జూన్ తర్వాత కూడా విభజన ప్రక్రియ: జైరాం రమేష్ | bifurcation process will go on after june also, says jairam ramesh | Sakshi
Sakshi News home page

జూన్ తర్వాత కూడా విభజన ప్రక్రియ: జైరాం రమేష్

Published Sat, Apr 12 2014 3:10 PM | Last Updated on Sat, Aug 25 2018 5:38 PM

జూన్ తర్వాత కూడా విభజన ప్రక్రియ: జైరాం రమేష్ - Sakshi

జూన్ తర్వాత కూడా విభజన ప్రక్రియ: జైరాం రమేష్

జూన్ రెండోతేదీకల్లా కొంతమేరకు అవసరమైన విభజన ప్రక్రియ పూర్తవుతుందని, ఆ తర్వాత కూడా కొంత ప్రక్రియ ఉంటుందని కేంద్ర మంత్రి, జీవోఎం సభ్యుడు జైరాం రమేష్ చెప్పారు. విభజన పక్రియ తీరుపై తాను రాష్ట్ర గవర్నర్, చీఫ్ సెక్రటరీలతో సమావేశమై సమీక్షించానని ఆయన తెలిపారు. విభజన విషయమై ఆయన హైదరాబాద్లో శనివారం విలేకరులతో మాట్లాడారు. విభజన ప్రక్రియపై ఏర్పాటైన 21 కమిటీలు ఈ నెలాఖరు కల్లా నివేదికలు ఇస్తాయని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు రాష్ట్రాల వారీగా 26 లక్షల ఫైళ్లను గుర్తించి డిజిటైజ్ చేశామని ఆయన చెప్పారు. లక్షా 40 వేల ఒప్పందాలు, కాంట్రాక్టులను గుర్తించామని, వాటిలో ఏపీకి 75 వేలు, తెలంగాణకు 62 వేలు, మిగిలినవి ఉమ్మడివని వివరించారు. తెలంగాణ ఒప్పందాల విలువ రూ.1.88 వేల కోట్లు, సీమాంధ్ర 97 వేల కోట్లని తెలిపారు.

ఇక ఉమ్మడి రాజధాని అయిన జీహెచ్‌ఎంసీ పరిధిలో 85 వేల చదరపు మీటర్ల భవనాలను ఇరు రాష్ట్రాలకు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఏపీలో 3.40 లక్షల పెన్షన్‌దారులుండగా వ్యయం 700 కోట్లు ఉంటుందని, అలాగే తెలంగాణలో 2.40 లక్షలమంది పెన్షనర్లపై 500 కోట్ల వ్యయం  ఉంటుందని అన్నారు. కమలనాథన్‌ కమిటీ ఉద్యోగుల నుంచి ఆప్షన్స్‌ తీసుకుంటుందని జైరాం తెలిపారు. ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఉద్యోగుల విభజనకు ఏడాది సమయం పట్టిందని, పునర్విభజన చట్టం ప్రకారం ఉద్యోగుల నుంచి ఆప్షన్స్ తీసుకోవచ్చని అన్నారు. అయితే, ఆప్షన్స్ ప్రకారమే ఉద్యోగుల విభజన ఉంటుందని చెప్పలేనని, విభజన పక్రియలో ఆప్షన్స్ తీసుకోవడం ఒక పద్దతి మాత్రమేనని అన్నారు.

119 కంపెనీలు, కార్పొరేషన్‌లను విభజించాల్సి ఉందని, తుంగభద్ర బోర్డును కర్ణాటక, తమిళనాడు, ఏపీ సభ్యులతో కేంద్రం పునరుద్దరిస్తుందని జైరాం రమేష్ చెప్పారు. తెలంగాణలో కృష్ణానది జలాల వాటా ఎంతనేది తేలాల్సి ఉందన్నారు. ఉమ్మడి రాజధానిలో గవర్నర్‌ది ప్రత్యేక బాధ్యతని పునర్విభజన చట్టంలో ఉందని, దానిపైనే గవర్నర్ కేంద్రాన్ని వివరణ కోరారని తెలిపారు. శాంతిభద్రతల అంశంపై తెలంగాణ ప్రభుత్వ సలహాల మేరకు గవర్నర్‌ ఉమ్మడి రాజధానిలో విచక్షణతో వ్యవహరించవచ్చునని చెప్పారు. ఇరు రాష్ట్రాలకు రెండు హైకోర్టులు ఉంటాయని, ఏపీలో హైకోర్టు ఏర్పాటుపై సుప్రీంకోర్టుకు గవర్నర్‌ లేఖ రాశారని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement