
పోలీస్ స్టేషన్‌లో పేలుడు
నెల్లూరు: పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు జరిగి పెను ప్రమాదం తప్పిన ఘటన నెల్లూరు జిల్లా చేజర్ల పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఉదయం జరిగింది. వివరాలు... చేజర్ల పోలీసులు మూడు నెలల క్రితం ఓ బాణా సంచా తయారీ కేంద్రంపై దాడి చేసి అక్కడ ఉన్న బాణా సంచాను తీసుకు వచ్చి పోలీస్ స్టేషన్ అవరణలో పూడ్చిపెట్టారు. ఎండలు తీవ్రంగా ఉండటంతో బాణా సంచా పూడ్చిన ప్రదేశంలో గురువారం నుంచే స్వల్పంగా పేలుళ్లు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది.
చుట్టు పక్కల ఇళ్లపై పేలుడు పదార్ధాలు పడి ఇంటి రేకులు గాలిలో ఎగిరిపోయాయి. పనివేళల్లో ఈ సంఘటన జరిగి ఉంటే పెను ప్రమాదం జరిగేదని స్తానికులు తెలిపారు. ఈ సంఘటనతో ఆగ్రహం చెందిన గ్రామస్తులు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. రెండురోజులు నుంచి పేలుడు సంభవిస్తున్నా పోలీసులు నిర్లక్ష్యం వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతంగా కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
(చేజెర్ల)