పేదలు నివసించే ప్రాంతాల్లో ఏర్పాటుకు ప్రయత్నం
కార్పొరేషన్, రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా చర్యలు
నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధం
విజయవాడ : నగరంలో పేదలు నివసించే మురికివాడలు, కొండప్రాంతాల్లో పారిశుధ్య సమస్య తీవ్రంగా ఉంది. మరుగుదొడ్లు లేక మహిళలు, వృద్ధులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని) కొండ ప్రాంతాలు, మురికివాడల్లో పర్యటించినప్పుడు అనేక మంది మరుగుదొడ్ల సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. పబ్లిక్ టాయిలెట్లు ఉన్నప్పటికీ, వాటికి అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ సమస్యలు ఏర్పడుతున్నాయని పలువురు తెలిపారు. నీరు వెళ్లే పైపులైన్లు సరిగా లేకపోవడంతో మరుగుదొడ్లు నిరుపయోగంగా మారుతున్నాయని, సొంత ఇళ్లలో సెప్టిక్ ట్యాంకును నిర్మించుకున్నా, వాటిని శుభ్రం చేయించుకోవడం కష్టమవుతోందని పేదలు వివరించారు. తప్పని పరిస్థితుల్లో బహిర్భూమికి వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు.
బయో టాయిలెట్స్‌పై దృష్టి.. డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేని ప్రదేశాల్లో ఉపయోగించుకునే విధంగా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) బయో టాయిలెట్లను తయారు చేసింది. వీటిని ఇప్పటికే దేశ రక్షణ రంగంలో ఉపయోగిస్తున్నారు. శబరిమలతో పాటు కేరళలోని అనేక పట్టణాల్లో ఉపయోగిస్తున్నారు. ఇదే తరహాలో దేశంలో బయో టాయిలెట్ల ఉపయోగం పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్వచ్ఛ భారత్ కింద బయో టాయిలెట్లు నిర్మించేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నిధులను కూడా మంజూరుచేస్తోంది. దీంతో నగరపాలక సంస్థ, రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు తన నియోజకవర్గ పరిధిలో మురికివాడల్లో బయో టాయిలెట్లు ఏర్పాటుచేయించాలని ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని) భావిస్తున్నారు. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేయడంతోపాటు వీటిని ఏర్పాటు చేసేందుకు సదరు కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నారు.
బయోటాయిలెట్లు ఉపయోగించడం ఇలా..
బయోటాయిలెట్‌లో కింద భాగంలో బయో డెజైస్టర్(ట్యాంక్)ను ఏర్పాటుచేస్తారు. ఇందులో మల వ్యర్థాలను తినే బ్యాక్టిరియాను ఉంచుతారు. టాయిలెట్‌ను ఉపయోగించినప్పుడు వచ్చే మలవ్యర్థాలను బ్యాక్టీరియా స్వీకరించడమే కాకుండా నీరు వాసన రాకుండా శుభ్రం చేస్తాయి. ఈ నీటిని సైడ్ కాల్వలోకి వదిలివేసినా ఏ విధమైన ఇబ్బందులు రావు. బయోటాయిలెట్లలో ఉపయోగించే బ్యాక్టీరియాను డీఆర్‌డీవోనే పంపిణీ చేస్తుంది. బయోటాయిలెట్లను తరచూ శుభ్రం చేయాల్సిన అవసరం ఉండదని వీటి తయారీదారులు చెబుతున్నారు. బయోటాయిలెట్ల వల్ల పర్యావరణ సమస్యలు ఉత్పన్నం కావని, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థ అవసరం లేదని తెలిపారు.
కార్పొరేట్ కంపెనీల సహాయం
ఒకేచోట నాలుగైదు బయోటాయిలెట్లు నిర్మించేందుకు రూ.15లక్షల వరకూ ఖర్చు అవుతుంది. వీటిని రోజు కనీసం 200 నుంచి 300 మంది వినియోగించవచ్చు. బయోటాయిలెట్ల ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోపాటు కార్పొరేట్ కంపెనీల సహాయం తీసుకోవాలని ఎంపీ కేశినేని నాని భావిస్తున్నారు. ఈ టాయిలెట్లను అందంగా తయారుచేయిస్తే వాటిపై వ్యాపార ప్రకటనలు వేసుకునే సౌకర్యం కల్పిస్తే దాని వల్ల ఆదాయం వస్తుంది. తొలుత నాలుగైదు చొట్ల 50 వరకు బయోటాయిలెట్లను ప్రయోగాత్మకంగా ఏర్పాటుచేయాలని ఎంపీ భావిస్తున్నారు. ఆ తర్వాత పరిశీలించి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కనీసం వెయ్యి బయోటాయిలెట్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
కార్యరూపం దాల్చని ‘నమ్మ’ టాయిలెట్లు
జనసమ్మర్థంగా ఉండే ప్రదేశాల్లో టాయిలెట్ల సమస్యను పరిష్కరించేందుకు తమిళనాడు ప్రభుత్వం ‘నమ్మ’ టాయిలెట్స్‌ను ఏర్పాటుచేసింది. వీటిని పరిశీలించిన నగరపాలక సంస్థ అధికారులు బందరురోడ్డులోని రాఘవయ్య పార్కు వద్ద నమ్మ టాయిలెట్లు ఏర్పాటుచేయాలని పనులు ప్రారంభించారు. అయితే దీనికి యూజీడీ సమస్యతోపాటు సెప్టిక్ ట్యాంకు ఏర్పాటుచేయాల్సి రావడంతో పనులు అర్ధంతరంగా నిలిపివేశారు. ఇటువంటి చోట కూడా బయో టాయిలెట్లు ఉపయోగపడతాయని తయారీదారులు చెబుతున్నారు. వీటిని నగర పాలకసంస్థ అధికారులు కూడా పరిశీలిస్తున్నారు.
నగరంలో బయోటాయిలెట్లు
Published Sat, Feb 21 2015 12:56 AM | Last Updated on Tue, Aug 28 2018 5:25 PM
Advertisement
Advertisement