సాక్షి, అమరావతి: రాష్ట్ర నుంచి పెట్టుబుడులు వెళ్లిపోతున్నాయని దుష్ప్రచారం చేస్తున్నారని.. ఏ పెట్టుబడులు వెళ్లిపోయాయో చంద్రబాబు, లోకేష్ చెప్పాలని మంత్రి బొత్స సత్యనారాయణ సూటిగా ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల కోసమే అని అన్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను కొనసాగించే విధంగా సీఎం జగన్ పాలన ఉందని పేర్కొన్నారు. స్టార్టప్ ప్రాజెక్ట్‌పై సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ప్రకటన చేశారని తెలిపారు. అదేవిధంగా సింగపూర్ కంపెనీలను ప్రాజెక్ట్‌పై పలు వివరాలు కోరినట్టు పేర్కొన్నారు. వాళ్లు చెబుతున్న ఆదాయం ఎలా వస్తుందో చూపించమన్నామని, 15 రోజులు కిందటే ఈ విషయం చెప్పామని గుర్తు చేశారు. వాళ్ల దగ్గర సరైన ప్రణాళిక లేక తామే ప్రాజెక్ట్ నుంచి ఉపసంహరించుకుంటామని సింగపూర్ మంత్రి ఈశ్వరన్ వెల్లడించారని తెలిపారు. రాష్ట్రంలో ఇతర రంగాల్లో పెట్టుబడి పెడతామని వారు ప్రకటించారని మంత్రి బొత్స పేర్కొన్నారు.
కానీ చంద్రబాబు, లోకేష్‌లు 15 రోజుల తరువాత విమర్శలు చేస్తున్నారని బొత్స ఆగ్రహించారు. నాలుగు రోజులు ఆగితే రాష్ట్రానికి పెట్టుబడులు ఎంత ఎక్కువగా వస్తాయో చూస్తారన్నారు. పారదర్శకమైన పాలన అందిస్తేనే పెట్టుబడులు వస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే సీఎం జగన్ ప్రభుత్వం పారదర్శకంగా పాలిస్తోందని చెప్పారు. రాజధానిలో టీడీపీ నేతలు పర్యటించి.. 95 శాతం ఎక్కడ నిర్మించారో చూపించాలన్నారు. చంద్రబాబు హయాంలోనే బీఆర్శెట్టి సంస్థ, మరో సంస్థ వెళ్లిపోయాయని బొత్స మండిపడ్డారు. మరి చంద్రబాబు దానికేం సమాధానం చెబుతారని ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు ఇసుక దోచుకుని.. ఇప్పుడు దీక్ష చేస్తాడట అంటూ దుయ్యబట్టారు. ‘ఉచిత ఇసుక అన్నావు, రాష్ట్రంలో ఎక్కడైనా ఉచిత ఇసుక ఇచ్చావా, చూపిస్తే తలదించుకుంటా’ అని బొత్స అన్నారు. చంద్రబాబు బాగా పాలిస్తే ఎందుకు ప్రజలు ఘోరంగా ఓడించారని బొత్స సత్యనారాయణ విమర్శించారు.
పవన్ కల్యాణ్ మట్టిలో కలిసిపోతారంటూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నాడు.. ఆ ఆక్రోశం దేనికి రాజకీయాల్లో ఉండాల్సిన లక్షణమేనా అని బొత్స వ్యాఖ్యలు చేశారు. పవన్ కడుపు మంట, ఆక్రోశం దేనికని ఆయన సూటిగా ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవాలి.. కానీ పేదల పిల్లలు చదవకూడదా అని బొత్స మండిపడ్డారు. తమాషాలు చేస్తున్నావా.. నోరు నీకే ఉందనుకుంటున్నవా అని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంగ్లీష్ భాషపై పట్టులేకపోతే విద్యార్థులకు భవిష్యత్ ఎలా అని బొత్స ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment