తిరుమల సంప్రదాయాన్ని పాటించిన గవర్నర్
తిరుమల : ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ సోమవారం తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటించారు. వేకువజామున శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. అనంతరం పుష్కరిణి వద్దకు చేరుకుని పుణ్యజలాన్ని ప్రోక్షణం చేసుకుని, సతీమణి విమల నరసింహన్‌తో కలసి తొలుత భూ వరాహస్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మహా ద్వారం నుంచి ఆలయానికి వచ్చారు.
టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు ఆయనకు స్వాగతం పలికారు. ముందుగా గవర్నర్ దంపతులు ధ్వజస్తంభానికి సాష్టాంగ నమస్కారం చేశారు. అనంతరం పచ్చ కర్పూరపు వెలుగులో గర్భాలయ మూలమూర్తి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని ఆనంద పరవశులయ్యారు. ఆ తర్వాత వకుళమాతను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. జేఈవో శ్రీనివాసరాజు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. గవర్నర్ దంపతుల వెంట ఓఎస్‌డీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ దంపతులు కూడా ఉన్నారు.