నిజామాబాద్: తెలంగాణ వెనుకబాటుకు పాలకులే కారణమని మాజీ పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ మండిపడ్డారు. అమర వీరుల త్యాగాల ఫలితమే తెలంగాణ ఏర్పాటు అని ఆయన తెలిపారు. శుక్రవారం నిజామాబాద్ లో జరిగిన కాంగ్రెస్ తెలంగాణ జైత్రయాత్ర సభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ విభజన అనేది భౌగోళిక విభజనే తప్ప, మానసిక విభజన కాదన్నారు. తెలంగాణ ప్రాంతం వెనుకబడి పోవడానికి పాలకులే ప్రధాన కారణమని తెలిపారు. సీమాంధ్రులు విభజనకు అడ్డు పడ్డకుండా సహకరించాలని ఆయన కోరారు. ఆ ప్రాంతానికి ఉన్న డిమాండ్లను తెలిపాలని డీఎస్ విజ్ఞప్తి చేశారు. ఆనాడు మాజీ ప్రధాని నెహ్రూ కోరిక మేరకే తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలపారని సూచించారు. పెద్ద ప్రజల ఒప్పందాన్ని తుంగలో తొక్కి ఇంకా సీమాంధ్ర ప్రజలను మభ్య పెట్టేందుకు యత్నించవద్దన్నారు.
ప్రత్యేక తెలంగాణ అనేది ఎన్నో ఏళ్ల పోరాటమన్నారు. ఈ విషయాన్ని తెలుగు ప్రజలందరూ గుర్తించాలని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు కృషి చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.