
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ, జనసేన పార్టీ కలయికపై సెటైరికల్ కామెంట్స్ చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. జనసేన-టీడీపీ కలయిక చారిత్రాత్మక అవసరమన్నారు. 2014లో వీరిద్దరూ కలవలేదా?. అప్పుడు చారిత్రాత్మక అవసరం కాదా? అప్పుడు మూడు పార్టీలు కలిశాయి కదా.. అప్పుడేమైందని బొత్స ప్రశ్నించారు.
కాగా, మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ..‘నారా లోకేష్‌కు రెడ్ బుక్ ఎందుకు?. ప్రజాస్వామ్యంలో బ్లూ బుక్ ఉండాలి.. రెడ్ బుక్ కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలు వినాలి.. పరిష్కరించే ఆలోచన చేయాలి. ఇదేమీ రాచరికం కాదు. పుంగనూరు ఘటనలో బాధ్యులు ఎవరు.. చంద్రబాబు కాదా?. 2014 ఎన్నికల్లో వీరంతా పొత్తులు పెట్టుకున్నారు. కొంత కాలం విడాకులు ఇచ్చి మళ్లీ కలిశారా?. రాజకీయ అవసరం కోసం పార్టీలు కలవడం తప్పు కాదు. గతంలో ఈ కలయికతో ప్రజలను మోసం చేశారు.
అందుకే ఇప్పుము మేము.. టీడీపీ-జనసేన కలయికను తప్పు పడుతున్నాం. యజ్ఞాన్ని మాంసం ముక్క వేసి చెడగొట్టినట్టు విశాఖ రాజధానిని అడ్డుకుంటున్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు అథారిటీ టెండర్‌ను ఎవరు రద్దు చేశారు. అప్పటి మంత్రి కాదా?. కేసులను పరిష్కరించి భోగాపురం విమానాశ్రయం పనులను మా ప్రభుత్వం ప్రారంభించింది’ అని కామెంట్స్ చేశారు.