చీరాల రూరల్, న్యూస్‌లైన్ : చీరాలలోని దుగ్గిరాల గోపాలకృష్ణయ్య 100 పడకల ప్రభుత్వాస్పత్రి రక్తనిధి కేంద్రంలో రక్త నిల్వలు పూర్తిగా అడుగంటిపోయాయి. ఈ ఆస్పత్రిలో రోగుల సంఖ్యను బట్టి నెలకు 100 యూనిట్ల (ప్యాకెట్లు) రక్తం అవసరమవుతుంది. అయితే, ప్రస్తుతం ఆస్పత్రిలోని రక్తనిధి కేంద్రంలో 21 రక్తం ప్యాకెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో ఏదైనా అత్యవసరమైతే పరిస్థితి ఏంటో అర్థంకావడం లేదని ఆస్పత్రిలోని రోగులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.
చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లోని పేద ప్రజలకు ఈ వైద్యశాల సంజీవిని వంటిది. రెండు నియోజకవర్గాల్లోని పేదల్లో ఎవరికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా చీరాల ఏరియా వైద్యశాలలో చేరి చికిత్స పొందుతుంటారు. ముఖ్యంగా గర్భిణులు, రోడ్డు, ఇతర ప్రమాదాల్లో గాయపడినవారు, వివిధ రకాల వ్యాధులకు గురై ఆపరేషన్లు అవసరమైన వారు ఈ ఆస్పత్రి రక్తనిధి కేంద్రంలోని రక్త నిల్వలను సద్వినియోగం చేసుకుంటుంటారు. వీరికి నెలకు సుమారు 100 ప్యాకెట్ల ర క్తం అవసరమవుతుంది. దాతల నుంచి సేకరించిన రక్తాన్ని నిల్వ చేసేందుకు ఈ ఆస్పత్రిలో అత్యాధునిక పరికరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. నాలుగు డీప్ ఫ్రిజ్‌లు 24 గంటల పాటు పనిచేస్తుంటాయి. ఒక్కొక్క ఫ్రీజ్‌లో 100 యూనిట్ల రక్తం ప్యాకెట్లు భద్రపరిచే వీలుంటుంది.
ప్రస్తుతం వేసవికాలం కావడంతో రక్తాన్ని దానం చేసేందుకు దాతలు, విద్యార్థులు ముందుకు రావడం లేదు. ఆస్పత్రిలో ప్రస్తుతం ఓ పాజిటివ్ రక్తం 14 ప్యాకెట్లు, ఏ పాజిటివ్ రక్తం 5 ప్యాకెట్లు, బీ పాజిటివ్ రక్తం ఒక ప్యాకెట్, ఓ నెగెటివ్ రక్తం ఒక ప్యాకెట్ కలిపి మొత్తం 21 రక్త ప్యాకెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వాటి సంఖ్యను పెంచేందుకు సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు రక్తదాన శిబిరాలు నిర్వహించి ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉండగా, స్థానికంగా అలాంటి దాఖలాలు కనిపించడం లేదు. ఫలితంగా రోగులకు ప్రాణసంకటంగా పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా వైద్యాధికారులు స్పందించి రక్తదానంపై ప్రజలకు అవగాహన కల్పించి ఆస్పత్రిలోని రక్తనిధి కేంద్రంలో నిల్వలు పెంచాల్సిన అవసరం ఉంది.
జూన్ వరకూ ఇదే పరిస్థితి : డాక్టర్ ప్రియంవద, రక్తనిధి కేంద్రం నిర్వాహకురాలు, చీరాల
ప్రతి ఏడాదీ మార్చి నుంచి రక్తనిధి కేంద్రంలో రక్త నిల్వలు తగ్గుతూ వస్తాయి. జూన్ వరకూ ఇదే పరిస్థితి ఉంటుంది. మిగిలిన నెలల్లో మాత్రం ఎప్పుడూ 100 ప్యాకెట్లకు తగ్గకుండా రక్త నిల్వలుంటాయి. రక్తదానం చేసేవారిలో ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలల విద్యార్థులు ఎక్కువ మంది ఉంటారు. ప్రస్తుతం విద్యా సంస్థలకు వేసవి సెలవులు కావడంతో రక్తదాన శిబిరాలు నిర్వహించక రక్త నిల్వలు తగ్గిపోయాయి. ప్రస్తుతం సాధారణ నిల్వల్లో సగం నిల్వలు కూడా చీరాల ఏరియా ఆస్పత్రి రక్తనిధి కేంద్రంలో లేకుండా పోయాయి. స్వచ్ఛంద సంస్థలను సంప్రదించి రక్తదాన శిబిరాలు నిర్వహించి ఆస్పత్రిలో రక్త నిల్వలు పెంచేందుకు చర్యలు తీసుకుంటాం. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి తద్వారా ప్రాణదాతలుగా నిలవాలి.
అడుగంటిన రక్త నిల్వలు
Published Wed, May 14 2014 3:55 AM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM
Advertisement