temporary capital
-
‘అమరావతికి వెళ్లేది లేదు’
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి వెళ్లేది లేదంటూ సచివాలయంలోని తెలంగాణ ప్రాంతానికి చెందిన నాలుగో తరగతి ఉద్యోగులు ప్రభుత్వానికి ఆల్టిమేటం ఇచ్చారు. తెలంగాణకు చెందిన తమను ఆ ప్రభుత్వానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. బుధవారం సచివాయంలోని ఎల్ బ్లాక్ ముందు మూడు, నాలుగో తరగతి ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో ధర్నా చేపట్టారు. చాలీచాలని జీతాలతో తాత్కాలిక రాజధాని వెలగపూడికి వెళ్లి ఎలా బతకాలంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ‘జై తెలంగాణ.. జై జై తెలంగాణ’, న్యాయం చేయాలంటూ అంటూ నినాదాలు చేశారు. తమకు న్యాయం జరిగేంత వరకు నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు. అనంతరం సచివాలయం నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వీర వెంకటేశ్వరరావు మీడియా పాయింట్లో మాట్లాడుతూ... ఏపీ సచివాలయంలో తెలంగాణకు చెందిన క్లాస్‌ఫోర్ ఉద్యోగులు 255 మంది ఉన్నారని వారందరిని తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. -
టాప్ టెన్‌లో విజయవాడకు దక్కని చోటు!
- మొదటిస్థానంలో విశాఖపట్నం కార్పొరేషన్ - మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ నివేదికలో వెల్లడి సాక్షి, విజయవాడ బ్యూరో : రాష్ట్రంలో ఉత్తమంగా నిలిచిన పది మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల జాబితాలో తాత్కాలిక రాజధాని విజయవాడ చోటు దక్కించుకోలేకపోయింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నగరం నుంచే పరిపాలన నడిపిస్తున్నా, అత్యున్నత అధికార యంత్రాంగం దాదాపు ఇక్కడే ఉంటున్నా పరిస్థితిలో మార్పు రాలేదు. సేవలు, సౌకర్యాల్లో చిన్నచిన్న పట్టణాల స్థాయిని కూడా విజయవాడ అందుకోలేకపోయింది. రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 97 మున్సిపాల్టీల్లో టాప్ టెన్ జాబితాను మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ఇటీవల ప్రకటించింది. అందులో విశాఖపట్నం కార్పొరేషన్ మొదటి స్థానంలో నిలవగా, అనంతపురం జిల్లాలోని హిందూపూర్ మున్సిపాలిటీ రెండో స్థానంలో, పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు మున్సిపాలిటీ మూడో స్థానంలో నిలిచాయి. నాలుగో స్థానంలో గుంటూరు కార్పొరేషన్, ఐదో స్థానంలో గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట, ఆరో స్థానంలో నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట, ఏడో స్థానంలో అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, ఎనిమిదో స్థానంలో తూర్పుగోదావరిలోని అమలాపురం, తొమ్మిదో స్థానంలో ప్రకాశం జిల్లా చీరాల, పదో స్థానంలో అనంతపురం జిల్లాలోని గుంతకల్ నిలిచాయి. 11 అంశాలకు వంద మార్కులిచ్చి ఎక్కువ మార్కులు వచ్చిన టాప్ పది మున్సిపాలిటీలను ఎంపిక చేశారు. విశాఖపట్నం కార్పొరేషన్‌కు 53.09 శాతం మార్కులురాగా, హిందూపూర్ మున్సిపాలిటీకి 50.88, కొవ్వూరు మున్సిపాలిటీకి 49.94 మార్కులొచ్చాయి. ఈ మార్కులూ తక్కువే అయినా ఉన్న వాటిలో ఈ నగరాలే కొంచెం ఫర్వాలేదనిపించే స్థాయిలో ఉన్నాయని పట్టణాభివృద్ధి శాఖాధికారులు చెబుతున్నారు. తాత్కాలిక రాజధానిలో సేవలు, సౌకర్యాలు చెత్తే.. తాత్కాలిక రాజధాని వీటి స్థాయిని కూడా అందుకోలేక చతికిలబడింది. ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరించడం, చెత్తను డంపింగ్ యార్డులకు తరలించడం, ఆస్తి పన్ను వసూళ్లు, సిటిజన్ చార్టర్ అమలు, ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులను పరిష్కరించడం, ఆర్థిక పరిస్థితి, స్కూళ్లలో ఐఐటీ ఫౌండేషన్, వ్యక్తిగత, ఉమ్మడి మరుగుదొడ్ల ఏర్పాటు- నిర్వహణ, తాగునీటి సరఫరా, వీధి దీపాలు నిర్వహణ, టౌన్‌ప్లానింగ్ కార్యకలాపాలు, డ్వాక్రా గ్రూపులకు రుణాలు, స్కిల్ డెవలప్మెంట్, గ్రీనరీ ఏర్పాటులో పనితీరును బట్టి మార్కులిచ్చారు. ఈ అంశాల్లో దేనిలోనూ విజయవాడ కార్పొరేషన్‌కు మార్కులు వచ్చే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి ఇక్కడ పరిపాలన ప్రారంభించిన తర్వాత ప్రధాన రోడ్లలో గ్రీనరీ, ఎల్ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేయడం మినహా పెద్దగా పురోగతి లేదు. చెత్త నిర్వహణ అధ్వానంగా తయారవడంతో స్థానికుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. విజ్ఞప్తుల పరిష్కారంలోనూ కార్పొరేషన్ బాగా వెనుకబడింది. మిగిలిన అన్ని విషయాల్లోనూ అంతంత మాత్రంగానే ఉంది. కార్పొరేషన్ ఆర్థిక పరిస్థితి అయితే మరీ దారుణం. మొన్నటివరకూ జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడిప్పుడే ఆర్థిక పరిస్థితిలో కొంచెం మార్పు వచ్చినా మిగిలిన నగరాలు, పట్టణాలతో పోల్చుకుంటే అది తీసికట్టే. ఈ నేపథ్యంలో అన్నింట్లో వెనుకబడిన తాత్కాలిక రాజధాని టాప్ టెన్ జాబితాలో చోటు దక్కించుకోవడం అత్యాశే అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
'మోసం చేయడం చంద్రబాబుకు అలవాటే'
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఢిల్లీకి వెళ్లిన సీఎం చంద్రబాబు ఎలాంటి హామీ తీసుకరాలేదని ధ్వజమెత్తారు. బుధవారం ఆయన కర్నూలులో విలేకరులతో మాట్లాడారు. ఏపీ నూతన రాజధాని పేరుతోనూ చంద్రబాబు భూ స్కాంకు పాల్పడ్డారంటూ దుయ్యబట్టారు. ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు అలవాటేనని అన్నారు. స్క్వేర్ ఫీట్‌కు రూ. 3,500లు ఇచ్చి ఎల్అండ్టీతో తాత్కాలిక రాజధాని కట్టిస్తున్నారని ఆరోపించారు. రాజధాని విషయంలోనూ చంద్రబాబు దోపిడీకి పాల్పడుతున్నారని అంబటి రాంబాబు విమర్శించారు. -
నో క్లారిటీ నో వర్క్
-
'బాబుకు నారాయణ లిమిట్లెస్ ఏటీఎం'
-
'బాబుకు నారాయణ లిమిట్లెస్ ఏటీఎం'
హైదరాబాద్ : తాత్కాలిక రాజధాని పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి ప్రజాధనాన్ని వృధా చేస్తోందని మంగళగిరి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బుధవారమిక్కడ మండిపడ్డారు. జీతాలు ఇచ్చేందుకు డబ్బులు లేవన్న చంద్రబాబుకు తాత్కాలిక రాజధాని నిర్మాణం కోసం డబ్బులు ఎలా వచ్చాయన్నారు. విజయవాడ, గుంటూరులో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లోనే తాత్కాలిక రాజధానిని సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళగిరి సమీపంలో ఉన్న హరిహంత్ ప్రాజెక్ట్‌కి ప్రత్యామ్నాయ భూములు ఇచ్చిన విధంగానే రాజధాని ప్రాంత రైతులకు కూడా ఇవ్వాలని ఆర్కే అన్నారు. భూకేటాయింపుల వ్యవహారాలను రెవెన్యూ మంత్రి చూడాలని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. అయితే రెవిన్యూ మంత్రిగా ఉన్న కేఈ కృష్ణమూర్తి ఒక్కసారి కూడా రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో పర్యటించకపోవటంలో ఆంతర్యమేమిటో చెప్పాలన్నారు. కేఈ కృష్ణమూర్తి కన్నా మంత్రి నారాయణ అయితే చంద్రబాబు నాయుడుకు బాగా పనికొస్తారని ఆయన్ని ముందుకు పెట్టారన్నారు. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే చంద్రబాబుకు కేఈ చెప్తారనే ఆయనను పక్కకు పెట్టారని ఆర్కే వ్యాఖ్యానించారు. కేవలం తన చేతిలో కీలుబొమ్మలా ఉండే వ్యక్తులకే చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తారని ఆయన విమర్శించారు. ఎన్నడూ ప్రజల చేత ఎన్నికకాని మంత్రి నారాయణకు రాజధాని వ్యవహారాలను ఎలా అప్పగిస్తారన్నారు. చంద్రబాబుకు లిమిట్లెస్ ఏటీఎంగా మంత్రి నారాయణ ఉన్నారని ఆర్కే వ్యాఖ్యానించారు. కృష్ణాతీరంలోని కబ్జారాయుళ్ల జోలికి వెళ్లిని ప్రభుత్వం...పేదల భూముల్ని లాక్కోవడం దారుణమన్నారు. -
'తాత్కాలిక రాజధానిపై రెండు రోజుల్లో నిర్ణయం'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తాత్కాలిక రాజధాని ఎక్కడనేది మరో రెండు రోజుల్లో వెల్లడిస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాత్కాలిక రాజధాని అంశాన్ని త్వరలోనే తెలుపుతామని తెలిపారు. జూన్ ఏడు నాటికి ముఖ్యమైన కార్యాలయాలను గుంటూరు తరలిస్తామని ఆయన పేర్కొన్నారు. ఏపీ రాజధానికి సంబంధించి 15 వేల ఎకరాల భూమిని సమీకరించినట్లు మంత్రి తెలిపారు. మరో నెల రోజుల్లో మిగతా 50 శాతం భూమిని సమీకరిస్తామన్నారు. -
ఉన్నపళంగా తరలింపు తగదు
ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు మంత్రులు చెట్ల కింద పనిచేస్తే ఉద్యోగులూ సిద్ధం ఒత్తిడి వల్ల లాభం కంటే ఇబ్బందులే ఎక్కువ విజయవాడ బ్యూరో: తాత్కాలిక రాజధానికి ఉద్యోగుల బదిలీ ప్రక్రియ దశలవారీగా జరగాలే తప్పా ఇప్పటికిప్పుడే హైదరాబాద్ నుంచి తరలించే యత్నం సరికాదని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు పి.అశోక్‌బాబు అన్నారు. తాత్కాలిక రాజధానికి తక్షణం వెళ్లిపోవాలంటే.. మంత్రులు, ఐఏఎస్‌లు చె ట్ల కింద కూర్చుని పనిచేస్తే తామూ పనిచేస్తామన్నారు. విజయవాడ ఏపీఎన్జీవో కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తున్న అనేక అంశాలను మంగళవారం సీఎం చంద్రబాబుతో జరిగే సమావేశంలో ప్రస్తావిస్తామని చెప్పారు. పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని కేంద్రం చెప్పిందని గుర్తు చేశారు. ఈలోగా తాత్కాలిక రాజధానిని నిర్మించుకుని, ప్రజలకు తక్షణ అవసరమైన శాఖలను దశలవారీగా తరలించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.రాజధాని స్వరూప స్వభావాలు, పరిపాలనపై ప్రభుత్వం ఉద్యోగులతో చర్చించాలని డిమాండ్ చేశారు. హెల్త్‌కార్డులపై నేడు సీఎం సమావేశం.. ఉద్యోగులకు హెల్త్‌కార్డులు అందించే అంశాన్ని చర్చించేందుకు మంగళవారం సీఎం నిర్వహించే సమావేశంలో ఆ పథకం అమలులో లోపాలను చర్చించడంతో పాటు ఉద్యోగుల సమస్యలను ఆయన దృష్టికి తెస్తామని అశోక్‌బాబు చెప్పారు -
రాజధాని విజయవాడే: కోడెల
-
రాజధాని విజయవాడే: కోడెల
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా విజయవాడ 99శాతం ఖరారైందని శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ అన్నారు. శనివారం విజయవాడలో ఆంధ్ర హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన హార్ట్ అండ్ బ్రెయిన్ ఇనిస్టిట్యూట్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర రాజధాని విషయంలో దాదాపు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నుంచి విజయవాడ కార్యాలయాలు రాత్రికి రాత్రే తరలించడం సాధ్యం కాదని, ఇక్కడ అందుబాటులో ఉన్న భవనాలను బట్టి ఒక్కొక్కటీ తరలిస్తారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో క్యాంపు కార్యాలయం ఏర్పాటుచేయనున్నారని చెప్పారు. అసెంబ్లీని తరలించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. మూడు నెలల్లో విజయవాడ నుంచే పాలన: మూడు నెలల్లోగా తాత్కాలిక రాజధానిలో ప్రభుత్వ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని రాజధాని కమిటీ చైర్మన్, మంత్రి నారాయణ చెప్పారు. శనివారం ఆయన గన్నవరంలోని మేథాటవర్స్తో పాటు, విజయవాడలో టూరిజం శాఖకు చెందిన భవనాలను పరిశీలించారు. -
'రాజధాని ప్రకటనలో నీ ఆంతర్యం ఏంటీ బాబు'
-
'రాజధాని ప్రకటనలో నీ ఆంతర్యం ఏంటీ బాబు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తాత్కాలిక రాజధానిని ప్రకటించడంలో గల ఆంతర్యం ఏమిటని చంద్రబాబు ప్రభుత్వాన్ని మాజీ పీసీసీ చీఫ్, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. గురువారం హైదరాబాద్‌లో బొత్స విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట రాజధాని ఎంపికపై కేంద్రం ప్రొ.శివరామకృష్ణన్ కమిటీ ని నియమించిందని గుర్తు చేశారు. ఆ కమిటీ ఇంకా నివేదిక ఇవ్వకుండానే తాత్కాలిక రాజధాని అంటూ చంద్రబాబు నాయుడు ప్రకటన చేయడం దారుణమని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ మాట అధికారంలోకి వచ్చాక మరో మాట్లాడటం ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకే చెల్లిందంటూ చంద్రబాబును బొత్స విమర్శించారు. విభజన నేపథ్యంలో 10 ఏళ్ల వరకు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా హైదరాబాద్ ఉంటుందని... ఈ తరుణంలో తాత్కాలిక రాజధానిగా విజయవాడను ఎందుకు తెరపైకి తీసుకువచ్చారో వెల్లడించాలని బొత్స ఈ సందర్భంగా బాబును డిమాండ్ చేశారు. -
తాత్కాలిక రాజధాని విజయవాడే!
దశలవారీగా సర్కారు కార్యాలయాల తరలింపునకు ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశం వచ్చే నెల తొలి వారం కల్లా కొన్ని ప్రభుత్వ శాఖల తరలింపు తొలుత శాఖల అధిపతులు, ఆ తర్వాత సిబ్బంది బెజవాడకు గన్నవరం వద్ద గల ‘మేధా టవర్స్’ను పరిశీలించాలన్న బాబు అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాల పరిశీలనకూ సూచన ఇప్పటికే రెండు శాఖలు విజయవాడ నుంచే పనిచేస్తున్న వైనం విజయవాడ, గుంటూరు పరిసరాల్లో శాఖలకు అనువైన ప్రభుత్వ భూములను గుర్తించే ప్రక్రియ షురూ రాజధాని సలహా కమిటీతో ముఖ్యమంత్రి భేటీలో ఆదేశాలు ఇలా కార్యాలయాలను తరలిస్తే వసతి సౌకర్యాలు ఎలా అంటూ అధికారుల ఆందోళన సాక్షి, విజయవాడ/హైదరాబాద్: కృష్ణా జిల్లా విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తాత్కాలిక రాజధానిని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిర్ణయించారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి పనిచేస్తున్న ప్రభుత్వ కార్యాలయాలను దశల వారీగా విజయవాడకు తరలించాలని సూచించారు. రాష్ట్రానికి నూతన రాజధాని ఎంపిక కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ మరో వారం రోజుల్లో తన నివేదికను కేంద్రానికి సమర్పించనున్న తరుణంలో.. తాత్కాలిక రాజధాని ఏర్పాటుపై సీఎం నిర్ణయం తీసుకోవడం గమనార్హం. చంద్రబాబు మంగళవారం లేక్‌వ్యూ అతిథిగృహంలోని తన క్యాంపు కార్యాలయంలో.. రాజధాని నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన సలహా కమిటీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కమిటీ చైర్మన్, రాష్ట్ర మంత్రి పి.నారాయణతో పాటు సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెకెన్సీ సంస్థ ప్రతినిధులు ‘విజన్ ఫర్ ఏపీ క్యాపిటల్’ పేరుతో దేశం, ప్రపంచంలోని వివిధ రాజధాని నగరాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. విజయవాడను తాత్కాలిక రాజధానిగా చేసుకోవాలని, అన్ని ప్రధాన శాఖల కార్యాలయాలు తాత్కాలిక రాజధాని నగరంలో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రజలతో సంబంధం ఉన్న శాఖల అధిపతుల కార్యాలయాలను తొలుత విజయవాడ తరలించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్దేశించారు. ఆ తరువాత దశల వారీగా మిగిలిన శాఖాధిపతుల కార్యాలయాలను తరలించాలని చెప్పారు. ముందు నుంచీ ప్రచారం చేస్తున్నట్లుగానే... రాష్ట్ర మంత్రులు, తెలుగుదేశం పార్టీ నాయకులు విజయవాడే కొత్త రాజధాని అవుతుందని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక రాజధానిగా అదే నగరాన్ని ప్రకటించడం గమనార్హం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనుగోలు చేసిన వాహనాలకు విజయవాడ చిరునామాగా రిజిస్ట్రేషన్లు చేపడుతుండగా, అదనపు డీజీ స్థాయి అధికారిని నగర పోలీస్ కమిషనర్‌గా నియమించిన విషయం తెలిసిందే. విజయవాడను తాత్కాలిక రాజధానిగా చేసుకుని పాలన కొనసాగించాలంటూ గత నెల రోజులుగా అంతర్గతంగా సాగుతున్న కసరత్తుకు అనుగుణంగా చంద్రబాబు సర్కారు అధికారికంగా నిర్ణయం తీసుకోవటంతో.. ప్రధాన శాఖలను తరలించే కసరత్తు ఊపందుకోనుంది. ఇప్పటికే రెండు శాఖల తరలింపు... ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రెండు కీలక శాఖలు ఇప్పటికే విజయవాడ నుంచి పనిచేస్తున్నాయి. నీటి పారుదల శాఖ కార్యకలాపాల కోసం మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విజయవాడలో తన క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ క్యాంప్ కార్యాలయం కూడా ఏర్పాటైంది. రాష్ట్ర స్థాయి సమీక్షలు మొత్తం విజయవాడలోనే సాగుతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కూడా విజయవాడ నుంచే తన శాఖ కార్యకలాపాల వేగం పెంచారు. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో తన క్యాంపు కార్యాలయంతో పాటు, ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారుల కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు ప్రారంభించారు. దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు విజయవాడకు 15 కిలోమీటర్ల దూరంలోని పోరంకిలో దేవాదాయశాఖ నిర్మించిన వృద్ధాశ్రమం భవనాలను తన క్యాంపు కార్యాలయంగా, ఆ శాఖ కమిషనర్, ఇతర ఉన్నతాధికారుల కార్యాలయాలుగా ఏర్పాటు చేసుకోవడానికి నిర్ణయించారు. వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సైతం తన శాఖ ఉన్నతాధికారుల కార్యాలయాలను విజయవాడకు తరలించే ఏర్పాట్లలో పడ్డారు. గృహ నిర్మాణ, అటవీ, పంచాయితీరాజ్, రహదారులు, భవనాల శాఖలను తొలుత తరలించే అవకాశం ఉంది. మేథా టవర్స్‌లో ఏర్పాట్లపై నివేదిక... సీఎం చంద్రబాబు విజయవాడ ఎప్పుడు వచ్చినా స్టేట్ గెస్ట్‌హౌస్‌లోనే బసచేస్తున్నారు. దీనిని తాత్కాలికంగా క్యాంపు కార్యాలయంగా వాడుకోవచ్చని అధికారులు చెప్తున్నారు. ఇక గన్నవరం సమీపంలోని ‘మేథా టవర్స్’లో రాష్ట్ర స్థాయిలోని 11 శాఖలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆ భవ నంలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన మార్పులు చేర్పులు చేయడం కోసం కృష్ణా జిల్లా కలెక్టర్‌ను నివేదిక కూడా కోరింది. ఇక్కడ రవాణా, ఐటీ, వైద్య ఆరోగ్యం, పంచాయతీరాజ్, సహకార, ఆర్ అండ్ బీ, విద్య, వ్యవసాయ, ఎక్సైజ్, సంక్షేమ, వాణిజ్య పన్నుల శాఖలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి. ఈ నెలాఖరులోగా ఈ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు, సిబ్బందిని ఇక్కడికి తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. ప్రస్తుతం విజయవాడ నగర సీపీ కార్యాలయాన్ని తాత్కాలిక డీజీపీ కార్యాలయంగా వాడుకోవచ్చని చెప్తున్నారు. అలాగే.. గన్నవరంలోని ప్రాంతీయ శిక్షణా కశాశాలలోని 25 ఎకరాల స్థలంలో ఆర్టీసీ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రతిపాదనలు తయారయ్యాయి. దీంతో పాటు విజయవాడ, గుంటూరు నగరాలకు చుట్టుపక్కల 10 కిలోమీటర్ల దూరంలో 5 నుంచి 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ భూముల వివరాలను కూడా ప్రభుత్వం సేకరించింది. ఈ స్థలాలను ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు కేటాయించేందుకు పరిశీలిస్తోంది. దీంతో పాటు విజయవాడకు సమీపంలో అద్దెకు తీసుకోవడానికి అనువైన భవనాలు ఏమున్నాయో వాటి వివరాలను కూడా ప్రభుత్వం జిల్లా అధికార యంత్రాంగం నుంచి సేకరిస్తోంది. వసతి సదుపాయాలు ఎక్కడ? రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు పెద్ద సంఖ్యలో విజయవాడకు తరలితే ఒక్కసారిగా వందలాది మంది అధికారులు, ఉద్యోగులు ఇక్కడికి తరలిరావాల్సి ఉంటుంది. ఈ కార్యాలయాల్లో పనుల కోసం వచ్చే జనాభా కూడా పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో విజయవాడలో ఇంత మందికి వసతి దొరకడం కష్టమవుతుందని ఐఏఎస్ అధికారులతో పాటు ఇతర ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. ఎలాంటి సదుపాయాలు కల్పించకుండా అత్యవసరంగా విజయవాడకు తరలివెళ్లాలంటే ఎలా కుదురుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శాఖల తరలింపు కోసం ప్రభుత్వం తీవ్రంగా ఒత్తిడి తెస్తే ముందుగా కొందరు అధికారులు, సిబ్బందిని మాత్రమే పంపాలని ఆయా విభాగాల ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అక్టోబర్ కల్లా కమిటీ ‘విదేశీ అధ్యయనం’ పూర్తి నూతన రాజధాని ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా 16 శాతం పచ్చదనంతో తీర్చిదిద్దాలని రాజధాని సలహా కమిటీతో భేటీలో సీఎం చంద్రబాబు సూచించారు. పాఠశాలలు, ఆసుపత్రులు తదితర సామాజిక మౌలిక వసతులకు సమాన ప్రాధాన్యతనివ్వాలన్నారు. ప్రభుత్వ, నివాస, వాణిజ్య, సాంస్కృతిక కార్యకలాపాలకు భూ పంపిణీ అంశాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని చెప్పారు. ఆగస్టు నెలాఖరులోగా నయా రాయపూర్, నవీ ముంబై, గాంధీనగర్, చండీగఢ్‌లను, అక్టోబర్ ఆఖరుకల్లా బ్రె సీలియా, సింగపూర్, పుత్రజయ (మలేసియా), దక్షిణాసియా, ఐరోపా, చైనా, జపాన్, కొరియా, మధ్య ప్రాచ్య దేశాలు, నగరాలను సందర్శించి అధ్యయనం పూర్తి చేస్తామని కమిటీ సభ్యులు ఈ సందర్భంగా సీఎంకు తెలిపారు. మేధా టవర్స్‌ను పరిశీలించండి... ళీ విజయవాడ సమీపంలోని గన్నవరం వద్ద ఐటీ కంపెనీల స్థాపనకు దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఐఐసీ నేతృత్వంలో 2006 లో మేథా టవర్స్ నిర్మించారు. ఇందులో రెండు లక్షల చదరపు అడుగుల స్థలం ఉండగా.. అందులో 20 వేల చదరపు అడుగుల్లోనే ఐటీ సంస్థలు ఏర్పాటు చేశారు. మిగిలిన 1.80 లక్షల చదరపు అడుగుల స్థలం ఖాళీగా ఉంది. అందులో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు అంశాన్ని పరిశీలించాల్సిందిగా అధికారులకు సీఎం సూచించారు. విజయవాడలో వైశాల్యం ఎక్కువగా ఉండి అందుబాటులో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను కూడా పరిశీలించాలని చెప్పారు. -
కొందరికి లబ్ది చేకూర్చడానికే తాత్కాలిక రాజధాని!
విశాఖపట్నం: తాత్కాలిక రాజధానిగా విజయవాడ ఏర్పాటుపై మాజీ పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ అభ్యంతరం లేవనెత్తారు. టీడీపీలోని కొందరు వ్యక్తులకు ఆర్ధిక లాభం చేకూర్చడానికే తాత్కాలిక రాజధానిగా విజయవాడను ఏర్పాటు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ తాత్కాలిక రాజధాని ఉండగా మరో తాత్కాలిక రాజధాని ఎందుకు అని బొత్స ప్రశ్నించారు. అఖిలపక్ష సమావేశం నిర్వహించకుండా ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన అన్నారు. తాత్కాలిక రాజధాని ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాస్తామని బొత్స అన్నారు. -
విజయవాడ తాత్కాలిక రాజధాని దేనికి సంకేతం?
-
తాత్కాలిక రాజధానిగా విజయవాడ
-
తాత్కాలిక రాజధానిగా విజయవాడ
హైదరాబాద్: అత్యంత ఆధునిక వసతులతో కొత్త రాజధాని నిర్మాణం జరిగే లోపల తాత్కాలిక రాజధానిని ఏర్పాటు చేసుకోవలసిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధాని సలహా కమిటీ సభ్యులతో ఈరోజు ఆయన ఇక్కడ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో, ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా కొత్త రాజధాని నిర్మాణం జరగాలన్నారు. తాత్కాలిక రాజధానిగా విజయవాడను ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ దిశగానే ప్రభుత్వం ఆలోచన సాగుతోంది. ముందుగా శాఖాధిపతుల కార్యాలయాలు విజయవాడకు తరలించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. . ప్రభుత్వ కార్యాలయాలకు విజయవాడలో అందుబాటులో ఉన్న భవనాలను పరిశీలించాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. గన్నవరం విమానాశ్రయం వద్ద ఉన్న మేధ భవనాన్ని పరిశీలించవలసిందిగా ప్రభుత్వం ఆదేశించింది. కార్యాలయ భవనాలతోపాటు ఉద్యోగులు నివాసం ఉండేందుకు కూడా అవకాశాలను పరిశీంచమని ఆదేశాలు జారీ అయ్యాయి. -
'సీమాంధ్రకు హైదరాబాద్ తాత్కలిక రాజధాని మాత్రమే'
హైదరాబాద్ నగరం సీమాంధ్రకు తాత్కాలిక రాజధానిగా మాత్రమే ఉంటుందని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్‌లో పాల్వాయి గోవర్థన్ రెడ్డి విలేకర్లలతో మాట్లాడుతూ... హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాదని తెలంగాణకు మాత్రమే రాజధాని అని ఆయన పేర్కొన్నారు. కొంత మంది నాయకులు డిమాండ్ చేస్తున్నట్లు రాయల్ తెలంగాణ సాధ్యం కాదని తెలిపారు. హైదరాబాద్ నగరంలో నివసించే సీమాంధ్రుల భద్రతకు ప్రత్యేక చట్టాలు అవసరం లేదని పాల్వాయి గోవర్థన్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా ఏర్పడుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలో కూడా గోదావరి నదిపై రెండు జాతీయ ప్రాజెక్టులు నిర్మించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంతానపల్లి, సూరారం వద్ద రెండు మేజర్ ప్రాజెక్టులు నిర్మిస్తే రెండు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ప్రాంతాల వారిగా విధానాలు మార్చుకుంటు ప్రజలను మభ్యపెడుతుందని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై తెలంగాణ టీడీపీ నేతలు త్వరలోనే తిరగబడతారని తెలిపారు. చంద్రబాబుకు అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణ ప్రాంతాల్లో రాజకీయ భవిష్యత్తు ఉండదని జోస్యం చెప్పారు.