ఇద్దరి ప్రాణం తీసిన వేగం
గుత్తి రూరల్ : ప్రయాణికుల ఆటోను ఇన్నోవా కారు ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందగా, పది మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని బాచుపల్లి గ్రామ శివార్లలో 44వ జాతీయ రహదారిపై ఎన్‌టీపీసీ క్రాస్ వద్ద శనివారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. డోన్ నుంచి గుత్తికి 15 మంది ప్రయాణికులతో వస్తున్న ఆటోను అనంతపురం వైపు నుంచి కర్నూలు వెళుతున్న ఇన్నోవా కారు వేగంగా వస్తూ ఢీకొంది. దీంతో ఆటోలో ఉన్న కర్నూలు జిల్లా కరిడికొండకు చెందిన శ్రీరాములు(55) అక్కడికక్కడే మృతి చెందగా, గుత్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అదే జిల్లా ప్యాపిలి మండలం పోదొడ్డికి చెందిన గుర్రమ్మ(60) మృతి చెందింది. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ప్యాపిలికి చెందిన నిండు గర్భిణి సౌభాగ్య, ఆమె తల్లి నారాయణమ్మతో పాటు ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన అరుణ, ప్రేం కుమార్, కరిడికొండకు చెందిన శంకరమ్మ పరిస్థితి విషమంగా ఉంది.
కరిడికొండకు చెందిన నీలావతి, నాగరాజు, గిద్దలూరుకు చెందిన సుధాకర్, ఆటో డ్రైవర్ రాముడు, కారులో ప్రయాణిస్తున్న కర్నూలుకు చెందిన మహేష్ తీవ్రంగా గాయపడ్డారు. నిండు గర్భిణి సౌభాగ్యకు అత్యధికంగా రక్తస్రావం కావడంతో ప్రాణాపాయ స్థితి నెలకొంది. క్షతగాత్రులందరినీ 108 వాహనంలో గుత్తి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం వారిని కర్నూలుకు తరలించారు. గుత్తి ఎస్‌ఐ కృష్ణారెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. కారు ఎక్కువ వేగంతో వస్తుండటం వల్ల డ్రైవర్ అదుపు చేసుకోలేకపోయారని తెలుస్తోంది.