చేశాం.
- విభజన బిల్లు రాకముందే అసెంబ్లీ ప్రారంభమైన రోజున (డిసెంబర్ 12) సభా నిబంధనల 77 కింద నోటీసులు ఇచ్చాం.
- రాజ్యాంగంలోని ఆర్టికల్ 371(డి)ని సవరించకుండా బిల్లుపై చర్చించడానికి వీల్లేదని డిసెంబర్ 16న మరో నోటీసు ఇచ్చాం.ఈ అసమగ్ర బిల్లును తిప్పి పంపాలని డిమాండ్ చేశాం.
- రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ రాష్ట్రపతికి అఫిడవిట్లు ఇచ్చిన ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే.