సుష్మాను అనుమానించడం మీ మూర్ఖత్వం: బీజేపీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విషయంలో తమ పార్టీ నాయకురాలు సుష్మా స్వరాజ్ బాణీ మార్చారంటూ కాంగ్రెస్ ఎంపీలు చేస్తున్న విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. తెలంగాణపై పార్లమెంటులో మాట్లాడిందే సుష్మా స్వరాజ్ అని గుర్తుచేసింది. బలిదానాలు ఆపాలని కోరడంతో పాటు మొక్కవోని ధైర్యాన్ని కల్పించిన వ్యక్తి సుష్మా అని తెలిపింది. అవాకులు, చెవాకులు పేలేకన్నా పార్లమెంటులో బిల్లు పెడితే ఎవరెటో తేలిపోతుందని సవాల్ చేసింది. పార్టీ నేతలు డాక్టర్ కె.లక్ష్మణ్, డాక్టర్ నాగం జనార్దన్‌రెడ్డి శుక్రవారమిక్కడ విడివిడిగా మీడియాతో మాట్లాడారు. తెలంగాణ బిల్లును పార్లమెంటులో పెట్టనందుకు నిరసనగా శనివారం 1,100 మందితో మహబూబ్‌నగర్‌లో దీక్ష చేస్తున్నట్టు బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి ప్రకటించారు.
‘‘సీడబ్ల్యూసీ తీర్మానం చేసి మూడు వారాలు గడిచినా ఒక్క అంగుళం కూడా కదలలేదు. సీడబ్ల్యూసీ ప్రకటననే వ్యతిరేకించిన ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుణ్ని వదిలేసి సుష్మా చిత్తశుద్ధిని అనుమానించడం మూర్ఖత్వం. అసలు మా మద్దతు లేకుండా తెలంగాణ బిల్లు తేగలరా? ఇదే అదనన్నట్టుగా టీఆర్‌ఎస్ బచ్చాలు కూడా మాట్లాడుతున్నారు. బీజేపీతో మాత్రమే తెలంగాణ సాధ్యమని, ఇప్పటికీ ఆ మాటకే కట్టుబడి ఉన్నామని ఆమె చెప్పిన విషయాన్ని గుర్తుంచుకోండి’’ అని ధ్వజమెత్తారు. చంద్రబాబుది ఇప్పటికీ దొంగ, ద్వంద్వ విధానమేనని, టీడీపీతో పొత్తు ఉండదని స్పష్టంచేశారు. తెలంగాణను వ్యతిరేకిస్తున్న ఎంపీలను పార్టీ నుంచే సస్పెండ్ చేసి కాంగ్రెస్ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.
బీసీల్ని ఓట్లేసే యంత్రాలుగా మార్చిన కాంగ్రెస్: లక్ష్మణ్
కాంగ్రెస్ పార్టీకి బలహీనవర్గాల ఓట్లపై ఉన్న ఆసక్తి, వారి అభివృద్ధిపై లేదని డాక్టర్ కె.లక్ష్మణ్ మండిపడ్డారు. ఇప్పటికీ 65 శాతం మంది బీసీలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారంటే ఆ పాపం కాంగ్రెస్‌దేనని చెప్పారు. కూలీలలో 70 శాతం మంది బీసీలని, 66 ఏళ్ల కాంగ్రెస్ పాలన బీసీలకిచ్చిన వరాలివేనని ఎద్దేవా చేశారు. బీసీ సబ్‌ప్లాన్ కోసం తాము 26 నుంచి చేపట్టే మహాధర్నాకు బీసీ మేధావులు, ప్రముఖులు మద్దతివ్వాలని కోరారు. దీక్షకు వేలాదిమంది తరలిరావాలని పిలుపునిచ్చారు. సుష్మాస్వరాజ్‌ను విమర్శిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే తమ పార్టీపై ఒత్తిడి చేసి పార్లమెంటులో బిల్లు పెట్టిస్తే ఎవరేమిటో తేలిపోతుందని హితవు పలికారు.