private busses
-
ప్రైవేట్ బస్సులు స్టేజీ క్యారేజీలుగా నో
రెండుసార్లు కేసు నమోదైతే పర్మిట్ రద్దు: బొత్స సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టు క్యారేజీలుగా అనుమతులు తీసుకున్న బస్సులను స్టేజీ క్యారేజీలుగా తిరగడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని రవాణా మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విమానాల్లో మాదిరిగా ఆర్టీసీ ఏసీ బస్సుల్లోనూ భద్రతాపరమైన సూచనలపై అవగాహన కల్పించడానికి రూపొందించిన డీవీడీని శనివారం బస్‌భవన్‌లో ఆయన ఆవిష్కరించారు. ఆర్టీసీ చైర్మన్ ఎం.సత్యనారాయణరావు, రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్థసారథి, రవాణా కమిషనర్ అనంతరాము, ఆర్టీసీ ఎండీ జె.పూర్ణచంద్రరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స విలేకరులతో మాట్లాడారు. స్టేజీ క్యారియర్లుగా తిప్పితే చర్యలు తప్పవని, రెండుసార్లు కేసులు నమోదైనే పర్మిట్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ఆర్టీసీ ఏసీ బస్సుల్లో బయలుదేరే ముందు భద్రతాపరమైన సూచనల డీవీడీని టీవీలో ప్రదర్శిస్తారని చెప్పారు. కాంట్రాక్టు క్యారేజీల్లోనూ ఈ విధానాన్ని పాటించాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పాలెం వోల్వో బస్సు ప్రమాద బాధిత కుటుంబాల పట్ల సానుభూతి ఉన్నా పరిహారం పెంచలేమన్నారు. వారికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించలేమన్నారు. ఆర్టీసీలో కారుణ్య నియామకాలు భవిష్యత్‌లోనూ కొనసాగుతాయని తెలిపారు. కాగా ఇప్పటికే 9,920 కండక్టర్, 14,657 డ్రైవర్ పోస్టుల నియామకానికి ఆర్టీసీ ఎండీకి అనుమతి ఇస్తూ రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
ప్రైవేటు ట్రావెల్స్‌పై కొరడా
ఆర్టీఏ అధికారుల తనిఖీలు.. ఆరు ట్రావెల్ సంస్థలపై కేసులు సాక్షి, విజయవాడ/హైదరాబాద్: నిబంధనలు పాటించని ప్రైవేటు ట్రావెల్స్‌పై రవాణా శాఖ (ఆర్టీఏ) అధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. సోమవారం హైదరాబాదాద్, విజయవాడలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. విజయవాడలో తనిఖీలను చిత్రీకరిస్తున్న మీడియాపై ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు దాడికి దిగాయి. సాక్షితో పాటు ఇతర మీడియా కెమేరాలను ట్రావెల్స్ సిబ్బంది లాక్కొని అసభ్య పదజాలంతో దూషించారు. విజయవాడలో సోమవారం తనిఖీలు చేపట్టారు. అన్లైన్ బుకింగ్‌లపై దృష్టి పెట్టారు. ఈ సందర్భంగా పలు అక్రమాలు వెలుగుచూశాయి. బెంగళూరుకు పర్మిట్ తీసుకుని నెల్లూరు, తిరుపతి తదితర ప్రాంతాలకు టిక్కెట్లు అమ్మినట్లు గుర్తించారు. ఈ సంస్థలపై కేసులు నమోదు చేస్తామని ఆర్టీఏ అధికారులు తెలిపారు. దాడుల విషయాన్ని తెలుసుకున్న మీడియా అక్కడికి వెళ్లి చిత్రీకరిస్తుండగా యాజమాన్యాలు తమ సిబ్బందిని రెచ్చగొట్టి దాడికి పురికొల్పాయి. దీంతో సిబ్బంది కెమేరాలు లాక్కుని విరగ్గొట్టే ప్రయత్నం చేశారు. దాడికి దిగిన ముగ్గురిని మీడియా సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నేటి నుంచే పర్మిట్ల రద్దు అమల్లోకి: హైదరాబాద్ లకడీకాపూల్‌లోని ప్రైవేటు ట్రావెల్స్ బుకింగ్ కార్యాలయాలలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆన్లైన్ ద్వారా ప్రయాణికులను బుక్ చేసుకోవడం, వ్యక్తిగత టిక్కెట్లు ఇవ్వడం, ట్రావెల్ బుకింగ్ ఏజెంట్ లెసైన్స్ లేకపోవడం వంటి ఉల్లంఘనలకు పాల్పడుతున్న ఆరు ట్రావెల్ సంస్థలపై కేసులు నమోదు చేశారు. కేశినేని, కాళేశ్వరి, కేబీఎన్, కృష్ణా, ధనుంజయ, బాలాజీ ట్రావెల్స్ వీటిలో ఉన్నాయి. ఆర్టీఏ హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్(జేటీసీ) రఘునాథ్ విలేకరులతో మాటాడుతూ ఇకపై నిబంధనలను పాటించని బస్సుల పర్మిట్లను సస్పెండ్ చేస్తామని, మంగళవారం నుంచి ఇది అమల్లోకి వస్తుందని చెప్పారు. -
ఐదు ప్రైవేటు బస్సుల సీజ్
సదాశివపేట/జహీరాబాద్, న్యూస్‌లైన్ : జిల్లాలో నిబంధనలు పాటించని ఐదు ప్రైవేటు బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. ఇందులో సదాశివ పేటలో రెండు, జహీరాబాద్‌లో మూడు ఉన్నాయి. సదాశివపేటలో గురువారం రెండు ప్రైవేటు బస్సులను సీజ్ చేసినట్లు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ) మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్ వద్ద ఆయన ఆధ్వర్యంలో సి బ్బంది ప్రైవేటు బస్సులను తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబుబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన ప్రమాదాన్ని దృష్టిలో ప్రతి రోజూ ట్రావెల్స్ బస్సులను తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే ఒమర్, సహారా ట్రావెల్స్‌కు చెందిన బస్సుల్లో ప్రయాణికుల వివరాల జాబితా, ఇద్దరు డ్రైవర్లు లేనందువల్ల వాటిని సీజ్ చేసి పోలీసులకు అప్పగించామని మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. తనిఖీల కార్యక్రమంలో సహా య మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు బీ కిరణ్‌కుమార్, బాబులు పాల్గొన్నారు. జహీరాబాద్ : పర్మిట్ లేక పోవడం, ప్రయాణికుల వివరాలు సక్రమంగా లేక పోవడం, ట్యాక్స్ బకాయి పడడం తదితర కారణాలతో జహీరాబాద్‌లో మూడు ప్రైవేటు బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. గురువారం అల్గోల్ రోడ్డులో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ) గణేష్ వాహనాలను తనిఖీ చేశారు. ముంబాయి నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న ఒమర్ ట్రావెల్స్ బస్సును నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నందున సీజ్ చేశాడు. అదేవిధంగా బీదర్ క్రాస్‌రోడ్డు వద్ద 9వ జాతీయ రహదారిపై ఎంవీఐ సుభాష్, ఏఎంవీఐలు మధుసూదన్, జయప్రకాష్‌రెడ్డిలు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు పాటించని కేశినేని, ఎస్వీఆర్ ట్రావెల్స్ బస్సులను సీజ్ చేశారు.