బిల్లు ఇవ్వలేదని ఆత్మహత్యాయత్నం
- కలెక్టరేట్ పైనుంచి దూకడానికి సిద్ధపడిన బాధిత కుటుంబం
అనంతపురం అర్బన్ : నీటిని ట్యాంకర్ల ద్వారా రవాణా చేస్తున్నా బిల్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ ఒక కుటుంబం ఆత్మహత్యాయత్నానికి సిద్ధపడింది. కలెక్టర్ కార్యాలయంపై నుంచి దుకేందుకు సిద్ధపడింది. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని కిందకు తీసుకొచ్చారు. శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితుడు శివయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ‘మాది అమడగూరు మండలం జేకేపల్లి పంచాయతి. సర్పంచ్, ఎంపీడీఓ, కార్యదర్శి ఆదేశం మేరకు గత ఏడాది ఆగస్టు 27 నుంచి పంచాయతీ పరిధిలోని గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నాం.
ట్రిప్పునకు రూ.370 చొప్పున రోజుకు ఏడు ట్రిప్పులు తోలుతున్నాం. రోజుకు రూ.2,590 అవుతుంది. ఈ పన్నెండు నెలలతో పాటు అంతకు ముందు ఒక నెల కలుపుకుని రూ.10 లక్షలకు పైగా రావాలి. ఈ మధ్యకాలంలోనే మా అన్న అప్పన్న విద్యుత్ షాక్‌తో చనిపోయాడు. ఆయన ఇద్దరు ఆడపిల్లలను, నాకున్న ముగ్గురు కుమార్తెలను పోషించాల్సిన భారం నాపై పడింది. నాకు రావాల్సిన బిల్లును కార్యదర్శి వేరొకరి పేరున రాశారు. ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారు. మేము నీటిని రవాణా చేసినట్లు డీఈఈ, ఆర్‌డీఓ పరిశీలించి వాస్తవమేనని తేల్చారు. అయినా బిల్లు రాకుండా అడ్డుపడుతున్నారు. ఇక్కడి వస్తే ఎవరూ పట్టించుకోలేదు. దీంతో నేను, మా అమ్మ చెన్నమ్మ, నా భార్య అరుణ, పిల్లలతో పాటు ఆత్మహత్య చేసుకోవాలని సిద్ధపడ్డామ’ని తెలిపారు.
న్యాయం చేస్తాం : విషయం తెలుసుకున్న డీఆర్‌ఓ పీహెచ్ హేమసాగర్ అక్కడి చేరుకుని బాధితులతో మాట్లాడారు. న్యాయం చేస్తానని చెప్పారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈని కూడా అక్కడికి పిలిపించి మాట్లాడారు. గ్రామంలోకి వెళ్లి నీటి రవాణాపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలన్నారు. నీరు రవాణా చేసింది నిజమే అయితే తక్షణం బిల్లు వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు.