మేయర్ పీఠానికి కమలం వ్యూహం | bjp focus on gvmc mayor position | Sakshi
Sakshi News home page

మేయర్ పీఠానికి కమలం వ్యూహం

Published Mon, Jul 14 2014 4:57 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

మేయర్ పీఠానికి కమలం వ్యూహం - Sakshi

మేయర్ పీఠానికి కమలం వ్యూహం

 సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: లక్ష్యం: జీవీఎంసీ పీఠం...
మార్గం: సమ్మతిస్తే మిత్రలాభం లేకుంటే మిత్రబేధం
వ్యూహం: టీడీపీపై వ్యూహాత్మక విమర్శల దాడి

ఇదీ బీజేపీ తాజా రాజకీయ వ్యూహం. జీవీఎంసీ మేయర్ స్థానాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాత్మక దూకుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి కలిగిస్తోంది.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు ఏకంగా టీడీపీ ప్రభుత్వంపై విమర్శల దాడి చేయడం ఆ పార్టీ వ్యూహాత్మక దూకుడుకు అద్దంపడుతుండగా... అందుకు టీడీపీ స్పందించలేకపోవడం ఆ పార్టీ నిస్సహాయస్థితికి నిదర్శనంగా నిలుస్తోంది. మూడు నెలల్లో జీవీఎంసీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం వెల్లడించిన నేపథ్యంలో మరింత పదునెక్కుతున్న బీజేపీ వ్యూహం ఇలా ఉంది...

పీఠం కోరుదాం...లేకుంటే...
రాష్ట్రంలో బలీయ రాజకీయ శక్తిగా ఆవిర్భవించాలన్న కృతనిశ్చయంతో బీజేపీ మెల్లమెల్లగా ‘సొంత దారి’ చూసుకుంటోంది. త్వరలో రాష్ట్రంలో నిర్వహించనున్న కొన్ని నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీ ఎన్నికల్లో తన సత్తా చాటాలని భావిస్తోంది. ఉత్తరాంధ్రకు సంబంధించినంత వరకు విశాఖ మేయర్ పీఠాన్ని తమ ఖాతాలో వేసుకోవాలన్నది ఆ పార్టీ దృఢచిత్తంగా ఉంది. ఎందుకంటే 1980లో బీజేపీ అభ్యర్థి ఎన్.ఎస్.ఎన్. రెడ్డి విశాఖ మేయర్‌గా ఎన్నికయ్యారు.

దేశంలోనే బీజీపీకి ఆయనే తొలి మేయర్ కావడం గమనార్హం. అందుకే ఈసారి జీవీఎంసీ మేయర్ పీఠంపై ఆ పార్టీ కన్నేసింది. అందుకోసం ఇప్పటికే డివిజన్లలో ఆ పార్టీ చాపకింద నీరులా పని ప్రారంభించింది. కానీ మేయర్ గిరీని తమకు ఇచ్చేందుకు టీడీపీ సమ్మతించదని కూడా బీజీపీ గుర్తించింది. అనివార్యమైతే టీడీపీతో ఢీకొట్టేందుకు కూడా సిద్ధపడుతోంది.

వ్యూహాత్మక విమర్శలు
మిత్రలాభంతో దక్కకపోతే మిత్రబేధంతోనైనా మేయర్ స్థానాన్ని సాధించాలని బీజేపీ అగ్రనాయకత్వం యోచిస్తోంది. ఆ దిశగా కార్యాచరణ బాధ్యతను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభపాటి హరిబాబుకే అప్పగించింది. ‘మిగిలిన నేతలు ఎవ్వరూ స్పందించొద్దు... ఒక్క హరిబాబే టీడీపీని విమర్శిస్తూ పార్టీ ఉద్దేశాన్ని వెల్లడిస్తారు’అని బీజేపీ అగ్రనాయకత్వం స్పష్టం చేసినట్టు సమాచారం.

అందుకు తగ్గట్లుగానే హరిబాబు టీడీపీ ప్రభుత్వంపై సునిశిత విమర్శలు ప్రారంభించారు. రుణమాఫీ హామీతో బీజేపీకి సంబంధంలేదని ఆయన ఓసారి ప్రకటించారు. హైదరాబాద్‌లో కూర్చొని పరిపాలన ఏమిటని మరోసారి ఘాటుగా దుయ్యబట్టారు. ఇలా టీడీపీని ఆత్మరక్షణలోకి నెట్టేసి జీవీఎంసీ ఎన్నికల సమయాన బీజేపీ అసలు డిమాండ్‌ను తెరపైకి తేనుంది. జీవీఎంసీ మేయర్ స్థానాన్ని తమకు కేటాయించాలని...లేకపోతే సొంతంగా పోటీచేస్తామని తేల్చిచెప్పాలన్నది బీజేపీ వ్యూహం.

టీడీపీలో గుబులు
జీవీఎంసీ పీఠమే లక్ష్యంగా బీజీపీ సాగిస్తున్న విమర్శల దాడి టీడీపీ తమ్ముళ్లను కలవరపరుస్తోంది. ఇటీవల ఎన్నికల్లో టికెట్లు రాని పలువురు మేయర్ గిరీపై ఆశలు పెట్టుకున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో బీజేపీకి మేయర్ స్థానాన్ని కేటాయించినా... పొత్తుకు స్వస్తిచెప్పి ఆ పార్టీ సొంతంగా పోటీచేసినా తమ అవకాశాలు మూసుకుపోతాయన్నది వారి ఆందోళన. కానీ ఈ విషయంపై ఇప్పటికిప్పుడు బయటపడలేక...మరోవైపు ధీమాగా ఉండలేక మల్లగుల్లాలు పడుతున్నారు. మరి భవిష్యత్తు రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement