ఐదుగురు ఉసెండీలు | Blow to Maoists, top leader Gudsa Usendi surrenders | Sakshi
Sakshi News home page

ఐదుగురు ఉసెండీలు

Published Tue, Jan 14 2014 12:28 AM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM

ఐదుగురు ఉసెండీలు - Sakshi

ఐదుగురు ఉసెండీలు

సాక్షి ప్రతినిధి, వరంగల్: మావోయిస్టుల కీలక నేత గుముడవెల్లి వెంకట కృష్ణప్రసాద్ (జీవీకే) అలియాస్ గుడ్సా ఉసెండి లొంగుబాటు ఇటీవల తీవ్ర చర్చనీయాంశమైంది. మావోయిస్టు పార్టీ కీలక నేతగా ఉన్న ఉసెండి లొంగుబాటుతో.. ఇక లొంగుబాట్ల పరంపర కొనసాగుతుందని కేంద్ర హోంమంత్రి, రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. కానీ.. వామపక్ష ఉద్యమ అనుకూలురు మాత్రం ఇదంతా పోలీసుల ఎత్తుగడేనని, లొంగిపోయింది ఉసెండి కాదు.. జీవీకే ప్రసాద్ అని అంటున్నారు. అయితే ప్రభుత్వం, వామపక్ష ఉద్యమకారుల వాదనలెలా ఉన్నా... మావోయిస్టు పార్టీలో మరో నలుగురు ఉసెండిలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గుముడవెల్లి వెంకట కృష్ణప్రసాద్ వారిలో ఒకరని అంటున్నారు.
 
 ‘‘ఉసెండి’ అనే పేరు ఛత్తీస్‌గఢ్‌లోని ఆదివాసీలకు ఉంటుంది. అలా అక్కడి మావోయిస్టుల్లో ఉసెండి పేరుతో ఉన్న ఓ దళ సభ్యుడు పోరాటాల్లో ముందుండేవాడు. ఒక ఎన్‌కౌంటర్‌లో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. మావోయిస్టుల్లో అమరవీరుల పేరుతో కీలక నేతలు కొనసాగే సంప్రదాయం ఉంది. అలా ఆ ఆదివాసీ దళ సభ్యుడి పేరుతో పలువురు కీలక నేతలు పార్టీలో కొనసాగుతున్నారు’’ అని మావోయిస్టు పార్టీ సానుభూతిపరులు చెబుతున్నారు. దాంతోపాటు ఆదివాసీలతో మమేకం కావడం కోసం కూడా మావోయిస్టు కీలక నేతలు అక్కడి వారి పేర్లతో పనిచేస్తున్నారు. ఇలా కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో మావోయిస్టుల భారీ దాడులన్నీ ఉసెండి పేరుతోనే జరుగుతున్నాయి.
 
 మావోయిస్టు పార్టీ పత్రిక నిర్వహణతో పాటు మావోయిస్టులు జరిపిన భారీ దాడులు, ఎన్‌కౌంటర్ ఘటనలకు సంబంధించి ‘గుడ్సా ఉసెండి’ పేరుతోనే ప్రకటనలు వస్తున్నాయి. సల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్రకర్మ, ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నందకుమార్ పటేల్, మరో ఇద్దరు కేంద్ర మాజీ మంత్రులను మావోయిస్టులు మందుపాతరలు అమర్చి హతమార్చారు. ఆ ఘటనలకు సంబంధించిన ప్రకటనలూ గుడ్సా ఉసెండి పేరుతోనే వచ్చాయి. ప్రస్తుతం లొంగిపోయిన కృష్ణప్రసాద్ కూడా ‘ఉసెండి’ పేరుతో ప్రకటనలు ఇచ్చేవారని తెలుస్తోంది. మావోయిస్టు పార్టీ ఈయనకు అంతర్గత పత్రిక వ్యవహారాలు, సాహిత్య, డాక్యుమెంట్ తదితర కీలక పనులు అప్పగించినట్లు తెలిసింది.
 
 దాడుల వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తూ, జనతన సర్కార్‌ను నడుపుతున్న వారిలో ఉన్న కడారి సత్యనారాయణరెడ్డి (కరీంనగర్) అలియాస్ కోసా, రావుల శ్రీనివాస్ (వరంగల్) అలియాస్ రామన్న, గాజర్ల అశోక్ (వరంగల్) అలియాస్ ఐతు, ప్రభాకర్ (మహబూబ్‌నగర్) అలియాస్ కిరణ్, ప్రసాదరావు (కరీంనగర్) అలియాస్ చంద్రన్న... వీరందరు కూడా ‘గుడ్సా ఉసెండి’ పేరుతోనే కార్యక్రమాలు చేపడుతారని చెబుతున్నారు. ఇప్పుడు వారంతా దండకారణ్యంలోనే ఉన్నారని అంటున్నారు. ఉసెండి పేరుతో కొనసాగిన కృష్ణప్రసాద్ లొంగుబాటు విషయంలో పోలీసులు వ్యూహత్మకంగా వ్యవహరించారని వామపక్ష ఉద్యమ మద్దతుదారులు చెబుతున్నారు. ‘ఉసెండి’ పేరిట చేసిన దాడులు, ప్రకటనలు మావోయిస్టు పార్టీ ఉనికిని నిలిపాయని.. అలాంటి ఉసెండి లొంగిపోయారని చెప్పడం ఇప్పుడు పోలీసుల ప్రధాన ఉద్దేశంగా కనబడుతోందని వారు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement