లెవీ జోరు
Published Fri, Dec 27 2013 4:27 AM | Last Updated on Sat, Sep 2 2017 1:59 AM
తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్ :లెవీ సేకరణ ఊపందుకుంది. బియ్యం సేకరిస్తున్న ఎఫ్‌సీఐకి పరిస్థితులు అనుకూలించడంతో మిల్లుల నుంచి పెద్దఎత్తున లోడులు వెళుతున్నాయి. డిఫాల్టర్ల పేరుతో మిల్లర్లను ఎఫ్‌సీఐ ఇబ్బందిపెట్టినా.. సమస్య సానుకూలంగా పరి ష్కారం కావడంతో లెవీ సేకరణ ప్రక్రియవేగంగా సాగుతోంది. ఇప్పటికే లక్షా 30 వేల టన్నులకు పైగా బియ్యాన్ని మిల్లర్లు ఎఫ్‌సీఐకి తరలించారు. జిల్లాలో ఐదు లక్షల టన్నుల బియ్యూన్ని నిల్వ చేసేందుకు వీలుగా గోదాముల్లో జాగా ఉంది. ఇప్పటివరకు ఎఫ్‌సీఐ సేకరించిన బియ్యంతో రెండు లక్షల టన్నుల జాగా నిండి ఉంది. ఇంకా మూడు లక్షల టన్నుల జాగా మిగిలివుంది.
ఇదిలావుంటే రైల్వే వ్యాగన్లు కేటాయించడంలోనూ రైల్వే అధికారులు చురుగ్గా వ్యవహరిస్తున్నారు. గత సీజన్‌లో నెలకు 13 నుంచి 15 వ్యాగన్లు మాత్రమే కేటాయించే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం డిసెంబరు నెలకు 21 వ్యాగన్లు కేటాయించారు. పౌరసరఫరాల కోసం, ఇతర అవసరాల నిమిత్తం బియ్యం రవాణా అవుతున్నాయి. జిల్లాలో ఉన్న డిపోలతో పాటు స్టాండ్ బై డిపోలను ఎఫ్‌సీఐ సిద్ధం చేసుకుంది. సీజన్‌లో కనుక లెవీ బియ్యం పెరిగితే, వాటితో ఉన్న గోదాములు నిండిపోతే , స్టాండ్‌బైగా సెంట్రల్ వేర్ హౌసింగ్ గోదాములు, అద్దె గోదాములు, ఇతర గోదాములను ఎఫ్‌సీఐ సిద్ధం చేసుకుంది. మొత్తం మీద రోజుకు ఆరువేల టన్నులకు పైగా బియ్యం లెవీగా ఎఫ్‌సీఐకి చేరుతున్నాయి.
Advertisement
Advertisement