26 లక్షల ఫైళ్ల డిజిటైజేషన్ పూర్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో 26 లక్షల ఫైళ్ల డిజిటైజేషన్ ప్రక్రియ పూర్తయిందని కేంద్ర మంత్రి జైరాం రమేశ్ చెప్పారు. జూన్ 2లోపు విభజన ప్రక్రియ అంతా పూర్తవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. స్థానిక, జిల్లా ఉద్యోగులంతా ఎక్కడి వారక్కడే పనిచేస్తారని, రాష్ట్ర స్థాయి ఉద్యోగుల విభజన మాత్రమే జరగాల్సి ఉందన్నారు. ఈ విషయంలో ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను కమల్‌నాథన్ కమిటీ తీవ్రంగా పరిశీలిస్తోందన్నారు. ఉద్యోగులకు ఆప్షన్ ఇచ్చిన మాట వాస్తవమే అయినప్పటికీ అదే అంతిమం కాదని, అనేక అంశాల్లో అది ఒకటి మాత్రమేనని అన్నారు. దీనిపై కేసీఆర్ రాద్ధాంతం చేయడం తగదన్నారు. ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతలు, పౌరుల రక్షణ విషయంలో గవర్నర్ నిర్ణయమే అంతిమమని పేర్కొంటూ కేంద్రం వివరణ ఇచ్చిందని తెలిపారు. గవర్నర్‌కు ఇచ్చిన అధికారాలను బాధ్యతలుగా పరిగణించాలని చెప్పారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ, శాసనమండలి విభజన కసరత్తు జరుగుతోందన్నారు. అదే విధంగా 2 రాష్ట్రాలకు వేర్వేరు హైకోర్టుల ఏర్పాటు ప్రక్రియ మొదలైందన్నారు. ఇంకా ఏమన్నారంటే...
రాష్ట్రంలో మొత్తం 26 లక్షల ఫైళ్లను డిజిటైజ్ చేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వారీగా విభజించాం. సచివాలయంలోని 85 వేల చదరపు మీటర్ల పరిధిలో ఇరు రాష్ట్రాల ప్రభుత్వ శాఖల ఏర్పాటు పూర్తయింది.
ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్, సాగునీరు సహా అన్ని శాఖల్లో 1.4 లక్షల ఒప్పందాలు జరిగాయి. తెలంగాణకు 62 వేలు, ఏపీకి 75 వేల ఒప్పందాలను బదలాయించాం. ఏపీ ఒప్పందాల విలువ రూ.1.88 లక్షల కోట్లు. తెలంగాణలోని ఒప్పందాల విలువ రూ.97 వేల కోట్లు.
ఉమ్మడి రాష్ట్రంలో 5.8 లక్షల పెన్షనర్లుండగా, తెలంగాణకు 2.4 లక్షలు, ఏపీకి 3.4 లక్షల మందిని కేటాయించాం. 119 ప్రభుత్వ రంగ సంస్థల విభజన కూడా జూన్ 2లోపు పూర్తవుతుంది.
కృష్ణా, గోదావరి నదులకు సంబంధించిన బోర్డులకు చైర్మన్లను నియమిస్తాం. బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పులకు లోబడి మాత్రమే ఈ బోర్డులు పనిచేస్తాయి. 2 రాష్ట్రాలకు 2 పబ్లిక్ సర్వీస్ కమిషన్లను ఏర్పాటు చేస్తాం.
ఢిల్లీలోని ఏపీ భవన్‌తో పాటు ఏపీ భవన్‌కున్న 15 ఎకరాల స్థలాన్ని ఇరు రాష్ట్రాలకు విభజించే ప్రక్రియ కూడా కొనసాగుతోంది. హైదరాబాద్ పూర్తిగా తెలంగాణకే వర్తిస్తున్నందున సీమాంధ్రకు ప్రత్యేక హోదా కల్పించాం.