ఇచ్చిపుచ్చుకుంటే.. ఎంతో బాగుంటుంది.. | Blood Shortage in Vizianagaram Blood Banks | Sakshi
Sakshi News home page

ఇచ్చిపుచ్చుకుంటే.. ఎంతో బాగుంటుంది..

Apr 26 2019 1:14 PM | Updated on Apr 26 2019 1:14 PM

Blood Shortage in Vizianagaram Blood Banks - Sakshi

రక్తదానం చేస్తున్న యువత (ఫైల్‌)

విజయనగరం, పార్వతీపురం: అన్నిదానాల్లో కెల్లా రక్తదానం మిన్న అన్నారు పెద్దలు. ప్రతి మనిషీ ఆరోగ్యాంగా ఉండాలంటే శరీరంలో సరిపడా రక్తం ఉండాలి. ఒక్కోసారి శరీరంలో రక్తం తగినంత మోతాదులో లేనప్పుడు వివిధ రకాల అనారోగ్యాలకు గురవుతుంటారు. రక్తాన్ని తయారు చేయలేము కాబట్టి రక్తాన్ని ఒకరినుంచి సేకరించి మరొకరికి ఎక్కించి ప్రమాదం నుంచి గట్టెక్కించడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. ఒక వేళ రక్తదాతలున్నా ఆ రక్తాన్ని నేరుగా వేరొకరికి ఎక్కించలేము. ఒక వ్యక్తి నుంచి సేకరించిన రక్తాన్ని రక్తనిధి కేంద్రంలో పరీక్షలు జరిపి అది ఏ గ్రూపునకు చెందినదో తెలుసుకుని  వారికి అత్యవసర సమయాల్లో అందిస్తారు. ఇందులో భాగంగా ఏర్పడినవే రక్తనిధి కేంద్రాలు. పార్వతీపురం ఏరియా ఆస్పత్రిలో 2007లో రక్తనిధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అప్పటినుంచి ఈ ప్రాంత రోగులకు అవసరమైన రక్తాన్ని సేకరించి సరఫరా చేస్తున్నారు.

ప్రమాదాల్లో గాయపడిన వారికి, శస్త్రచికిత్సల్లో రక్తం అవసరమైన వారికి, రక్తహీనతతో బాధపడేవారికి అవసరమైన రక్తాన్ని ఈ కేంద్రం ద్వారా అందిస్తూ రక్తనిధి సేవలను చాటుకుంటూ వస్తున్నారు. కాని ఇప్పుడు ఈ రక్తనిధి పరిస్థితి క్లిష్ట పరిస్థితికి చేరుకుంది. రక్తం కావాలని అవసరమైన రక్తాన్ని తీసుకుపోయేవారు తప్ప రక్తాన్ని దానం చేసేవారు తక్కువగా ఉండడంతో కేంద్రంలో రక్త నిల్వలు రోజురోజుకీ కనిష్టానికి పడిపోతున్నాయి. రక్తం కావాల్సిన వారు డోనర్‌ ద్వారా రక్తదానం చేపట్టి వారికి కావాల్సిన రక్తం తీసుకెళ్తే రక్తం కొరత ఉండదు. కాని ఎక్కువ మంది రక్తం కావాలని అడిగి తీసుకెళ్తున్నారు తప్ప దానం చేయడం లేదు. ఒకప్పుడు మూడంకెల్లో నిల్వ ఉండే రక్తం బ్యాగులు ఇప్పుడు రెండంకెలకు (20 కంటే తక్కువ) పడిపోయాయి. దీంతో రోగులకు అవసరమైన గ్రూపులకు చెందిన రక్తం నిల్వలు అందుబాటులో ఉండడం లేదు. ఇచ్చిపుచ్చుకునే సూత్రాన్ని అనుసరించినన్నాళ్లు నిల్వలు బాగానే ఉన్నాయి. కాని ఇప్పుడు దాతలు ముందుకు రాకపోవడంతో నిల్వలు తగ్గిపోతున్నాయని రక్తనిధి కేంద్రం సిబ్బంది చెబుతున్నారు.

శిబిరాలు నిర్వహిస్తున్నాం..
ప్రస్తుతం రక్తనిధి కేంద్రలో చాలా తక్కువగా రక్తనిల్వలు ఉన్నాయి. స్వచ్ఛంద సంస్థలు, అభిమాన సంఘాల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నాం. వేసవికాలం కావడంతో డోనర్లు ముందుకు రావడం లేదు.–  ఎం. మధుకర్, ల్యాబ్‌టెక్నీషియన్‌

దాతలను తీసుకురావాలి..
రక్తం కావాల్సిన వారు దాతలను తీసుకువస్తే మంచింది. రక్తదానం చేసి వారికి కావాల్సిన రక్తాన్ని తీసుకెళ్తే అందరికీ బాగుంటుంది. రక్తం నిల్వలు పెంచేందుకు చర్యలు చేపడుతున్నాం. – డాక్టర్‌ స్వాతి,రక్తనిధి ఇన్‌చార్జ్, పార్వతీపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement