హైదరాబాద్ : తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే తాము మరోసారి చారిత్రక తప్పిదం చేసినట్లు అవుతుందని బీజేపీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. పొత్తుపై నిన్న అసెంబ్లీ లాబీల్లో టీడీపీ ఎమ్మెల్యే పి.రాములుకు, యెన్నంకు మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. 'మనం ఇద్దరం మళ్లీ కలుస్తున్నాం కదా' అని రాములు యెన్నంతో వ్యాఖ్యానించారు. దీనికి యెన్నం బదులిస్తూ.... ''గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు నష్టం బీజేపీకే జరిగింది.
ఇప్పుడు పూర్తిగా మునిగిపోతున్న టీడీపీతో మాకెందుకు పొత్తు? మోడీ హవా జాతీయ స్థాయిలో ఉంది. అందుకే పొత్తు కోసం మీ సారు (చంద్రబాబు) ఆశపడుతున్నారు. టీడీపీతో పొత్తుకు కిందిస్థాయిలో మా కార్యకర్తలు, నాయకులు వ్యతిరేకంగా ఉన్నారు'' అని చెప్పారు. ఎన్నికల నాటికి పరిస్థితుల్లో చాలా మార్పులొస్తాయంటూ టీడీపీ ఎమ్మెల్యే రాములు అక్కడ్నుంచీ వెళ్లిపోయారు.