ఏ ప్రాతిపదికా లేకుండానే హోం శాఖ విభజన నోట్ | bifurcation note was done with out any basis | Sakshi
Sakshi News home page

ఏ ప్రాతిపదికా లేకుండానే హోం శాఖ విభజన నోట్

Published Sat, Oct 5 2013 4:02 AM | Last Updated on Mon, Jun 18 2018 8:10 PM

ఏ ప్రాతిపదికా లేకుండానే హోం శాఖ విభజన నోట్ - Sakshi

ఏ ప్రాతిపదికా లేకుండానే హోం శాఖ విభజన నోట్

 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర హోం శాఖ రూపొందించిన నోట్ తప్పుల తడకగా, పలు అంశాలపై తప్పుదారి పట్టించేదిగా ఉంది. నోట్ ప్రారంభంలోనే ‘విభజన’ నిర్ణయ నెపాన్ని ఇతర పార్టీలపైకి నెట్టారు. అలా దాన్ని ఫక్తు రాజకీయ కోణంలో రూపొందించారు! ఎలాంటి మార్పుచేర్పులూ చేయకుండా, యథాతథంగా కేంద్ర మంత్రివర్గం దానికి ఆమోదముద్ర వేసింది. తెలంగాణ ఏర్పాటు నిర్ణయానికి తలెత్తన కారణాలు, నోట్‌లో పేర్కొన్న అంశాలను వక్రీకరించినట్టు దాన్ని పరిశీలిస్తే స్పష్టంగా తెలుస్తోంది. తెలంగాణ నేపథ్యం, హేతుబద్ధత పేరుతో ప్రారంభించిన ముసాయిదా ఆదిలోనే పరస్పర విరుద్ధమైన అంశాలున్నాయి. 22 పేజీల ఈ నోట్‌లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నేపథ్యం, ఆ నిర్ణయానికి కారణాలను ఐదు పేరాల్లో పొందుపరిచారు. కానీ వాటిలో కేంద్రం కేవలం తమకు అనుకూలమైన అంశాలనే తప్ప పూర్తి వివరాలను ప్రస్తావించలేదు!
 
 2009 డిసెంబర్ 9న ప్రకటన చేసిన అనంతరం కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో శాంతిభద్రతల సమస్య తలెత్తిన కారణంగా వెనక్కు తగ్గుతూ డిసెంబర్ 23న ప్రకటన చేసినట్టు కేంద్రం ఆమోదించిన నోట్‌లోని రెండో పేరాలోనే పేర్కొన్నారు. కానీ ఎమ్మెల్యేల మూకుమ్మడి రాజీనామాల ప్రస్తావన ఎక్కడా తేలేదు. డిసెంబర్ 23 తర్వాత సీమాంధ్ర ఉద్యమానికి ప్రతిగా తెలంగాణలో మరోసారి ‘కౌంటర్ ఉద్యమం’ ప్రారంభమైనట్టు పేర్కొంది! ఆ నేపథ్యంలోనే 2010 జనవరి 6న అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు మూడో పేరాలో ప్రస్తావించారు. కానీ దాని అజెండా ఏమిటి, ఎందుకు నిర్వహించారు వంటి అంశాలను ప్రభుత్వం ఎక్కడా స్పష్టంగా ఆ రోజు చెప్పనే లేదు. కానీ ఈ విషయాన్ని నోట్‌లో ఎక్కడా ప్రస్తావించకుండా జాగ్రత్త పడ్డారు. ఆ రోజు సమావేశంలో పాల్గొన్న నేతలంతా చర్చలు, సంప్రదింపులకు ఆమోదం తెలిపారు. అయితే దానికి ప్రాతిపదిక ఏమిటన్న ప్రశ్నకు మాత్రం ప్రభుత్వం అప్పుడు సమాధానమివ్వలేదు. ఆ విషయాన్ని కూడా నోట్‌లో ఎక్కడా ప్రస్తావించనే లేదు. ‘‘తర్వాత 2010 ఫిబ్రవరిలో శ్రీకృష్ణ కమిటీ వేశాం. అది 2010 డిసెంబర్ 30న నివేదిక ఇచ్చింది. ఆ నివేదికపై కేంద్ర హోం మంత్రి 2011 జనవరి 6న రాష్ట్రంలోని ప్రధాన పక్షాలు అభిప్రాయాలు చెప్పాలని కోరుతూ అఖిలపక్షం నిర్వహించాం.
 
 రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితి, రాజకీయ అస్థిరత తొలగించడానికి సత్వర చర్యలు తీసుకోవాలని కోరాం’’ అని ప్రస్తావించారు. అయితే ఆ వెంటనే అదే పేరాలో... ‘తెలంగాణ డిమాండ్‌పై గడిచిన మూడేళ్లలో అనేక పార్టీలు, ప్రజాప్రతినిధులు, పలు గ్రూపులతో రాజకీయ పరమైన చర్చలు, సంప్రదింపులు జరిగాయి. తత్ఫలితంగా కేంద్రం సరైన నిర్ణయం తీసుకోవాలన్న అభిప్రాయం వ్యక్తమైంది’ అని పేర్కొన్నారు. అయితే ఈ పేరాలో ఎక్కడా శ్రీకృష్ణ కమిటీ గురించే ప్రస్తావించలేదు. ఆ చర్చలు, సంప్రదింపులన్నింటినీ ప్రభుత్వమే జరిపిందన్నట్టుగా ప్రస్తావించారు! నిజానికి ప్రభుత్వం ఏనాడూ అలా చేయలేదు. 2011 జనవరి 6 నిర్వహించిన అఖిలపక్షంలో ప్రధాన రాజకీయ పార్టీలు పాల్గొన్నాయని 4వ పేరాలో ప్రస్తావించారు. కానీ నిజానికి అందులో టీఆర్‌ఎస్, బీజేపీ, టీడీపీ పాల్గొనలేదు. అప్పటికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించను కూడా లేదు. ఇక ఆ భేటీలో పాల్గొన్న సీపీఎం, ఎంఐఎం సమైక్యవాదాన్ని వినిపించాయి. పీఆర్పీ ఎలాంటి వైఖరినీ చెప్పలేదు.
 
  సీపీఐ మాత్రం తెలంగాణ ఏర్పాటును కోరింది. కానీ కేబినేట్ ఆమోదించిన నోట్‌లో ఈ వివరాలేవీ చెప్పకుండా, ‘సమావేశం ఏర్పాటు చేశాం’ అంటూ సరిపెట్టారు! ఇక షిండే అధ్యక్షతన 2012 డిసెంబర్ 28న జరిగిన చివరి అఖిలక్షంలో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఆధారంగా సత్వరం నిర్ణయం తీసుకోవాలని అన్ని పార్టీలూ కేంద్రాన్ని డిమాండ్ చేశాయని పేర్కొన్నారు. కానీ శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని అంశాలేవీ ప్రస్తావించలేదు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, అదే అత్యుత్తమ సిఫార్సు అని శ్రీకృష్ణ నివేదిక పేర్కొన్న అంశం నోట్‌లో రాకుండా జాగ్రత్తపడ్డారు! 2010 డిసెంబర్‌లో శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పిస్తే, ఆ తర్వాత దాదాపు రెండున్నరేళ్లకు పైగా రెండు అఖిలపక్ష భేటీలు మినహా ఎలాంటి సంప్రదింపులూ, చర్చలూ జరగలేదు. పైగా కేంద్ర మంత్రులు కూడా దీనిపై ఎప్పటికప్పుడు మరిన్ని సంప్రదింపులు, చర్చలు, ఏకాభిప్రాయమంటూ వచ్చారు. కానీ వీటిని నోట్‌లో ఎక్కడా చెప్పకుండా, అన్ని పార్టీల నిర్ణయం మేరకే తెలంగాణ ఏర్పాటు అభిప్రాయానికి వచ్చినట్టు అర్థం స్పురించేలా నోట్ రూపొందించడం గమనార్హం. అంతేగాక విభజనను వ్యతిరేకిస్తూ సీడబ్ల్యూసీ నిర్ణయానికి ముందే వైఎస్సార్‌సీపీ రాసిన లేఖలను గానీ... వైఎస్సార్‌సీపీ, సీపీఎం, ఎంఐఎంలు సమైక్య రాష్ట్రాన్నే కోరుతున్నాయన్న వివరాలను గానీ నోట్‌లో ఎక్కడా ప్రస్తావించనే లేదు.
 
  2009 డిసెంబర్ 9న ప్రకటన చేసినప్పటి నుంచి జరిగిన మొత్తం ఘటనల్లో ఎక్కడా వైఎస్సార్‌సీపీ లేదు. 2012 డిసెంబర్‌లో నిర్వహించిన అఖిలపక్షంలో మాత్రమే ఆ పార్టీ తొలిసారిగా పాల్గొంది. ఆ సమావేశంలో కూడా ఏకాభిప్రాయం వ్యక్తం కాలేదు. కాంగ్రెస్ ప్రదర్శించిన సాచివేత ధోరణులు, కేంద్ర మంత్రుల పరస్పర భిన్నాభిప్రాయాలు, గందరగోళపరిచే వాతావరణం కల్పించడం వంటివాటి వైపు వేలెత్తిచూపే ఏ అంశాలనూ నోట్‌లో ప్రస్తావించకుండా కేంద్ర హోం శాఖ జాగ్రత్త పడింది!
 
 2012 డిసెంబర్ అఖిలపక్ష సమావేశంలో
 ఏ పార్టీ ఏం చెప్పిందంటే...
 కాంగ్రెస్: ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది (సురేశ్‌రెడ్డి).
 నేను సమైక్యవాదినే... విభజనకు అనుకూలమని కాంగ్రెస్ ఎప్పుడూ చెప్పలేదు (గాదె వెంకటరెడ్డి)
 టీడీపీ: 2008లో ప్రణబ్ కమిటీకి ఇచ్చిన లేఖలోనే తెలంగాణపై మా అభిప్రాయం చెప్పాం (అంతకుముందు తెలంగాణ ఏర్పాటుకు ఆమోదిస్తూ ప్రణబ్ కమిటీకి లేఖ ఇచ్చారు). దానికే కట్టుబడి ఉన్నాం.
 టీఆర్‌ఎస్: వీలైనంత త్వరగా ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి. కాలయాపన చేయకుండా పార్లమెంటులో బిల్లు పెట్టాలి. ఏ నిర్ణయం తీసుకోకుండా ఎంతకాలం నానబెడతారు? తెలంగాణ ఇస్తరా, ఇవ్వరా? తేల్చిచెప్పండి.
 వైఎస్సార్‌సీపీ: ఆర్టికల్-3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించాలన్నా, కలిపి ఉంచాలన్నా కేంద్రానివే సర్వాధికారాలు. ఇరు ప్రాంతాల్లో అన్ని విషయాలనూ పరిగణనలోకి తీసుకుని, ఎవరికీ అన్యాయం జరగకుండా... ఒక తండ్రిలా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాలి.
 
 బీజేపీ: రాష్ట్రాన్ని ఆంధ్ర, తెలంగాణగా విభజించాలి. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు వీలుగా పార్లమెంటులో వెంటనే బిల్లు ప్రవేశపెట్టాలి.
 సీపీఎం: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలి. ఇంతకు ముందూ ఇదే చెప్పాం, ఇప్పుడూ అదే చెబుతున్నాం. ముందుగా కాంగ్రెస్ వైఖరి తెలియజేయాలి.
 సీపీఐ: విశాలాంధ్ర కోసం గతంలో పోరాడాం. కానీ ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా తెలంగాణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.
 మజ్లిస్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని మేం తొలి నుంచీ చెబుతున్నాం. విభజించాల్సిస్తే రాయలసీమ, తెలంగాణ కలిపి రాయల తెలంగాణ చేయాలి.
 కేంద్రం: తెలంగాణపై ఇదే ఆఖరు సమావేశం. కొందరికి బాధ కలుగుతుందని మౌనంగా ఉండబోం. గరిష్టంగా నెల రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement