
చంద్రబాబుకు పాలించే అర్హత లేదు’
హైదరాబాద్: అవినీతిలో చంద్రబాబు సర్కారు రెండో స్థానంలో ఉందని సీఎంఎస్ సర్వేలో వెల్లడైందని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. అవినీతి, అక్రమాలు, దగాలో సీఎం చంద్రబాబుకు ఎవరూ సాటి సారని విమర్శించారు. శుక్రవారం వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో భూమన విలేకరులతో మాట్లాడారు. వేల కోట్లతో అవినీతి సొమ్ముతో వచ్చే ఎన్నికల్లో గెలవాలని చంద్రబాబు ఆలోచనలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎంఎస్ సర్వేతో చంద్రబాబు కళ్లు తెరవాలని హితవు పలికారు. అవినీతిలో కూరుకుపోయిన చంద్రబాబుకు పాలించే అర్హత లేదని, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజాక్షేత్రంలో ఎదుర్కొలేక వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నాయకులతో చంద్రబాబు అసత్య ప్రచారం చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలకు చంద్రబాబు ప్రభుత్వం చేసింది ఏమీ లేదని, డబ్బాలు కొట్టుకోవడానికే పరిమితమైందని దుయ్యబట్టారు. కియా కంపెనీ రెండు మిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతోందని చంద్రబాబు చెప్పిన విషయం అసత్యమని తేలిందన్నారు. తాము ఒక మిలియన్ డాలర్లు మాత్రమే పెట్టుబడి పెడుతున్నట్టు కియా కంపెనీ ప్రకటన చేసిందని వెల్లడించారు. చంద్రబాబు అసత్యాలు వల్లించడం మానుకోవాలని భూమన కరుణాకరరెడ్డి సూచించారు.