సాక్షి ప్రతినిధి, ఏలూరు, ఆకివీడు: ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తున్న డ్వాక్రా సంఘాలకు అన్యాయం జరుగుతోంది. మహిళల కష్టార్జితానికి రెక్కలు వస్తున్నాయి. మహిళల సాధికారతకు కట్టుబడి ఉన్నట్టు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇవ్వాల్సిన డబ్బులు దారి మళ్లిస్తోంది. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీ నాయకులకు ఇసుక ర్యాంపులు అప్పగించి డబ్బులు కూడబెట్టుకునేలా చేశారు. ఇక ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ ద్వారా వచ్చే డబ్బులను డ్వాక్రా సంఘాలకు ఇవ్వకుండా ప్రభుత్వమే వాడేస్తోంది. పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 193 ధాన్యం కొనుగోలు కేంద్రాలు డ్వాక్రా మహిళల ఆధీనంలో నడుస్తున్నాయి. కొనుగోలు చేసిన ధాన్యం క్వింటాలుకు రూ.30 చొప్పున కమీషన్ రూపంలో కేంద్రాలకు చెల్లిస్తారు. నాలుగేళ్లుగా సుమారు లక్ష మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యాన్ని కొనుగోలు చేశారు.
ఈ ప్రకారంగా కేంద్రాలకు రూ.36 కోట్లు కమీషన్లుగా ఆయా డ్వాక్రా గ్రూపులకు మంజూరయ్యాయి. ఈ ఐకేపీ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు గత 2014–15, 15–16 సంవత్సరాల్లో రూ.16 కోట్లు కమీషన్ల రూపంలో సివిల్‌సప్లయిస్ శాఖ డీఆర్‌డీఏకు బదిలీ చేసింది. గ్రామ సంఘాల పరిధిలోని మహిళలు కమీషన్ సొమ్మును పంచుకోవలసి ఉంది. 2016–17, 17–18 సంవత్సరాలకు మరో రు.20 కోట్లు కమీషన్ల రూపంలో పౌరసరఫరాల శాఖ నుండి రావాల్సి ఉంది. వీటిని కూడా ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో కలిపి భవనాల నిర్మాణాలకు మళ్లించేశారు. ఐకేపీ కేంద్రాల నుంచి మిల్లర్లకు సరఫరా చేసేందుకు ఇవ్వాల్సిన రవాణా ఖర్చులను కూడా వారికి ఇవ్వడం లేదు. గత నాలుగున్నరేళ్లుగా మహిళలకు కమీషన్ల రూపంలో ఒక్క పైసా చెల్లించిన దాఖలాలు లేవు. కేంద్రాల్లో పనిచేసే మహిళలకు మాత్రం ప్రతి రోజూ రూ.500 చొప్పున కూలి కేటాయించి చెల్లిస్తున్నారు.
వీటితో పాటు ఆఫీసు మెయింటెనెన్స్, అద్దెలు తదితర వాటికి బిల్లులు చెల్లిస్తున్నారు. మిగిలిన సొమ్ము ప్రభుత్వం దారి మళ్లించి, ప్రభుత్వ కార్యకలాపాలకు వినియోగిస్తోంది. ఒకొక్క గ్రామ సంఘ భవనానికి రూ. 6 లక్షలు, మరో రూ.6 లక్షలు జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నిధులు, మండల సమాఖ్య భవనానికి రూ.7 లక్షలు కమీషన్ సొమ్ముతో పాటు జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నిధులు రూ.13 లక్షలు కలిపి రూ.20 లక్షలతో మండల సమాఖ్య భవనాలు నిర్మిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకూ 700 భవనాల నిర్మాణం వివిధ దశల్లో ఉండగా, 184 గ్రామ సంఘ భవనాలు నిర్మాణం పూర్తి చేసుకున్నాయి.
నిర్వహణ ఖర్చులపై ఆసక్తి
ఉదయం 9 గంటల నుండి సాయింత్రం 5 గంటల వరకూ ఐకేపీ కేంద్రాల్లో ఉంటూ, ధాన్యం కొనుగోలు నిర్వహణ బాధ్యతలు చేపట్టడంతో మహిళలకు రూ.500 కూలి చెల్లిస్తున్నారు. దీంతో అక్కడ పనిచేసే మహిళలు కనీసం కూలి డబ్బు అయినా వస్తుందని ఆశతో పని చేస్తున్నారు. నిర్వహణ వ్యయం ప్రభుత్వం చెల్లించడంతో ఆ సొమ్ముతో డ్వాక్రా మహిళల్లో విభేదాలు కూడా తలెత్తుతున్నాయి.
పర్మినెంట్ అవుతుందని ఆశ
ఐకేపీ కేంద్రాల్లో పనిచేస్తే తమ ఉద్యోగాలు పర్మినెంట్ చేస్తారని కొంత మంది మహిళలు ఆశతో కేంద్ర నిర్వహణకు ఆసక్తి చూపుతున్నారు. గ్రామ సమాఖ్యలోని సభ్యులు నిర్వహణా బాధ్యతల కోసం ఆరాటపడుతున్నారు. ఏటా నిర్వహణ బాధ్యతను కొత్త గ్రూపులకు ఇవ్వాల్సి ఉండగా, స్థానిక తెలుగుదేశం నాయకులు, ప్రజాప్రతినిధులు తమకు ఇష్టమైన గ్రూపులకు కేటాయించి కేంద్రాలపై అజమాయిషీ పొందుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పంచాయతీలకు కేటాయింపు
పంచాయతీల్లో ఫర్నిచర్ కొనుగోలుకు రూ.2 లక్షల చొప్పున ఐకేపీ కమీషన్ల సొమ్మును దారి మళ్లించారు. పంచాయతీల పరిధిలో ఈపోస్, కంప్యూటర్లు, ఫర్నిచర్, ప్రింటర్ తదితర వాటిని కొనుగోలు చేశారు. ఆయా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ పంచాయతీలకు చేరింది.
ఇసుక అమ్మకాలపైనా ఇదే దందా!
డ్వాక్రా మహిళలకు ఇసుక ర్యాంపులు కేటాయించి వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తామని ప్రభుత్వం భజన చేసింది. అయితే ఇసుక అమ్మకాలపై తెలుగు తమ్ముళ్లు మహిళా గ్రూపుల్లో తలదూర్చి వారిని పక్కనపెట్టి ఇసుక మాఫియాను ఏర్పాటు చేశారు. దీంతో ఇసుక ర్యాంపుల కేటాయింపును ప్రభుత్వం రద్దు చేసింది. తదనంతరం మాఫియా గుప్పిట్లోకి ఇసుక ర్యాంపులు వెళ్లిపోయాయి.
కమీషన్ సొమ్ము ఉచితంగా ఇవ్వరు
గ్రామ సంఘాలకు వచ్చే కమీషన్ సొమ్మును వ్యక్తిగతంగా పంపిణీ చేయరు. ఆ సొమ్ము గ్రామ సంఘాల ఖాతాల్లో నిల్వ ఉంటుంది. వడ్డీలకు తీసుకుని సభ్యులు వినియోగించుకోవచ్చు. నాలుగున్నర ఏళ్లుగా కమీషన్ సొమ్ము ఎవరికీ పంచలేదు. గ్రామసంఘాల, మహిళా సమాఖ్య భవనాలకు రూ. 6 లక్షలు, పంచాయతీలలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు రూ.2 లక్షలు చొప్పున కేటాయించాం.
– వడ్డి రాజ్యలక్ష్మి, అధ్యక్షురాలు, మహిళా సమాఖ్య, ఆకివీడు
Comments
Please login to add a commentAdd a comment