
విజయవాడ
హైదరాబాద్: అత్యంత ఆధునిక వసతులతో కొత్త రాజధాని నిర్మాణం జరిగే లోపల తాత్కాలిక రాజధానిని ఏర్పాటు చేసుకోవలసిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధాని సలహా కమిటీ సభ్యులతో ఈరోజు ఆయన ఇక్కడ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో, ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా కొత్త రాజధాని నిర్మాణం జరగాలన్నారు.
తాత్కాలిక రాజధానిగా విజయవాడను ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ దిశగానే ప్రభుత్వం ఆలోచన సాగుతోంది. ముందుగా శాఖాధిపతుల కార్యాలయాలు విజయవాడకు తరలించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. . ప్రభుత్వ కార్యాలయాలకు విజయవాడలో అందుబాటులో ఉన్న భవనాలను పరిశీలించాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. గన్నవరం విమానాశ్రయం వద్ద ఉన్న మేధ భవనాన్ని పరిశీలించవలసిందిగా ప్రభుత్వం ఆదేశించింది. కార్యాలయ భవనాలతోపాటు ఉద్యోగులు నివాసం ఉండేందుకు కూడా అవకాశాలను పరిశీంచమని ఆదేశాలు జారీ అయ్యాయి.