సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రయోజనాల కోసం, అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం వికేంద్రీకరణ దిశగా ముందుకెళతామని, ఇందులో ఎలాంటి సంకోచం లేదని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల కారణంగా కొంత జాప్యమే తప్ప, రాజధానుల ప్రక్రియ మాత్రం ఆగదని స్పష్టం చేశారు. పాలనా వికేంద్రీకరణకు వ్యతిరేకమా? అనుకూలమా? అనే విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయనకు వత్తాసు పలుకుతున్న వారు చెప్పాలని ప్రశ్నించారు. ఆయన బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘మూడు రాజధానులు వద్దని, జీఎన్ రావు, బోగస్ కమిటీలు బోగస్ అని అప్పుడు చంద్రబాబు చెప్పారు. ఆయనకు వత్తాసు పలుకుతున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, ఈటీవీ చానళ్లు, జనసేన లాంటి పార్టీలు గత పది రోజులుగా ఊకదంపుడు కార్యక్రమాలు చేశాయి. ఇప్పుడేమో ఆ కమిటీల రిపోర్టులో విశాఖ రాజధానికి అనుకూలం కాదని ఉన్నట్లు తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. భోగి మంటల్లో వేసి కాల్చేయమన్న జీఎన్ రావు, బోస్టన్ కమిటీ నివేదికలు ఈ రోజు చంద్రబాబుకు భగవద్గీత అయ్యాయా?’ అని బొత్స వ్యంగ్యంగా అన్నారు.
అన్నీ పరిగణనలోకి తీసుకునే నిర్ణయం..
దేశంలో తుపాను ముప్పు లేని నగరం ఉంటుందా? అని బొత్స ప్రశ్నించారు. ముంబై, చెన్నై కూడా తుపాను ప్రాంతాలే కదా? అక్కడ రాజధానులు లేవా? అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకునే విశాఖను పరిపాలనా రాజధానిగా నిర్ణయించామన్నారు. హుద్‌హుద్ వచ్చినప్పుడు సముద్ర తీరంలోనే నష్టం జరిగిందని, నగరంలో ఏమాత్రం ప్రభావం చూపలేదని చెప్పారు. అమరావతిలో వరద వస్తే మొత్తం రాజధానే మునుగుతుంది కదా? అని బొత్స ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. విశాఖలో 1,75,760 మంది ఇళ్ల స్థలాల లబ్ధిదారులున్నారని, వారందరికీ జీప్లస్, జీప్లస్ 2, జీప్లస్ 3 ఇళ్లు కట్టాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారని చెప్పారు. బలహీన వర్గాల వారి కోసమే ల్యాండ్ పూలింగ్ అడిగామని బొత్స మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అమ్మ ఒడి పథకం కింద రాష్ట్రంలోని తల్లులకు రూ. 6,400 కోట్లు లబ్ధి చేకూర్చినప్పుడే.. ‘మన పిల్లలు చదివే స్కూలు అభివృద్ధి కోసం రూ. 1,000లు సహాయం చేయాలని’ సీఎం జగన్ కోరారని, ఆ ప్రకారం తల్లులు ఇస్తుంటే దాన్ని జులుం అని రాయడం ఏమిటని ప్రశ్నించారు.
మూడు రాజధానుల ప్రక్రియ ఆగదు
Published Thu, Jan 30 2020 4:26 AM | Last Updated on Thu, Jan 30 2020 7:44 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment