తిరుపతి గాంధీరోడ్డు: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బీజేపీ అన్ని విధాలా సహకరిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ మోర్చా అధ్యక్షుడు జల్లి మధుసూదన్ ఆధ్వర్యంలో శుక్రవారం తిరుమల బైపాస్ రోడ్డులోని ఓ ప్రైవేట్ హోటల్‌లో నిర్వహించిన సమావేశంలో సురేష్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు పెద్దయెత్తున నిధులు ఇస్తోందని, అయితే అవి పక్కదాని పడుతున్నాయని తెలిపారు. రాజధాని నిర్మాణానికి కూడా ఇప్పటికే 35 వేల కోట్లకు పైగా నిధులు మంజూరు చేశామన్నారు.
హైదరాబాద్ తరహాలో గుంటూరును అభివృద్ధి చేసేందుకు సీఎం నడుము బిగించడం సంతోషమేనని, తద్వారా రాయలసీమ వెనుకబడిపోతోందని అన్నారు. మోడీ తెచ్చిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ప్రత్యేక శ్రద్ధ పెడతామని పేర్కొన్నారు. చిరువ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం పెద్దయెత్తున రుణాలు మంజూరు చేసిందన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి బీజేపీ పూర్తిస్థాయిలో సహకరిస్తుందన్నారు. జల్లి మధుసూదన్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు బీజేపీ నాయకులు సుబ్రమణ్యం, సుబ్రమణ్యం యాదవ్, సావిత్రమ్మ, శాంత, శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.