చిత్తూరు: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో 10 మంది బీజేపీ కార్యకర్తలను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్కు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి, స్థానిక శాసనసభ్యుడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఒత్తిడే కారణమని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వరాలయ ట్రస్ట్బోర్డు మాజీ చైర్మన్, బీజేపీ నేత కోలా ఆనంద్ జన్మదినం సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు శనివారం పట్టణంలో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే మున్సిపల్ చైర్మన్ ఆదేశాల మేరకు సిబ్బంది సదరు ఫ్లెక్సీలను తొలగించారు.
దాంతో ఆగ్రహించిన కోలా ఆనంద్ వర్గీయులు మున్సిపల్ కార్యాలయంపై దాడి చేసి....అద్దాలు పగలకొట్టారు. అక్కడే బడి పిలుస్తోంది కార్యక్రమం నిర్వహిస్తున్న టీచర్లపై దాడి చేశారు. దాంతో మున్సిపల్ ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా ఆదివారం 10 మంది బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు.