
'రాజధాని ప్రకటనలో నీ ఆంతర్యం ఏంటీ బాబు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తాత్కాలిక రాజధానిని ప్రకటించడంలో గల ఆంతర్యం ఏమిటని చంద్రబాబు ప్రభుత్వాన్ని మాజీ పీసీసీ చీఫ్, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. గురువారం హైదరాబాద్లో బొత్స విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట రాజధాని ఎంపికపై కేంద్రం ప్రొ.శివరామకృష్ణన్ కమిటీ ని నియమించిందని గుర్తు చేశారు. ఆ కమిటీ ఇంకా నివేదిక ఇవ్వకుండానే తాత్కాలిక రాజధాని అంటూ చంద్రబాబు నాయుడు ప్రకటన చేయడం దారుణమని ఆరోపించారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ మాట అధికారంలోకి వచ్చాక మరో మాట్లాడటం ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకే చెల్లిందంటూ చంద్రబాబును బొత్స విమర్శించారు. విభజన నేపథ్యంలో 10 ఏళ్ల వరకు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా హైదరాబాద్ ఉంటుందని... ఈ తరుణంలో తాత్కాలిక రాజధానిగా విజయవాడను ఎందుకు తెరపైకి తీసుకువచ్చారో వెల్లడించాలని బొత్స ఈ సందర్భంగా బాబును డిమాండ్ చేశారు.