
రాష్ర్టం విడిపోతే నదుల అనుసంధానం కష్టమే!
రాష్ర్టం విడిపోయిన తర్వాత ఒక నది నుంచి మరో నదికి నీటిని తరలించడం అంత సులువైన విషయం కాదని నీటిపారుదల నిపుణుడు, రిటైర్డ్ సీఈ విద్యాసాగర్‌రావు అభిప్రాయపడ్డారు.
నీటి సమస్యలను బోర్డులే పరిష్కరిస్తాయి: రిటైర్డ్ సీఈ విద్యాసాగర్‌రావు
సాక్షి, హైదరాబాద్: రాష్ర్టం విడిపోయిన తర్వాత ఒక నది నుంచి మరో నదికి నీటిని తరలించడం అంత సులువైన విషయం కాదని నీటిపారుదల నిపుణుడు, రిటైర్డ్ సీఈ విద్యాసాగర్‌రావు అభిప్రాయపడ్డారు. అయితే విభజన ప్రక్రియలో తెరపైకి వచ్చే నీటి సమస్యలను ప్రత్యేక బోర్డులే పరిష్కరిస్తాయని చెప్పారు. ఇక్కడ గురువారం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణకు రావాల్సిన న్యాయమైన నీటి కోటా ఇప్పటి వరకూ దక్కలేని, అయితే ప్రత్యేక రాష్ర్టం తర్వాత ఈ పరిస్థితి ఉండదని పేర్కొన్నారు. రాజోలిబండ డైవర్షన్ ద్వారా మహబూబ్‌నగర్‌కు 17 టీఎంసీల నీటిని ఉపయోగించుకునే అవకాశం ఉన్నా.. ఇప్పటి వరకు 6 టీఎంసీ కంటే ఎక్కువ వాడుకునే పరిస్థితి లేదని గుర్తు చేశారు.
గోదావరి నీటిని కృష్ణాకు తరలించడానికి ఉద్దేశించిన దుమ్ముగూడెం-సాగర్ టెయిల్ పాండ్ ప్రాజెక్టుపై అడిగిన ప్రశ్నకు.. విభజన అనంతరం ఈ ప్రాజెక్టును మరచిపోవాల్సిందేనని చెప్పారు. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఇప్పటికే తెలంగాణ ప్రాంతం వారు వ్యతిరేకిస్తున్నారని, విభజన తర్వాత దీనిని చేపట్టే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఇక పోలవరం ప్రాజెక్టు ద్వారా కృష్ణా బేసిన్‌లోకి వచ్చే నీటి పంపకంపై బోర్డులు నిర్ణయం తీసుకుంటాయన్నారు. గోదావరితో పోలిస్తే.. కృష్ణా నీటికి డిమాండ్ ఎక్కువ, నీరు తక్కువగా ఉందని, అందుకే అక్కడ ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయన్నారు. ట్రిబ్యునల్ కేటాయించిన నీటి కోటాలే రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా కొనసాగుతాయన్నారు.
కాగా రాష్ర్టం విడిపోతే నీటి యుద్ధాలు వస్తాయని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి చేసిన వాఖ్యలను విద్యాసాగర్‌రావు తీవ్రంగా ఖండించారు. కావాలనే అలా మాట్లాడుతున్నారని చెప్పారు. రాయలసీమ ప్రాంతానికి కొంత ఇబ్బంది ఉన్న మాట వాస్తవమేనని, అయితే డెల్టా ప్రాంతాల వారు ఆందోళన చేయడం తగదన్నారు. ఇప్పటికే వారు కోటా నీటికంటే ఎక్కువ ఉపయోగిస్తున్నారని తెలిపారు.