టీడీపీలో బుకీల తుపాన్
- డీఎస్పీలు, సీఐలు మాట వినడం లేదని మంత్రికి ఫిర్యాదు
- ఇసుక నుంచి మద్యం వరకు కట్టడి చేస్తే ఎలాగని ఆవేదన
- వాడీవేడిగా జిల్లా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం
- మంత్రులు అమర్‌నాథ్‌రెడ్డి, నారాయణ హాజరు
- మంత్రి సోమిరెడ్డి, ఆనం బ్రదర్స్ గైర్హాజరు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తెలుగుదేశం పార్టీలో క్రికెట్ బెట్టింగ్, ఇతర అక్రమ వ్యవహారాలపై తుపాన్ రేగింది. జిల్లా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో పార్టీకి సంబంధించిన అంశాలు, నియోజకవర్గాల్లో సమస్యలపై చర్చించాల్సిన ప్రజాప్రతినిధులు, నాయకులు అందుకు భిన్నంగా వ్యవహరించారు. సీఐలు, డీఎస్పీలు తమ మాట వినడం లేదని, ఇసుక ట్రాక్టర్లపై కేసులు నమోదు చేస్తున్నారని వాపోయారు.
క్రికెట్ బెట్టింగ్ రాకెట్ గుట్టు విప్పటం వల్ల ఇబ్బంది కలుగుతోందని, ఇసుక నుంచి మద్యం వరకు అన్ని అక్రమ వ్యవహారాలను కట్టడి చేస్తున్నారంటూ గళమెత్తారు. జిల్లాలో పోలీసులు ముక్కుసూటిగా పనిచేయడం వల్ల తెలుగు తమ్ముళ్ల ఆర్థిక మూలాలపై దెబ్బ పడుతోందని వాపోయారు. పార్టీ వ్యవహారాల కంటే ముందు ఈ విషయం తేల్చాలంటూ మంత్రుల ఎదుట పంచాయితీ పెట్టారు. ‘కనీసం సీఐ కూడా మాట వినకపోతే ఎమ్మెల్యేలుగా ఏం పని చేయాలో మీరే చెప్పండి’ అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు సమస్యల చిట్టాను విప్పారు.
‘చూసీచూడనట్టు వెళ్లమనండి’
నెల్లూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో పార్టీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి అమర్‌నా«థ్‌రెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ హాజరుకాగా.. మరో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆనం బ్రదర్స్ డుమ్మా కొట్టారు. పార్టీ ఎమ్మెల్యేలు పాశం సునిల్‌కుమార్, బొల్లినేని రామారావు, పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, కురుగొండ్ల రామకృష్ణ, మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డి, నగర మేయర్ అబ్దుల్ అజీజ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి హాజరయ్యారు.
పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా సమస్యలు ఏకరువు పెట్టారు. కొత్త ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ బాధ్యతలు చేపట్టాక ఇసుక, మద్యం అక్రమ అమ్మకాలను పూర్తిగా కట్టడి చేశారని, క్రికెట్ బెట్టింగ్ రాకెట్‌ను వారం క్రితం అదుపులో తీసుకుని విచారణ జరుపుతున్నారని చెప్పుకొచ్చారు. ఈ పరిణామాలు తమకు ఇబ్బందిగా మారాయని వాపోయారు. ముఖ్యంగా ఇసుక ఆక్రమ రవాణాను కట్టడి చేశారని.. ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు, ఇతర వాహనాలపై కేసులు నమోదు చేస్తున్నారని వివరించారు. ‘మనవాళ్లను చూసీచూడనట్టు వదలేయమని అడుగుతున్నా పోలీస్ అధికారులెవరూ మాట వినటం లేదు’ అని ఫిర్యాదు చేశారు.
గూడూరు ఎమ్మెల్యే సునిల్‌కుమార్ ఇసుక అక్రమ రవాణా అంశాన్ని లేవనెత్తారు. కొన్ని సందర్భాల్లో పేదలకు కూడా ఇసుక దొరకటం లేదని, వరుస కేసులు నమోదు చేస్తే అందరికీ కష్టమవుతుందని చెప్పారు. ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కన్నబాబు మాట్లాడుతూ మద్యం షాపులపైనా పోలీసులు విరుచుకుపడుతున్నారని.. బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మితే వారితోపాటు లైసెన్స్‌దారులపైనా కేసులు నమోదు చేస్తామని చెప్పారని ఫిర్యాదు చేశారు. దీనివల్ల టీడీపీ నేతల ఆర్థిక మూలాలకు దెబ్బ తగులుతోందని వాపోయారు. కనీసం ఎస్సై అయినా తమ వినకపోతే అధికార పార్టీ నేతలుగా ఏం చేయగలుగుతామని కొందరు ప్రశ్నించారు.
మంత్రులతో కలెక్టర్, ఎస్పీ, జేసీ భేటీ
సమన్వయ కమిటీ సమావేశం అనంతరం మంత్రి నారాయణ క్యాంప్ కార్యాలయంలో మంత్రులు అమర్‌నాథ్‌రెడ్డి, పి.నారాయణతో కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు, ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ, జేసీ ఇంతియాజ్ అహ్మద్ భేటీ అయ్యారు. ఇదే సందర్భంలో పలువురు ఎమ్మెల్యేలు జిల్లా అధికారులను కలిశారు. ఈ సందర్భంగా మంత్రులు బెట్టింగ్ రాకెట్ కట్టడి విషయంలో జిల్లా ఎస్పీని అభినందించినట్టు సమాచారం. ఇసుక వ్యవహారంపై మాట్లాడగా.. దీనిపై శనివారం సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.