నా నిర్ణయం సరైనదే: డీఎస్
హైదరాబాద్ : తెలంగాణవాదులందర్నీ ఏకతాటిపైకి తెచ్చిన ఘనత కేసీఆర్దే అని డి.శ్రీనివాస్ అన్నారు. ఆయన బుధవారం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ఉద్యమించడం వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్...సోనియాగాంధీని ఒప్పించారని అన్నారు. కేసీఆర్-సోనియా గాంధీల మధ్య చక్కని అవగాహన ఉందన్నారు.
కేసీఆర్ ఒత్తిడి వల్లే తెలంగాణ ప్రకటన వచ్చిందని డీఎస్ అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నిరాహార దీక్ష చేశారన్నారు. ఆరు దశాబ్దాల పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్రం అని, అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ కోసం రాజ్యాంగబద్ధంగా పోరాటం చేశానని డీఎస్ అన్నారు.
టీఆర్ఎస్ లో చేరటంపై తన నిర్ణయం సరైనదేనని ఆయన అభిప్రాయపడ్డారు. సోనియాను గౌరవిస్తూ కేసీఆర్ను బలోపేతం చేయడానికే టీఆర్ఎస్లో చేరానన్నారు. కేసీఆర్ ఎన్సైక్లోపిడియా అని, ప్రజల కోరిక మేరకే పార్టీలో చేరినట్లు చెప్పారు. తాను బీ ఫాం ఇస్తే గెలిచినవారు ఇప్పుడు తనను విమర్శిస్తున్నారని, తానేవరికీ భయపడనని డీఎస్ స్పష్టం చేశారు.
2004లో తాను టీఆర్ఎస్ కండువా, కేసీఆర్ కాంగ్రెస్ కండువా వేసుకున్నామని, 2004లో రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయని డీఎస్ తెలిపారు. తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ వల్లే సాధ్యమని ఆయన అన్నారు.