
సాక్షి, తిరుపతి: శ్రీవారి ఆలయంలో తమకు కల్పించిన విశేష సేవల భాగ్యాన్ని కొందరు పాలక మండలి సభ్యులు వ్యాపార మార్గంగా మార్చుకుంటున్నారు. రోజూవారీగా తమకు కేటాయించిన ప్రత్యేక దర్శనాలు, సేవా టిక్కెట్లను అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలనా సౌలభ్యం కోసం ఏర్పాటైన టీటీడీ పాలక మండలిలో ఇద్దరు సభ్యులు నెలవారీగా తమకు కేటాయించిన సేవలను గంపగుత్తగా విక్రయించినట్లు విశ్వసనీయ సమాచారం. వీరిలో ఒకరు హోల్‌సేల్‌గా రూ.10 లక్షలకు అమ్ముకుంటే మరో సభ్యుడు రూ.14 లక్షలకు విక్రయించినట్లు తెలిసింది. సభ్యులు తమ కోటా పూర్తిగా అమ్ముకున్నా వారి కుటుంబ సభ్యులకు మాత్రం యథావిధిగా ప్రత్యేక దర్శనాలు పొందే వీలుంది.
విశేష సేవలనూ విక్రయిస్తున్న సభ్యులు
ఏడుకొండలపై కొలువైన వెంకన్న దర్శనం కోసం నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుంటారు. కొందరు సంపన్నులు స్వామివారి సేవలో పాల్గొనేందుకు ఎంత ఖర్చైనా భరించేందుకు వెనుకాడకపోవటాన్ని దృష్టిలో ఉంచుకుని అధికార పార్టీ నేతలు, పీఆర్వోలు, బ్రోకర్లు ప్రత్యేక దర్శనాలు, సేవా టికెట్లకు వెల కడుతున్నారు. తమ పరపతితో టికెట్లను దక్కించుకుని బయట విక్రయిస్తున్నారు. కొందరు పాలకమండలి సభ్యులు తమకు కేటాయించిన విశేష సేవలను సైతం విక్రయిస్తుండటం గమనార్హం. ఎల్ – 1 దర్శనాలకు సంబంధించి ఒక్కో లేఖను రూ.30 వేల చొప్పున విక్రయిస్తున్నారు. సోమ, మంగళవారాల్లో బోర్డు సభ్యులకు కేటాయించే విశేషపూజ, అష్టదళ పాదపద్మారాధన సేవలను రూ.5 వేల నుంచి రూ.10 వేలకు విక్రయిస్తున్నారు.
పట్టుబట్టి కోటా పెంచుకుని...
శ్రీవారి ప్రత్యేక దర్శనాల కోటాను ఇటీవల ఏర్పాటైన టీటీడీ పాలకమండలి సభ్యులు పట్టుబట్టి మరీ పెంచుకున్నారు. టీడీపీ అధికారంలోకి రాక ముందు బోర్డులో ఒక్కో సభ్యుడికి బ్రేక్, ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3తోపాటు సుప్రభాతం, అభిషేకం, అర్చన, తోమాల, కళ్యాణోత్సవం, తిరుప్పావడ లాంటి సేవలన్నీ కలిపి రోజుకు 18 చొప్పున కేటాయించేవారు. 2014లో టీడీపీ అధికారం చేపట్టాక తొలిసారి ఏర్పాటైన పాలకమండలిలో ఒక్కో సభ్యుడికి 28 చొప్పున పెంచుకున్నారు. ఇక ఇటీవల ఏర్పాటైన నూతన పాలకమండలిలో ఒక్కో సభ్యుడికి 30 చొప్పున మరింత పెంచినట్లు తెలిసింది. వాటిలో బ్రేక్ 18, ఎల్ 1 (6), ఎల్ 2 (6), ఎల్ 3 (6)తో పాటు మిగిలిన సేవలు ఒక్కొక్కరికి రెండు చొప్పున కేటాయించారు. టీటీడీ చైర్మన్‌కు మాత్రం రోజూ సుమారు 100 ప్రత్యేక దర్శనాలు కల్పించే అధికారం ఉన్నట్లు తెలిసింది.
పీఆర్వోలు, బ్రోకర్ల ఇష్టారాజ్యం
తిరుమలలో పీఆర్వోలు, బ్రోకర్ల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ నేతల వ్యక్తిగత వ్యవహారాలను పర్యవేక్షించే వీరంతా కొందరు అధికారులతో పైరవీలు చేస్తూ సేవా టికెట్లను అమ్ముకుంటున్నారు. కొందరు బ్రోకర్లు మంత్రులు, ఎమ్మెల్యేల లేఖల పేరుతో ఫోర్జరీ సంతకాలు చేసి సేవా టికెట్లను అమ్ముకుంటున్నారు.
టీడీపీ నాయకుడైతే చాలు..
సాధారణంగా మంత్రులకు 12, ఎమ్మెల్యేలకు 6, ఎమ్మెల్సీలకు 6 చొప్పున ప్రత్యేక దర్శనాలకు అవకాశం ఉంది. టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు, టౌన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పంపే సిఫారసు లేఖలపై కూడా అధికారులు ప్రత్యేక దర్శనానికి అనుమతులు ఇచ్చేస్తున్నారు. జిల్లా అధ్యక్షుడితోపాటు కిందిస్థాయి నాయకులు పంపే సిఫారసు లేఖలపైనా టీటీడీ ప్రత్యేక దర్శనాలు కల్పిస్తోంది. ఇటీవల తిరుపతికి చెందిన ఓ టీడీపీ నాయకుడు పంపిన సిఫారసు లేఖను అధికారులు తిరస్కరించటంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆయన ఓ మంత్రిపై ఒత్తిడి తెచ్చారు. దీంతో అప్పటి నుంచి ఆ నాయకుడు పంపే సిఫారసు లేఖలపై ప్రత్యేక దర్శనాలు కల్పిస్తున్నారు. తిరుపతి, తిరుమలలో ఉన్న ప్రముఖ హోటళ్ల యాజమాన్యాలు పంపే లేఖలపై కూడా టీటీడీ ప్రత్యేక దర్శనాలు కల్పిస్తుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment