నెత్తిపై కుండలతో భూమన నిరసన
రాష్ట్ర విభజనపై ప్రజలకు సరైన సమాధానం ఇవ్వలేకనే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు బస్సు యాత్రను మధ్యలోనే ఆపేశారని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అభిప్రాయపడ్డారు. తిరుపతిలో వైఎస్సార్ సీపీ నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలో భాగంగా ఆయన బుధవారం మట్టి కుండలను ఎత్తుకుని నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని విభజిస్తే మట్టి కుండలను ఎత్తుకుని నీటి కోసం అలమటించాల్సిందేనన్నారు. రాష్ట్రాన్ని విభజించాలా? సమైక్యంగా ఉంచాలా? అనే విషయంపై చంద్రబాబు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సొంత పార్టీ నాయకులు కూడా బాబు వైఖరి తెలియక తలలు పట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. విభజనకు అనుకూలమని లేఖ ఇచ్చినట్లు చెప్పుకుంటున్న చంద్రబాబు.. కాంగ్రెస్ పార్టీతో ఎటువంటి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారో ప్రజలకు చెప్పాలన్నారు.
సీమాంధ్రలో ఎన్నడూ లేనివిధంగా ఉద్యమాలు జరుగుతుంటే ముఖ్యమంత్రి మాత్రం క్యాంపు కార్యాలయానికే పరిమితమయ్యారని విమర్శించారు. సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నానని ప్రకటించుకుంటూ విభజనకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నారని ఆరోపించారు. ఎవరికీ కనిపించకుండా బొత్స సత్యనారాయణ మద్యం వ్యాపారం చేసుకుంటున్నారనీ, రాష్ట్రానికి అసలు పీసీసీ అధ్యక్షుడున్నాడా అనే అనుమానం కలుగుతోందన్నారు.