'ఎల్లో మీడియాది నీచ సంస్కృతి'
తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమలలో శ్రీవారి దర్శనాన్ని వివాదం చేయడం ఎల్లో మీడియా నీచ సంస్కృతికి నిదర్శనమని స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం భూమన తిరుమలలో మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును సీఎంగా కూర్చోబట్టడానికి ఎల్లో మీడియా తహతహలాడుతుందని ఆయన ఎద్దెవా చేశారు. అందులోభాగంగానే జగన్పై బురద జల్లడాన్ని ఎల్లో మీడియా కంకణం కట్టుకుందని ఆరోపించారు.
గతంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీవారికి చాలా సార్లు పట్టు వస్త్రాలు సమర్పించారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ మహానేత తనయుడిగా జగన్కు వారసత్వం రాదా అని ఆయన ఎల్లో మీడియాను ప్రశ్నించారు. శ్రీవారి దర్శనం చేసుకున్న జగన్ అంశాన్ని వివాదస్పదం చేసి ఎల్లో మీడియా పాపం మూట కట్టుకుందన్నారు. ఆ పాపం ఎల్లో మీడియాకు తగలక మానదన్నారు. వచ్చే ఐదేళ్లు సీఎంగా వైఎస్ జగన్ ప్రతి సంవత్సరం శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని జోస్యం కురుణాకర్ రెడ్డి చెప్పారు.
తిరుమలలో శ్రీవేంకటేశ్వరుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం తెల్లవారుజామున విఐపీ ప్రారంభ దర్శన సమయంలో దర్శించుకున్నారు. అనంతరం ఆయనకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం జగన్ రేణుగుంట విమానాశ్రయానికి చేరుకుని హైదరాబాద్ బయలుదేరారు.