
'సీమాంధ్రకు హైదరాబాద్ తాత్కలిక రాజధాని మాత్రమే'
హైదరాబాద్ నగరం సీమాంధ్రకు తాత్కాలిక రాజధానిగా మాత్రమే ఉంటుందని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్లో పాల్వాయి గోవర్థన్ రెడ్డి విలేకర్లలతో మాట్లాడుతూ... హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాదని తెలంగాణకు మాత్రమే రాజధాని అని ఆయన పేర్కొన్నారు. కొంత మంది నాయకులు డిమాండ్ చేస్తున్నట్లు రాయల్ తెలంగాణ సాధ్యం కాదని తెలిపారు.
హైదరాబాద్ నగరంలో నివసించే సీమాంధ్రుల భద్రతకు ప్రత్యేక చట్టాలు అవసరం లేదని పాల్వాయి గోవర్థన్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా ఏర్పడుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలో కూడా గోదావరి నదిపై రెండు జాతీయ ప్రాజెక్టులు నిర్మించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంతానపల్లి, సూరారం వద్ద రెండు మేజర్ ప్రాజెక్టులు నిర్మిస్తే రెండు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుందని చెప్పారు.
తెలుగుదేశం పార్టీ ప్రాంతాల వారిగా విధానాలు మార్చుకుంటు ప్రజలను మభ్యపెడుతుందని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై తెలంగాణ టీడీపీ నేతలు త్వరలోనే తిరగబడతారని తెలిపారు. చంద్రబాబుకు అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణ ప్రాంతాల్లో రాజకీయ భవిష్యత్తు ఉండదని జోస్యం చెప్పారు.