ప్రైవేట్ బస్సులు స్టేజీ క్యారేజీలుగా నో
రెండుసార్లు కేసు నమోదైతే పర్మిట్ రద్దు: బొత్స
సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టు క్యారేజీలుగా అనుమతులు తీసుకున్న బస్సులను స్టేజీ క్యారేజీలుగా తిరగడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని రవాణా మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విమానాల్లో మాదిరిగా ఆర్టీసీ ఏసీ బస్సుల్లోనూ భద్రతాపరమైన సూచనలపై అవగాహన కల్పించడానికి రూపొందించిన డీవీడీని శనివారం బస్‌భవన్‌లో ఆయన ఆవిష్కరించారు. ఆర్టీసీ చైర్మన్ ఎం.సత్యనారాయణరావు, రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్థసారథి, రవాణా కమిషనర్ అనంతరాము, ఆర్టీసీ ఎండీ జె.పూర్ణచంద్రరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి బొత్స విలేకరులతో మాట్లాడారు. స్టేజీ క్యారియర్లుగా తిప్పితే చర్యలు తప్పవని, రెండుసార్లు కేసులు నమోదైనే పర్మిట్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ఆర్టీసీ ఏసీ బస్సుల్లో బయలుదేరే ముందు భద్రతాపరమైన సూచనల డీవీడీని టీవీలో ప్రదర్శిస్తారని చెప్పారు. కాంట్రాక్టు క్యారేజీల్లోనూ ఈ విధానాన్ని పాటించాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పాలెం వోల్వో బస్సు ప్రమాద బాధిత కుటుంబాల పట్ల సానుభూతి ఉన్నా పరిహారం పెంచలేమన్నారు. వారికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించలేమన్నారు. ఆర్టీసీలో కారుణ్య నియామకాలు భవిష్యత్‌లోనూ కొనసాగుతాయని తెలిపారు. కాగా ఇప్పటికే 9,920 కండక్టర్, 14,657 డ్రైవర్ పోస్టుల నియామకానికి ఆర్టీసీ ఎండీకి అనుమతి ఇస్తూ రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.