
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఘరానా దొంగ వీరయ్య చౌదరిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఇతను హీరోహోండా కంపెనీకి చెందిన వాహనాలను దొంగిలించడంలో సిద్ధహస్తుడు. 2005లో కంప్యూటర్ హార్డ్‌వేర్ కంపెనీలో పని చేస్తూ అక్కడి కంప్యూటర్‌ను దొంగిలించి చేతివాటాన్ని ప్రదర్శించాడు.
దీంతో ఆ కేసులో పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. 2013 నుంచి దొంగతనాలకు అలవాటు పడిన వీరయ్య నగరంలోని పలు ప్రాంతాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ కలిపి 130 ద్విచక్ర వాహనాలను దొంగిలించాడు. అధికారులు వరుస దొంగతనాల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న వీరయ్య చౌదరితో పాటు మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి పోలీస్ కమిషనర్ ఆర్‌కె మీనా ముందు హాజరు పరిచారు.