
రాజధాని విజయవాడే: కోడెల
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా విజయవాడ 99శాతం ఖరారైందని శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ అన్నారు. శనివారం విజయవాడలో ఆంధ్ర హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన హార్ట్ అండ్ బ్రెయిన్ ఇనిస్టిట్యూట్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర రాజధాని విషయంలో దాదాపు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నుంచి విజయవాడ కార్యాలయాలు రాత్రికి రాత్రే తరలించడం సాధ్యం కాదని, ఇక్కడ అందుబాటులో ఉన్న భవనాలను బట్టి ఒక్కొక్కటీ తరలిస్తారన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో క్యాంపు కార్యాలయం ఏర్పాటుచేయనున్నారని చెప్పారు. అసెంబ్లీని తరలించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. మూడు నెలల్లో విజయవాడ నుంచే పాలన: మూడు నెలల్లోగా తాత్కాలిక రాజధానిలో ప్రభుత్వ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని రాజధాని కమిటీ చైర్మన్, మంత్రి నారాయణ చెప్పారు. శనివారం ఆయన గన్నవరంలోని మేథాటవర్స్‌తో పాటు, విజయవాడలో టూరిజం శాఖకు చెందిన భవనాలను పరిశీలించారు.