శ్రీకాకుళం సిటీ: వారి కన్ను ఆ బండిపై పడిందంటే చాలు.. అది ఎంత పెద్ద వాహనమైనా కాసేపట్లో మాయం కావాల్సిందే. ముఖ్యంగా పార్క్ చేసిన వాహనాలనే తస్కరిస్తారు. మంచినీళ్లు తాగినంత సులువుగా ద్విచక్ర వాహనాలను వారు కొట్టేయగలరు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 14 ద్విచక్ర వాహనాలను అపహరించారు. వీటి విలువ సుమారు రూ.15 లక్షల పైమాటే. అలా అని వీరు పెద్ద ముఠా ఏమీ కాదు. ఇద్దరే ఇద్దరు. ఇంత చూస్తే.. వారి వయస్సు 20 ఏళ్లలోపే. ఇందులో ఒకరు మైనర్.
కేసును ఛేదించిన శ్రీకాకుళం పోలీసులు
శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో చోరీకి గురైన ద్విచక్రవాహనాల కేసును సిక్కోలు పోలీసులు ఛేదించారు. జిల్లా ఎస్పీ సీఎం త్రివిక్రమవర్మ ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆయన కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రెండు జిల్లాలకు సంబంధించిన రూ.15 లక్షల విలువచేసే 14 వాహనాలను సీజ్ చేసినట్లు చెప్పారు. ఈ చోరీలకు పాల్పడిన ఇద్దరిని అరెస్టు చేయగా.. వారిలో ఒకరు మైనర్‌గా గుర్తించామని వివరించారు. బాలుడిని జువైనల్ హోమ్‌కు పంపించామని చెప్పారు.
కేసును ఛేదించారిలా..
ఈ నెల 19న శ్రీకాకుళం పట్టణంలోని కిమ్స్ వద్ద పార్కు చేసిన వాహనం అపహరణకు గురైనట్లు పైడిభీమవరానికి చెందిన కొంపెర్ల రమేష్ రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా కేసును దర్యాప్తు చేసిన పోలీసులు.. ఢిల్లీ వాసి, విశాఖపట్నం మల్కాపురంలో నివాసం ఉంటున్న హిమాంశు మిట్టల్ (20), పాట్నాకు చెందిన గాజువాకలో నివసిస్తున్న బాలుడు (17)ను నిందితులుగా గుర్తించారు. వారిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరం అంగీకరించారు. 14 వాహనాలను దొంగిలించినట్లు పోలీసుల ఎదుట వెల్లడించారు. వీరిలో హిమాంశు మిట్టల్‌ను రిమాండ్‌కు తరలించామని ఎస్పీ తెలిపారు.
శ్రీకాకుళం, విశాఖల్లో కేసులు..
వాహనాల చోరీకి సంబంధించి శ్రీకాకుళం రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఒకటి, విశాఖపట్నం జిల్లా మల్కాపురంలో ఐదు, గాజువాకలో రెండు, కంచరపాలెంలో ఒకటి, ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్‌లో మూడు కేసులు చొప్పున కేసులు నమోదయ్యాయని ఎస్పీ వివరించారు. వీరు అపహరించిన వాహనాల్లో కేటీఎం, యమహా ఎఫ్‌జెడ్‌ఎస్, రాయల్ ఇన్‌ఫీల్డ్, పల్సర్ వంటి ఖరీదైన వాహనాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు.
పోలీస్ సిబ్బందికి అభినందనలు
ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన రెండో పట్టణ ఎస్సై వై.రవికుమార్, హెచ్‌సీ కేవీఆర్ కృష్ణ, పీసీలు సీహెచ్ మహేష్, పి.శివ, ఇ.రామకృష్ణ, ఎస్.ఉషాకిరణ్‌లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. విలేకరుల సమావేశంలో అడిషినల్ ఎస్పీ షేక్ హుసేన్ బేగం, శ్రీకాకుళం డీఎస్పీ కె.భార్గవరావునాయుడు పాల్గొన్నారు.
కన్ను పడిందా.. బండి మాయమే!
Published Sun, Jul 23 2017 3:54 AM | Last Updated on Tue, Sep 5 2017 4:38 PM
Advertisement
Advertisement